హైదరాబాద్:
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సీమాంధ్ర నాయకులు వ్యతిరేకించడానికి అసలు కారణం స్పష్టమవుతున్న
సూచనలు కనిపిస్తున్నాయి. వర్షాభావ పరిస్థితులు ఏర్పడడంతో కృష్ణా జలాల గొడవ రాష్ట్రంలో
ప్రారంభమైంది. కృష్ణా జలాల కోసం రాష్ట్రంలోని
మూడు ప్రాంతాల ప్రజలు కూడా పట్టుబడుతున్నారు. కృష్ణా
డెల్టాకు నాగార్జున సాగర్ నుంచి నీరు
విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో గొడవ ప్రారంభమైంది. నాగార్జునసాగర్
నీటి విడుదలను అడ్డుకోవడానికి నల్లగొండ జిల్లా తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకులు అడ్డుకోవడానికి ప్రయత్నించారు.
కృష్ణా
జలాలను కృష్ణా డెల్టాకు విడుదల చేయడాన్ని తాజాగా రాయలసీమలోని కర్నూలు జిల్లాకు చెందిన నాయకులు వ్యతిరేకించారు. కృష్ణా నదీ జలాలను శ్రీశైలం
ప్రాజెక్టు నుంచి తమకే విడుదల
చేయాలని కర్నూలు జిల్లా నాయకులు ఏరాసు ప్రతాపరెడ్డి, ఎస్పీవై
రెడ్డి తదితరులు సోమవారం ముఖ్యమంత్రిని కోరారు. పరిస్థితి చూస్తుంటే సీమాంధ్ర నాయకులు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించడానికి ముఖ్యంగా నదీ జలాలే కారణమని
భావిస్తున్నారు.
రాష్ట్రంలోని
రెండు ప్రధాన నదులు గోదావరి, కృష్ణాలు
తెలంగాణ మీదుగా ప్రవహిస్తాయి. ఈ నదులకు సంబంధంచిన
జలాల్లో తమకు దక్కాల్సిన వాటా
దక్కడం లేదని మొదటి నుంచి
తెలంగాణ నాయకులు విమర్శలు చేస్తున్నారు. తాజా వివాదంపై కాంగ్రెసు
సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు లగడపాటి రాజగోపాల్, రాయపాటి సాంబశివ రావు చేసిన వ్యాఖ్యలు
తెలంగాణ రాష్ట్రాన్ని వ్యతిరేకించడానికి ప్రధాన కారణం నదీ జలాలనే
విషయాన్ని తెలియజేస్తున్నాయి.
తెలంగాణ
ఏర్పాటుకు హైదరాబాదు మాత్రమే కారణమని ఇంతకాలం అనుకుంటూ వస్తున్నారు. హైదరాబాదు కూడా ఒక్క కారణం
కావచ్చు గానీ ప్రధానంగా నదీ
జలాలే కారణమని తాజా ప్రకటనలు తెలియజేస్తున్నారు.
రాష్ట్ర విభజన జరిగితే నీటి
యుద్ధాలు జరుగుతాయని లగడపాటి రాజగోపాల్ ఇటీవల అంటూ కృష్ణా
డెల్టాకు నీటి విడుదలపై చెలరేగిన
రగడను ఉదహరించారు. ఈ విషయాన్ని ఆయన
దాచి పెట్టలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే కోస్తాంధ్రకు నాగార్జున సాగర్ నుంచి నీటి
విడుదల విషయంలో ఆటంకం ఏర్పడుతుందనేది ఆయన
ప్రధాన ఆరోపణగా కనిపిస్తోంది.
ఇదిలా
ఉంటే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే నీటి యుద్ధాలు జరుగుతాయని
రాయపాటి సాంబశివ రావు సోమవారంనాడు అన్నారు.
నిజానికి, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండ్‌కు సంబంధించిన పలు
అంశాల్లో నదీ జలాల వాటా
కూడా ప్రధానమైంది. ఈ విషయాన్ని తెలంగాణ
నాయకులు దాచిపెట్టడం లేదు. కృష్ణా జలాల్లో
తమ వాటా తమకు దక్కడం
లేదని తెరాస అధ్యక్షుడు కె.
చంద్రశేఖర రావు మాత్రమే కాకుండా
తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నాయకులు కూడా అన్నారు.
గోదావరి
జలాల వాడకానికి సంబంధించి తెలంగాణలో ప్రధానమే నీటి పారుదల ప్రాజెక్టు
ఏదీ లేదు. కృష్ణా నదిపై
ప్రాజెక్టులు ఉన్నప్పటికీ నీటి విడుదల విషయంలో
వివక్ష ప్రదర్శిస్తున్నారనే విమర్శ వస్తోంది. తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లాకు, కర్నూలు
జిల్లాకు మధ్య రాజోలిబండ డైవర్షన్
స్కీమ్ నీటి విషయంలో ఎప్పటికప్పుడు
వివాదం తలెత్తుతూనే ఉన్నది. మొత్తం మీద, నదీ జలాలే
సీమాంధ్ర నాయకులు తెలంగాణను వ్యతిరేకించడానికి ప్రధాన కారణమని తాజా పరిణామాలు తెలియజేస్తున్నాయి.
0 comments:
Post a Comment