హైదరాబాద్:
మద్యం సిండికేట్ల వ్యవహారంలో తీవ్ర ఆరోపణల దాడికి
గురైన ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు తాజాగా
మరో చిక్కు వచ్చి పడింది. తీన్మార్, గబ్బర్ సింగ్
చిత్రాల నిర్మాత బండ్ల గణేష్తో
బొత్స సత్యనారాయణకు సంబంధాలున్నాయనే వార్తలను తెలుగుదేశం పార్టీ అస్త్రంగా వాడుకుంటోంది. బొత్సకు బండ్ల గణేష్
బినామీగా వ్యవహరిస్తున్నారని తెలుగుదేశం పార్టీ నాయకుడు వర్ల రామయ్య తాజాగా
ఆరోపణలు చేశారు.
తీన్మార్ ఆడియో విడుదల
కార్యక్రమంలో బండ్ల గణేష్ చేసిన
వ్యాఖ్యల సిడిని ఆయన సోమవారం మీడియా
ప్రతినిధుల సమావేశంలో విడుదల చేశారు. మర్డర్ చేసినా బొత్స రక్షిస్తారని బండ్ల
గణేష్ అన్నట్లు ఆయన ఆరోపించారు. సాధారణంగా
సంబంధాలు ఉండడం వల్ల తప్పేమీ
లేదు గానీ బండ్ల గణేష్ను బొత్స బినామీగా
చెబుతూ ఆయన సినిమాలకు బొత్స
సత్యనారాయణ ఆర్థిక వనరులు సమకూరుస్తున్నారని తెలుగుదేశం అనడమే ఇబ్బందిగా మారింది.
అయితే,
బండ్ల గణేష్తో తనకు
సంబంధాలు ఉంటే తప్పేమిటని బొత్స
సత్యనారాయణ తన సహజ శైలిలో
ప్రశ్నించారు. గణేష్ తనకు బినామా
కాడని స్పష్టం చేశారు. అయితే, బొత్స సత్యనారాయణ మాటలను
తెలుగుదేశం పార్టీ నాయకులు పట్టించుకునే స్థితిలో లేరు. బొత్స సత్యనారాయణపై
మరో అస్త్రం దొరికిందనే ఉద్దేశంతోనే విమర్శలను సంధిస్తోంది. గణేష్ సంఘ విద్రోహ
శక్తి కాదని బొత్స సత్యనారాయణ
అన్నారు. అయితే, బొత్స పేరుతో బండ్ల
గణేష్ అడ్డగోలు దోపిడీ చేశారని తెలుగుదేశం నాయకులు ఆరోపిస్తున్నారు.
తీన్మార్ సినిమా విషయంలో
నిర్మాత బండ్ల గణేష్ తనను
మోసం చేశాడని, న్యాయం చేయాలని అడిగితే రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ పేరు
చెప్పి బెదిరించారని సినీ పంపిణీదారుడు సుబ్బారావు
ఆరోపించారు. శనివారం ఆయన మీడియా ప్రతినిధుల
సమావేశంలో మాట్లాడారు. తీన్మార్ చిత్రం
విదేశీ హక్కుల కోసం రూ. 2.25 కోట్లు
డబ్బు తీసుకుని కూడా గణేష్ సకాలంలో
ప్రింట్ అందించలేదని ఆయన చెప్పారు. ఇదేమని
అడిగితే తన వెనక బొత్స
ఉన్నారని బెదిరించారని ఆయన అన్నారు. సుబ్బారావు
ఫిర్యాదు కూడా తెలుగుదేశం పార్టీకి
బొత్సపై విమర్శలు చేయడానికి ఓ ఆయుధంగానే పనికి
వస్తోంది.







0 comments:
Post a Comment