హైదరాబాద్:
రాష్ట్రంలో 18 శానససభా స్థానాలకు, నెల్లూరు లోకసభ స్థానానికి జరిగే
ఉప ఎన్నికలు ఆసక్తికరంగా మారనున్నాయి. వైయస్ రాజశేఖర రెడ్డి
సెంటిమెంటుకు సీమాంధ్ర కాంగ్రెసు నాయకులు సమైక్యాంధ్ర సెంటిమెంటును అడ్డుపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. తద్వారా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ దూకుడుకు
అడ్డుకట్ట వేసే ఉద్దేశంతో కాంగ్రెసు
పార్టీ నాయకులు ఉన్నట్లు తెలుస్తోంది. విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ శుక్రవారం మాట్లాడిన తీరు ఆ విషయాన్ని
పట్టిస్తోంది.
ఉప ఎన్నికల్లో తమ పార్టీకి అత్యధిక
స్థానాలు కట్టబెడితే తెలంగాణ సమస్యను మెజారిటీ ప్రజల ఆమోదానికి అనుగుణంగా
పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
అంతేకాకుండా ఉప ఎన్నికల్లో తమ
పార్టీకి ఓటేసి గెలిపిస్తేనే కేంద్ర
ప్రభుత్వం సమస్య పరిష్కారానికి చొరవ
ప్రదర్శిస్తుందని చెప్పారు. దీన్నిబట్టి తమ పార్టీకి ఎక్కువ
స్థానాలు ఇస్తే రాష్ట్రాన్ని సమైక్యంగా
ఉంచుతామనే హామీని ఆయన సీమాంధ్ర ప్రజలకు
ఇచ్చినట్లు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.
నెల్లూరు
లోకసభ స్థానానికి ఇంచార్జీగా నియమితులైన మంత్రి దానం నాగేందర్ కూడా
శుక్రవారం సంచలన ప్రకటన చేశారు.
దివంగత నేత వైయస్ రాజశేఖర
రెడ్డి కారణంగానే తాను ప్రత్యేక తెలంగాణ
కావాలంటూ తమ పార్టీ అధ్యక్షురాలు
సోనియా గాంధీకి తమ పార్టీ తెలంగాణ
నాయకులు సమర్పించిన వినతిపత్రంపై సంతకం చేశానని ఆయన
అన్నారు. తాను హైదరాబాద్ మంత్రినని
ఆయన అన్నారు. ఆ రకంగా ఆయన
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండ్కు వ్యతిరేకంగా మాట్లాడి
సీమాంధ్ర ఓటర్లను కాంగ్రెసు వైపు తిప్పే ప్రయత్నం
చేశారని అనుకోవాల్సి ఉంటుంది.
వైయస్
రాజశేఖర రెడ్డిని ఓ వైపు దళిత
వ్యతిరేకిగా చిత్రీకరిస్తూ, మరో వైపు వైయస్
సెంటిమెంటుకు సమైక్యాంధ్ర సెంటిమెంటును పోటీకి పెట్టి ఉప ఎన్నికల్లో పాగా
వేయాలని కాంగ్రెసు నాయకత్వం భావిస్తున్నట్లు అర్థమవుతోంది. వైయస్ రాజశేఖర రెడ్డి
సెంటిమెంటుపై మాత్రమే వైయస్ జగన్ ఆధారపడడం
వల్ల దాన్ని దెబ్బ కొట్టేందుకు ఆ
విధమైన ఎత్తుగడను ఎంచుకున్నట్లు చెబుతున్నారు.
తెలంగాణలో
ఒక స్థానానికి మాత్రమే ఉప ఎన్నిక జరుగుతుండడంతో
కాంగ్రెసు నాయకులు సమైక్యాంధ్ర సెంటిమెంటును బలంగా ముందుకు తేవడానికి
సిద్ధపడ్డారు. మొత్తం 18 శాసనసభా స్థానాలకు ఉప ఎన్నికలు జరుగతుండగా
పరకాల మాత్రమే తెలంగాణలో ఉంది. దాంతో సీమాంధ్రలో
ఎక్కువ స్థానాలు గెలుచుకోవడానికి సమైక్యాంధ్ర సెంటిమెంటును అడ్డుపెడుతున్నారని భావించాల్సి ఉంటుంది.
సమైక్యాంధ్ర
సెంటిమెంటును అడ్డుపెడితే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి
రాష్ట్ర విభజన విషయంలో ఎజెండా
లేకుండా పోతుంది. చంద్రబాబు నాయుడు కూడా వైయస్ రాజశేఖర
రెడ్డి అవినీతిని మాత్రమే ప్రధాన అస్త్రంగా ఎంచుకుని వైయస్ జగన్ను
ఎదుర్కోవడానికి సిద్ధపడ్డారు. దాంతో వైయస్ జగన్కు చంద్రబాబు చేపట్టిన
వ్యతిరేక ప్రచారం కూడా సమైక్యాంధ్ర సెంటిమెంటు
కారణంగా తాము ప్రయోజనం పొందవచ్చునని
కాంగ్రెసు నాయకులు భావిస్తున్నారు.
0 comments:
Post a Comment