విజయవాడ:
ఉద్యమం నెలబాలుడు అస్తమించాడు. విప్లవోద్యమంలో, దళిత ఉద్యమంలో ఎనలేని
కృషి చెసిన కెజి సత్యమూర్తి
అలియాస్ శివసాగర్ మంగళవారం కన్ను మూశారు. ఆయన
వయస్సు 90 ఏళ్లు. కృష్ణా జిల్లా జి. కొండూరు మండలం
కందులపాడులో ఆయన తుది శ్వాస
విడిచారు. గత కొంతకాలంగా ఆయన
అనారోగ్యంతో బాధపడుతున్నారు. కవిగా ఆయన సాహిత్య
ప్రపంచానికి సుపరిచితుడు. నక్సలైట్ ఉద్యమ వ్యవస్థాపకుల్లో కెజి
సత్యమూర్తి ఒకరు. పీపుల్స్వార్
వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శిగా ఆయన పనిచేశారు.
కొండపల్లి
సీతారామయ్యతో ఆయన కలిసి పనిచేశారు.
పీపుల్స్వార్ (ఇప్పుడు మావోయిస్టు
పార్టీ)లో కొండపల్లి సీతారామయ్య
తర్వాతి స్థానాన్ని ఆయన ఆక్రమించారు. ఆయన
కృష్ణా జిల్లా నందివాడ మండలం శంకరపాడు గ్రామంలో
జన్మించారు. పీపుల్స్వార్తో విభేదించి
బయటకు వచ్చిన తర్వాత ఆయన దళిత ఉద్యమానికి
నాయకత్వం వహించారు. సామాజిక విప్లవ వేదిక ఏర్పాటులో ప్రధాన
భూమిక పోషించి దళితులను చైతన్యవంతులను చేయడానికి ప్రయత్నించారు. భారతదేశంలో కుల ప్రాధాన్యాన్ని గుర్తించి
సామాజిక విప్లవానికి అందుకు అనుగుణమైన వైఖరిని తీసుకోవాలని బలంగా వాదించడంతో పాటు
అందుకు అనుగుణమైన కార్యాచరణను కూడా చేపట్టడానికి ప్రయత్నించారు.
ఆయన నలుపు, ఎదురీత వంటి పత్రికలను నడిపించారు.
పీపుల్స్వార్ ఆయనను బహిష్కరించింది.
అయితే, తానే దాన్ని బహిష్కరించానని
ఆయన అన్నారు. పీపుల్స్వార్ నాయకత్వంపై ఆయన
ప్రశ్నల వర్షం సంధించారు. విప్లవోద్యమంలో
ఆయన చేసిన కృషి అసమానమైంది.
ఆయన రాసిన కవిత్వం విప్లవ
కవిత్వానికి ఒరవడి పెట్టింది. ఆయన
రాసిన ఉద్యమ నెలబాలుడు కవిత్వం
విప్లవ కవిత్వానికి ప్రతీకగా నిలుస్తుంది. ఆ తర్వాత ఆయన
దళిత కవిత్వం కూడా దళితులకు మార్గ
నిర్దేశనం చేస్తుంది. విలువలను తలకిందులు చేయడంలో, దళిత ప్రత్యామ్నాయ సంస్కృతికి
అనుగుణంగా తెలుగు కవిత్వంలో ప్రతీకలను వేయడంలోనూ, సంప్రదాయబద్దమైన ప్రతీకలను దెబ్బ తీయడంలోనూ ఆయన
కవిత్వం అందె వేసిన చేయి.
కెజి
సత్యమూర్తి పార్వతీపురం కుట్ర కేసులో అరెస్టయ్యాడు.
ఆయన ఆదిలాబాద్ నక్సలైట్ ఉద్యమంలో పనిచేశారు. ఆ సమయంలో ఆయన
తెలంగాణ జీవన విధానాన్ని సునిశితంగా
పరిశీలించి, అక్కడి జానపద బాణీలను అర్థం
చేసుకుని, అందుకు అనుగుణంగా విప్లవ బాణీలను కట్టారు. ఆయన రాసిన నరుడో
భాస్కరుడా.. పాట ఎప్పటికీ సాహిత్య
లోకంలో నిలిచిపోతుంది.
శివసాగర్
గొప్ప సాహితీవేత్త అని విప్లవ రచయితల
సంఘం (విరసం) నాయకుడు వరవర రావు అన్నారు.
సున్నితమైన భావాలు కలిగినవాడని ఆయన అన్నారు. విరసం
ఏర్పాటులో శివసాగర్ది ప్రధానమైన భూమిక.
శివసాగర్ ఎంతో మంది కవులను
ప్రభావితం చేశారని వరవరరావు అన్నారు. శ్రీశ్రీ తర్వాతి స్థానం శివసాగర్దేనని ఆయన అన్నారు.
శివసాగర్ కవిత్వం విప్లవ కవిత్వంలో ప్రత్యేకతను సంతరించుకుంటుందని విప్లవ రచయిత కళ్యాణ రావు
అన్నారు. శివసాగర్ మృతికి ప్రముఖ దళిత సాహిత్యవేత్త కత్తి
పద్మారావు సంతాపం వ్యక్తం చేశారు.
0 comments:
Post a Comment