హైదరాబాద్:
సిబిఐ జాయింట్ డైరెక్టర్ (జెడి) లక్ష్మీనారాయణ చేతి
నిండా పనే ఉంది. ఆయన
ఆధ్వర్వంలో 15 హై ప్రొఫైల్ కేసుల
దర్యాప్తు జరుగుతోంది. దేశంలోని కొద్ది ప్రముఖ నేతల భవిష్యత్తు ఆయన
చేతుల్లో ఉంది. సోహ్రబుద్దీన్, ఇష్రాత్
జోహన్ ఎన్కౌంటర్ కేసులో
గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ, అక్రమ మైనింగ్
కేసులో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప,
అక్రమాస్తుల కేసులో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్, ఓబుళాపురం
మైనింగ్ కంపెనీ కుంభకోణంలో కర్ణాటక మాజీ మంత్రి గాలి
జనార్దన్ రెడ్డి భవిష్యత్తు లక్ష్మీనారాయణ చేతుల్లో ఉందని వ్యాఖ్యానిస్తున్నారు.
హైదరాబాద్,
విశాఖపట్నం, బెంగళూర్ జోన్ల సిబిఐ కేంద్ర
కార్యాలయం హైదరాబాదులో ఉంది. హైదరాబాదు సిబిఐ
కార్యాలయం విపరీతమైన పని ఒత్తిడితో మునిగి
ఉంది. హై ప్రొఫైల్ కేసులను
పరిష్కరించడానికి సిబిఐ సిబ్బంది ఆదివారాలు
కూడా పనిచేస్తోందని, సిబ్బంది కొరత కూడా ఉందని
అంటున్నారు. పారిశ్రామికవేత్తలు, ఐఎఎస్ అధికారుల పాత్ర
ఉన్న ఎమ్మార్ కేసు, రామలింగ రాజు
ఫ్రాడ్ కేసు, మావోయిస్టు ఆజాద్
ఎన్కౌంటర్ కేసులను హైదరాబాద్ సిబిఐ చూస్తోంది.
కాగా,
లక్ష్మినారాయణ డిప్యుటేషన్ మరో నాలుగు నెలల్లో
పూర్తవుతుంది. లక్ష్మినారాయణ ఆంధ్రప్రదేశ్కు చెందినవాడే అయినా
మహారాష్ట్ర క్యాడర్ అధికారి. ఆయన మహారాష్ట్ర క్యాడర్కు తిరిగి వెళ్లిపోవాలని
భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆయన డిప్యుటేషన్ను
పొడగిస్తారా, లేదా అనేది తెలియదు.
అయితే, కేసుల పరిస్థితి చూస్తే
ఆయన డిప్యుటేషన్ పొడగింపు తప్పదనే మాట వినిపిస్తోంది.
కర్నూలు
జిల్లా శ్రీశైలంలో జన్మించిన లక్ష్మీనారాయణ ఐఐటి మద్రాసు నుంచి
ఎంటెక్ పట్టా పొందారు. ఆయన
నాందేడ్ ఎస్పీగా పనిచేసారు. మహారాష్ట్ర ఉగ్రవాద నిరోధక దళంలో కూడా పనిచేశారు.
ఆయనను 2006 జూన్లో హైదరాబాదులో
వేశారు. ఆయన శ్రీశైలం ప్రాజెక్టు
మాజీ విద్యార్థుల సంఘం చైర్మన్గా
వ్యవహరిస్తున్నారు. తరుచూ ఆయన శ్రీశైలం
వెళ్తుంటారు. ఆ పాఠశాల పునరుద్ధరణకు
నిధులు సమకూరాయి. సెప్టెంబర్ ఆ పాఠశాల స్వర్ణోత్సవాలు
నిర్వహించే ఆలోచనలో ఉన్నారు.
0 comments:
Post a Comment