హైదరాబాద్:
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు
వైయస్ జగన్మోహన్ రెడ్డి అరెస్టు, ఆ పార్టీ గౌరవ
అధ్యక్షురాలు విజయమ్మ కన్నీళ్లు ప్రభావం చూపాయని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు,
పలువురు సీనియర్ నేతలు అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలోని
రెండు కాంగ్రెస్ పార్టీల్లో భవిష్యత్తులో ఒకటే మిగులుతుందని, అదేదో
చూడాల్సి ఉందని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
శనివారం జరిగిన పార్టీ పొలిట్బ్యూరో సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్య
చేసినట్లు సమాచారం.
జైల్లో
ఉన్న జగన్ సిబిఐ కేసులు,
ఈడి కేసులతో పీకల లోతున కూరుకుపోయి
ఉన్నాడని, వాటిలో శిక్ష పడితే ఆ
పార్టీ కథ ముగిసిపోయినట్లేనని అన్నారు. ఆయన
బయటకొస్తే కాంగ్రెస్ ఫినిష్ అన్నారు. రాష్ట్రంలో రెండూ మనుగడ సాధించడం
సాధ్యం కాకపోవచ్చునని, మన ప్రత్యర్థి ఎవరో
తేలడానికి కొంత సమయం పడుతుందని,
ఈలోపు మన పని మనం
చేసుకుందామని ఆయన అన్నారు.
వచ్చే
సాధారణ ఎన్నికల్లో గెలిచేందుకు పార్టీ శ్రేణుల్లో కసిని.. ప్రజల్లో పార్టీ పట్ల ప్రేమను పెంచుకోవాల్సిన
అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
'1995 నాటి చీలిక పరిణామాల్లో పార్టీని
కాపాడుకోవాలని పార్టీ శ్రేణులు, కిందిస్థాయి కార్యకర్తలు కసితో పనిచేశారు. దానివల్ల
పార్టీ నిలబడింది. ఇప్పుడు ఆ కసి లేదు.
ఇప్పుడు క్యాడర్లో ఆ కసిని
పెంచాలి. దూరమైన వర్గాలను దరిచేర్చుకోవాలి. ప్రజలు మనను ఆదరించి హత్తుకొనేలా
మనం పనిచేయాలి. ఈ రెండేళ్లకు ఇదే
మన ప్రణాళిక' అన్నారు.
బిసిలలో
పట్టు నిలుపుకోవడంపై సమావేశంలో చర్చ జరిగింది. ఎస్సీ
వర్గీకరణకు సంబంధించి పార్టీ వైఖరిలో స్పష్టత తేవాలని కడియం శ్రీహరి కోరారు.
ఇలాంటి అంశాలపై ఒకో పొలిట్బ్యూరో
సమావేశంలో ఒకోదాన్ని చర్చించి తేల్చేద్దామని చంద్రబాబు చెప్పారు. కాగా.. రాష్ట్రపతి ఎన్నికలో ప్రణబ్కు మద్దతు ఇవ్వాలని
కోరుతూ ప్రధాని మన్మోహన్, చంద్రబాబుకు ఫోన్ చేశారు. సంగ్మా
అభ్యర్థిత్వానికి మద్దతు ఇవ్వాలని కోరుతూ తమిళనాడు, ఒడిసా సీఎంలు జయలలిత,
నవీన్ పట్నాయక్ కూడా ఫోన్లు చేసినట్లు
బాబు తెలిపారు. పార్టీ వైఖరిని ఖరారు చేయడానికి మరికొంత
సమయం తీసుకోవాలని నిశ్చయించారు.
0 comments:
Post a Comment