హైదరాబాద్:
గంగుల సూర్యనారాయణ రెడ్డి అలియాస్ మద్దెలచెర్వు సూరినికి భాను కిరణ్ నమ్మినబంటు.
సూరి బినామీ కూడా. ఏడేళ్ళపాటు మద్దెలచెరువు
సూరికి నమ్మిన బంటుగా ఉన్నాడు. సూరికి సంబంధించిన వ్యక్తిగత విషయాలతో పాటు కోర్టు వ్యవహారాలు,
ఆస్తిపాస్తుల నిర్వహణ వంటి అన్ని విషయాలు
భానునే చూస్తుంటాడు. భానుగా పిలుచుకునే భానుకిరణ్ స్వస్థలం కడపజిల్లా కొండాపురం మండలం పొట్టిపాడు గ్రామం.
అయితే, అనంతపురంలోని సాయినగర్లో వీరి కుటుంబం
ఎక్కువ రోజులు నివసించింది.
ప్రస్తుతం
హైదరాబాద్లో నివసిస్తోంది. భానును
సూరి ప్రాణంగా చూసుకునేవాడని సమాచారం. అలాంటి వ్యక్తిని భాను ఎందుకు చంపాడన్నది
మొదట అంతు పట్టలేదు. విశ్వసనీయ
సమాచారం ప్రకారం సూరి తన ఆస్తులు
చాలావరకూ భాను పేరుమీదనే పెట్టాడు.
వీటి విలువ కోట్లలోనే ఉంటుందని
సమాచారం. సూరి రియల్ఎస్టేట్
కార్యకలాపాలు నిర్వహించినట్లు పోలీసులు చెప్పారు. జైల్లో ఉన్నంత వరకూ ఆస్తుల గురించి
సూరి పెద్దగా పట్టించుకోలేదు. ఏడాది కిందట జైలు
నుంచి బయటకు వచ్చాక తన
ఆస్తిపాస్తుల గురించి వాకబు చేసినట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలోనే ఇద్దరి మధ్య ఘర్షణ జరిగి
ఉండవచ్చునని, అదే హత్యకు దారితీసి
ఉండొచ్చనే వాదన వినిపించింది.
సూరి
మద్యం సేవించినప్పుడు భానును బూతులు తిట్టేవాడని పోలీసులు చెబుతున్నారు. ఇది నిత్యకృత్యంగా మారిందని,
దీంతో విసుగుచెందిన భాను ఈ ఘాతుకానికి
ఒడిగట్టి ఉండొచ్చననే వాదన కూడా వినిపించింది.
ఇంకో కథనం ప్రకారం..పరిటాల
రవి హత్యకేసులో ప్రధాన నిందితుడైన సూరి అంటే పడనివారు
చాలామంది ఉన్నారు. ఇటీవలే జైలు నుంచి బయటకు
వచ్చిన సూరిపై వీరి కన్నుపడిందని, వారిలో
ఎవరైనా భానుతో ఒప్పందం కుదుర్చుకొని సూరిని కడతేర్చి ఉండవచ్చని కూడా అన్నారు.
తాను
కొనిచ్చిన ఆయుధమే తన ప్రాణం తీస్తుందని
సూరి ఏనాడూ వూహించి ఉండడు.
జైలు నుంచి బయటకు వచ్చిన
తర్వాత సూరి కొంతకాలం ఇద్దరు
పైవేటు భద్రతా సిబ్బందిని నియమించుకున్నాడు. అనుమతిలేకుండా ఆయుధాలతో ఉన్న వీరిని కొద్దిరోజుల
క్రితం పోలీసులు అరెస్టు చేశారు. దాంతో తానే పిస్తోలు
కొని, ఎల్లప్పుడూ తన పక్కనే ఉండే
భానుకు ఇచ్చాడు. భానునే వ్యక్తిగత అంగరక్షకుడిగా వాడుకున్నాడని చెబుతారు. తాను కొనిచ్చిన ఆయుధమే
సూరి ప్రాణాలు తీసిందని అన్నారు. ఈ వాదనలకు సంబంధించిన
అసలు విషయాలు భాను కిరణ్ పట్టుబడడంతో
తెలిసే అవకాశం ఉంది. అసలు సూరిని
తాను ఎందుకు హత్య చేశాడనే విషయాన్ని
భాను వివరిస్తే ఈ ఊహాగానాలన్నింటికీ తెరపడుతుంది.
0 comments:
Post a Comment