కరీంనగర్/హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు
వైయస్ జగన్మోహన్ రెడ్డిని మానుకోటలో అడ్డుకున్నట్లే ఆ పార్టీ గౌరవ
అధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మను అడ్డుకుంటామని
తెలంగాణ రాష్ట్ర సమితి సిరిసిల్ల శాసనసభ్యుడు
కల్వకుంట్ల తారక రామారావు సోమవారం
అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తెలంగాణపై స్పష్టమైన ప్రకటన చేయాలన్నారు.
తెలంగాణపై
స్పష్టమైన ప్రకటన చేయకుంటే జగన్‌కు ఎదురైన
అనుభవమే విజయమ్మకు ఎదురవుతుందన్నారు. సిరిసిల్లలో కంటే చీరాల, ధర్మవరంలలో
చేనేత కార్మికులు ఎక్కువగా ఉన్నారని విజయమ్మకు చిత్తశుద్ధి ఉంటే అక్కడ ఆందోళన
చేపట్టాలన్నారు. చేనేత కార్మికులపై ఆమె
మొసలి కన్నీరు కారుస్తున్నారన్నారు. చేనేత కార్మికులకు వైయస్
చెప్పింది కొండంత అయితే చేసింది గోరంత
అన్నారు ఆయన సైంధవ పాత్ర
పోషించారని మండిపడ్డారు.
మరోవైపు
హైదరాబాదులోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో విశాలాంధ్ర
నేత పరకాల ప్రభాకర్‌కు
మరోసారి తెలంగాణవాదుల నుండి చుక్కెదురయింది. తెలంగాణ
కోసం ప్రముఖ స్వతంత్ర సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ
ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం
ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి పరకాల
కూడా వచ్చారు. పరకాల మాట్లాడేటప్పుడు తెలంగాణవాదులు
ఆయనకు, విశాలాంధ్రకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఆయన ప్రసంగాన్ని అడ్డుకున్నారు. విశాలాంధ్ర నేతలు కరపత్రాలు పంచే
ప్రయత్నాలు చేశారు. దీనిని కూడా తెలంగాణవాదులు అడ్డుకున్నారు.
పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో చేసేది లేక
పరకాల ప్రభాకర్ సమావేశం నుండి బయటకు వెళ్లారు.
పోలీసులు కల్పించుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకు వచ్చారు.
0 comments:
Post a Comment