రాష్ట్రంలో
నాయకత్వం మార్పు తప్పేట్లు లేదు. ముఖ్యమంత్రి కిరణ్
కుమార్ రెడ్డితో పాటు పిసిసి అధ్యక్షుడు
బొత్స సత్యనారాయణను కూడా మార్చేసి రాష్ట్ర
నాయత్వానికి కొత్త రూపురేఖలు తేవాలని
సోనియా గాంధీ భావిస్తున్నట్లు సమాచారం.
ఇందుకు సంబంధించిన ప్రణాళికను ఆమె సిద్ధం చేసుకున్నట్లు
తెలుస్తోంది. అయితే, ఈ మార్పు ఉప
ఎన్నికలు, రాష్ట్రపతి ఎన్నికలు ముగిసిన తర్వాతనే ఉంటుందని అంటున్నారు. ఉప ఎన్నికల్లో రాష్ట్రంలో
పార్టీ సత్తా ఏమిటో, ముఖ్యమంత్రి,
పిసిసి అధ్యక్షుడి సత్తా ఏమిటో తేలిపోతుందని,
దాన్ని ప్రాతిపదికగా తీసుకుని నాయకత్వ మార్పు చేయాలని సోనియా భావిస్తున్నట్లు చెబుతున్నారు.
ఉప ఎన్నికల ఫలితాలు పార్టీ ప్రక్షాళనకు తీసుకోవాల్సిన చర్యలను కచ్చితంగా చూపిస్తాయని అనుకుంటున్నారు. 2014లో జరిగే సాధారణ
ఎన్నికలను దీటుగా ఎదుర్కోవడానికి వీలుగా మార్పులు చేర్పులు ఉంటాయని చెబుతున్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వం, పార్టీ పనితీరు పట్ల సోనియా గాంధీ
తీవ్రమైన ఆందోళనకు గురవుతున్నట్లు చెబుతున్నారు. అయితే, రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికలపై
దృష్టి పెట్టాల్సిన అవసరం ఉండడంతో మార్పులపై
ఆ తర్వాతనే చేపట్టాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.
రాష్ట్రానికి
సంబందించి ఇప్పటికే కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసినప్పటికీ అమలుకు మాత్రం సమయం తీసుకోవాలని అనుకుంటున్నట్లు
తెలుస్తోంది. రాష్టప్రతి, ఉప రాష్టప్రతి ఎన్నికలు
ముగిసిన తర్వాత ఆగస్టులో కార్యాచరణ ప్రణాళిక అమలు చేయాలని కూడా
సోనియా నిర్ణయించినట్టు ఆ నేత చెప్తున్నారు.
అనివార్యమైన పక్షంలో మాత్రమే ఉప ఎన్నికల తర్వాత
రాష్ట్రంలో మార్పులకు పూనుకోవాలని, లేనిపక్షంలో ఉప రాష్టప్రతి ఎన్నికల
తర్వాత మాత్రమే దృష్టి పెట్టాలన్న అభిప్రాయంతో అధిష్ఠానం ఉంది. జూలై 25న
కొత్త రాష్టప్రతి ప్రమాణం చేయాల్సి ఉంది. దానికి వారం
ముందే రాష్టప్రతి ఎన్నికల వ్యవహారం ముగియాల్సి ఉంది. రాష్టప్రతి ఎన్నిక
ఏకగ్రీవమైన పక్షంలో సమస్య ఉండదుఎన్నిక అనివార్యమైన
పక్షంలో రాజకీయంగా అధిష్ఠానం అనేక చర్యలు తీసుకోవలసి
ఉంటుంది.
రాష్టప్రతి
ఎన్నికలో లోక్సభ, రాజ్యసభ
సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఓటర్లుగా ఉంటారు. వివిధ రాష్ట్రాలకు చెందిన
పార్టీ ఎంపీలను, ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను ఎన్నికలకు సిద్ధం చేయడంతోపాటు కలిసి వచ్చే ఇతర
పార్టీలకు చెందిన వారిని కూడా సమీకరించే పనిలో
అధిష్ఠానం నిమగ్నమవుతుంది. రాష్టప్రతి ఎన్నిక ముగిసిన వారం రోజుల్లో ఉప
రాష్టప్రతి ఎన్నిక కూడా జరగాల్సి ఉంటుంది.
ఉప రాష్టప్రతి ఎన్నికలో లోక్సభ, రాజ్యసభ
సభ్యులు ఓటర్లుగా ఉంటారు.
రాష్ట్రంలో
కాంగ్రెస్ పార్టీ అత్యంత క్లిష్ట సమయంలో ఉన్న పరిస్ధితిలో ముఖ్యమంత్రి
బాధ్యతలను కిరణ్కుమార్రెడ్డికి
అప్పగిస్తే తమ అంచనాలకు తగ్గట్టుగా
ఆయన పని చేయడం లేదన్న
అసంతృప్తితో అధిష్ఠానం ఉన్నట్టు తెలిసింది. దీనికితోడు రాష్ట్ర రాజకీయాలపై నిఘా వర్గాలు ఇస్తున్న
నివేదికలు కూడా అధిష్ఠానాన్ని కలవరపెడుతున్నట్లు
చెబుతున్నారు. కాంగ్రెస్ బలహీన పడుతున్నా తెలుగుదేశం
పార్టీ బలం నిలకడగా ఉందే
తప్ప ఎదుగుదల కనిపించడం లేదు. వైఎస్సార్ కాంగ్రెస్
పార్టీ రోజురోజుకూ బలపడుతోందంటూ నిఘా వర్గాలు అధిష్ఠానానికి
నివేదికలు ఇచ్చినట్టు తెలిసింది.
కాంగ్రెస్
పార్టీ బలహీన పడటం కన్నా
వైఎస్సార్ కాంగ్రెస్ బలపడుతుండటం హైకమాండ్కు ఆందోళన కలిగిస్తోంది.
ఈ పరిస్థితిలో తీవ్రమైన చర్యలు తీసుకోక తప్పదన్న నిర్ణయానికి అధిష్ఠానం వచ్చినట్టు సమాచారం. అదేవిధంగా తెలంగాణ సమస్యను కూడా ఇక నాన్చకుండా
ఒక నిర్ణయాన్ని ప్రకటించాలని అధిష్ఠానం నిర్ణయించినట్టు తెలిసింది. అయితే రాష్ట్రంలో మార్పుల
విషయంలోను, తెలంగాణ అంశంలోను సోనియా మనసులో ఏముందన్నది ఎవరికీ అంతుపట్టడం లేదు.
0 comments:
Post a Comment