హైదరాబాద్:
ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ దూతగా న్యూఢిల్లీ
నుండి వచ్చిన వాయలార్ రవిని దివంగత ముఖ్యమంత్రి
వైయస్ రాజశేఖర రెడ్డి ఆత్మబంధువు కెవిపి రామచంద్ర రావు మంగళవారం ఉదయం
కలిశారు. తాజ్ కృష్ణలో ఉన్న
రవిని కెవిపి కలిశారు. పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు
పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కూడా ఆయనను హోటల్లో
కలిశారు. పార్టీ పరిస్థితిపై పాల్వాయి పూర్తిగా వివరించినట్లుగా తెలుస్తోంది.
కరీంనగర్
పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ ఆయనను లేక్ వ్యూ
గెస్టు హౌస్లో కలిశారు.
కాగా వాయలార్ రవి కాంగ్రెసు పార్టీ
కార్యాలయంలో పార్టీ నేతలతో భేటీ కానున్నారు. రాష్ట్రంలోని
తాజా పరిస్థితులు, పార్టీ పరిస్థితులపై చర్చించనున్నారు. అయితే ముఖ్యమంత్రి కిరణ్
కుమార్ రెడ్డి ఢిల్లీలో ఉన్నప్పుడు రవి హైదరాబాద్ రావడం
అనుమానాలకు తావిస్తోందని పలువురు అంటున్నారు. పార్టీలో ఏమైనా మార్పులు చేర్పులు
ఉండవచ్చుననే అనుమానాలను పలువురు వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
రాత్రి
మీడియాతో మాట్లాడిన వాయలార్ రవి తాను సోనియా
గాంధీ దూతగా వచ్చానని, రాష్ట్రంలోని
నేతలు చెప్పింది వింటానని, మేడంకు పూర్తి నివేదికను ఇస్తానని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి
కిరణ్, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా
శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మధ్య
విభేదాలు ఢిల్లీకి చేరడంతో, పార్టీ పెద్దలు వారిని పిలిపించుకొని సర్ది చెప్పిన విషయం
తెలిసిందే.
ఆ తర్వాత కూడా ముఖ్యమంత్రిపై ఇతర
నేతల నుండి అసంతృప్తి వెలువడటం,
త్వరలో ఉప ఎన్నికలు జరగనున్న
నేపథ్యంలో వాయలార్ రవి రాక ప్రాధాన్యత
సంతరించుకుంది. పార్టీ నేతల నుండి అభిప్రాయాలు
తీసుకొని ఆయన సోనియా గాంధీకి
పూర్తి నివేదిక ఇవ్వనున్నారు. అలాగే ఉప ఎన్నికల
అంశంపై నేతలతో చర్చించనున్నారు. కాగా పిసిసి చీఫ్
బొత్సతో రవి భేటీ అయ్యారు.
0 comments:
Post a Comment