హైదరాబాద్:
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ మంత్రివర్గంలో
ఏడుగురు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు
వైయస్ జగన్మోహన్ రెడ్డి కోవర్టులు ఉన్నారని యువజన కాంగ్రెసు మాజీ
అధ్యక్షుడు సుధాకర్ బాబు సోమవారం అన్నారు.
ఆయన పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణను
ఉదయం గాంధీభవనంలో కలిశారు. సిఎం కేబినెట్లో జగన్
పార్టీ కోవర్టులు ఉన్నారని, వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని సుధాకర్ ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
కేబినట్‌లో ఏడుగురు మాత్రమే
కాకుండా పార్టీలోని ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేల్లో కూడా పలువురు జగన్
కోవర్టులు ఉన్నారని ఆయన ఆరోపించారు. వారిపై
పదిరోజుల్లో చర్యలు తీసుకోకుంటే ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామని, వారి పేర్లను తానే
బహిర్గతపరుస్తానని చెప్పారు. ఇప్పుడు తాను ఏడుగురు మంత్రుల
పేర్లను బొత్సకు ఇచ్చానని, క్రమశిక్షణ ఉల్లంఘన కిందకు వస్తుంది కాబట్టి ప్రస్తుతం వారి పేర్లను తాను
బయట పెట్టలేనని చెప్పారు.
కోవర్టులు
ఉన్నారని తెలిసినా రాష్ట్రానికి చెందిన పార్టీ పెద్దలు పట్టించుకోవడం లేదన్నారు. కోవర్టుల కాల్ లిస్టు తీసి
పరిశీలించాలని సూచించారు. పార్టీలో ఉంటూ వారు జగన్
పార్టీ కార్యకర్తల పనులు చేస్తున్నారని ఆరోపించారు.
అలాంటి వారిని వెంటనే కేబినెట్ నుండి తొలగించాలని డిమాండ్
చేశారు. పార్టీ నుండి గెలిచి మంత్రి
పదవి అనుభవిస్తూనే కాంగ్రెసుకే నష్టం కలిగించేలా మంత్రులు
పని చేస్తున్నారన్నారు.
అలాంటి
వారిని ఉపేక్షించవద్దన్నారు. జగన్ పార్టీలో చేరేందుకు
ఆ మంత్రులు సిద్ధంగా ఉన్నారన్నారు. తాను బొత్సకు వ్యక్తిగతంగా
చెప్పానని, అవసరమైతే లిఖిత పూర్వకంగా ఇచ్చేందుకు
సిద్ధంగా ఉన్నానన్నారు. జగన్ పార్టీ స్థాపించినప్పటి
నుండి ఇప్పటి వరకు సదరు కోవర్టుల
కాల్ లిస్టు తీసి పరిశీలిస్తే అంతా
బయటపడుతుందన్నారు. ఈ విషయాన్ని తాను
అధిష్టానం దృష్టికి తీసుకు వెళ్తానన్నారు.
కాగా
కిరణ్ కెబినట్‌లో ఇద్దరు తెలంగాణ,
ఇద్దరు సీమాంధ్ర, ముగ్గురు కోస్తా ప్రాంత మంత్రులు ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. సుధాకర్ బాబు ఆరోపణల నేపథ్యంలో
ఎవరెవరనే అంశంపై ఇప్పుడు కాంగ్రెసు పార్టీలో జోరుగా చర్చ జరుగా చర్చ
జరుగుతోంది.
0 comments:
Post a Comment