హైదరాబాద్:
రాష్ట్రపతి ఎన్నికల అంశం తెలుగుదేశం పార్టీని
క్లిష్ట పరిస్థితిల్లోకి నెట్టిందనే చెప్పవచ్చు. ఏ నిర్ణయం తీసుకుంటే
ఏమవుతుందో అనే ఆందోళన ఆ
పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడులో
ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఆ కారణంగానే ఎన్నికల
గడువు దగ్గరపడినప్పటికీ ఆయన ఏ నిర్ణయాన్ని
అధికారికంగా ప్రకటించలేదని అంటున్నారు. ఓటు వేసినా, వేయకున్నా
లేక ఎవరికి వేసినా టిడిపిని ఇబ్బందుల్లోకి నెట్టే అంశమే అనే వ్యాఖ్యలు
వినిపిస్తున్నాయి.
యుపిఏ
అభ్యర్థి ప్రణబ్ ముఖర్జీకి ఓటు వేస్తే కాంగ్రెసుతో
టిడిపి కుమ్మక్కయ్యిందనే ఆరోపణలకు మరింత బలం చేకూర్చినట్లవుతుందని
ఆ పార్టీ నేతలు భావిస్తున్నారని తెలుస్తోంది.
గత కొంతకాలంగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు కాంగ్రెసుతో టిడిపి
కుమ్మక్కై తమ పార్టీని, పార్టీ
అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని
టార్గెట్ చేసుకుందని జోరుగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఇటీవల జరిగిన ఉప
ఎన్నికలలో కూడా ఇదే అంశాన్ని
జగన్ పార్టీ నేతలు ప్రజల్లోకి తీసుకు
వెళ్లారు.
అది నిజమా, అబద్దమా అనే విషయాన్ని పక్కన
పెడితే జగన్ పార్టీ నేతల
కుమ్మక్కు ప్రచారం టిడిపిని చావు దెబ్బ కొట్టిందనే
చెప్పవచ్చు. ఇప్పుడు ప్రణబ్‌కు మద్దతిస్తే ఆ
ఆరోపణలకు మరింత బలం చేకూర్చినట్లవుతుందని
భావిస్తున్నారు. ఇక పిఏ సంగ్మాకు
మద్దతిస్తే మతతత్వ పార్టీ బిజెపి సమర్థించిన అభ్యర్థికి ఓటు వేశారనే ఆరోపణలు
ఎదుర్కోవాల్సి ఉంటుందని అంటున్నారు. దీంతో ఇటు సంగ్మాకు,
అటు ప్రణబ్‌కు మద్దతిచ్చే స్థితిలో
టిడిపి లేదు.
మరో అభ్యర్థి బరిలో లేనందున ఓటింగ్‌కు దూరం కావాలనే
ఆలోచనతో బాబు ఉన్నట్లుగా ప్రచారం
జరుగుతోంది. ఓటు వేయక పోవడం
కూడా ఆ పార్టీకి నష్టం
చేకూర్చే అంశమే అంటున్నారు. ప్రజాస్వామ్యంలో
ఉన్న పార్టీ ఓటింగ్‌కు దూరంగా ఉండి
ప్రజలకు ఏం సంకేతాలు పంపిస్తుందనే
ప్రశ్న ఉదయిస్తుందని అంటున్నారు. రాష్ట్రపతి ఎన్నికలలో టిడిపి ఓటింగ్‌కు దూరంగా ఉంటే
భవిష్యత్తులో ఆ పార్టీకి.. ఓటు
వేయకుండా ఉండవద్దని ప్రజలకు చెప్పే నైతిక హక్కు ఉండదంటున్నారు.
0 comments:
Post a Comment