హైదరాబాద్:
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ అరెస్టుతో
కాంగ్రెసు పార్టీకి ఊరట లభించినట్లే. జగన్
అరెస్టు వల్ల వైయస్సార్ కాంగ్రెసు
పార్టీ తాత్కాలికంగా ప్రయోజనం పొందినప్పటికీ క్రమంగా అది తగ్గుతూ పోతుందని
కాంగ్రెసు నాయకులు భావిస్తున్నారు. ప్రస్తుతం 18 శాసనసభా స్థానాలకు, ఓ లోకసభ స్థానానికి
జరిగే ఉప ఎన్నికల్లో వైయస్సార్
కాంగ్రెసు పార్టీ లబ్ధి పొందినప్పటికీ 2014 సాధారణ ఎన్నికల
నాటికి అది క్రమంగా తగ్గుముఖం
పడుతుందని కాంగ్రెసు నాయకుల అంచనా. అందుకే, కాంగ్రెసు పార్టీ అధిష్టానం జగన్ అరెస్టుకు అనుకూలంగా
వ్యవహరించిట్లు చెబుతున్నారు.
ఉప ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ ఒక్క స్థానాన్ని కూడా
గెలవదనే అంచనా ఉంది. ఉప
ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు గెలుచుకుంటే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ప్రభుత్వాన్ని
ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీరు
తాగిస్తారనే అంచనా ఉంది. తమ
పార్టీ నుంచి చాలా మంది
వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి వలసలు వెళ్లే ప్రమాదం
కూడా ఉంది. ఉప ఎన్నికల
తర్వాతి సంక్షోభాన్ని నివారించడంపైనా, 2014 ఎన్నికలపైనా దృష్టి పెట్టి ఉప ఎన్నికలు జరుగుతున్న
కీలకమైన సమయంలో వైయస్ జగన్ అరెస్టుకు
కాంగ్రెసు అధిష్టానం అనుకూలంగా వ్యవహరించినట్లు చెబుతున్నారు.
జగన్
అరెస్టు వల్ల వైయస్ విజయమ్మ
ప్రచారంలోకి దిగితే వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి సానుభూతి ఓట్లు పడే అవకాశాలు
లేకపోలేదు. అయితే, ప్రభుత్వాన్ని అస్థిరపరిచే వ్యూహరచనకు జగన్ అరెస్టు వల్ల
కళ్లెం పడుతుందని భావిస్తున్నారు. ఉప ఎన్నికల్లో పార్టీ
ఓడిపోతే ముఖ్యమంత్రి మార్పు ఉంటుందని అంటున్నారు. అయితే, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి
వర్గం మాత్రం ఆ విషయాన్ని కొట్టిపారేస్తోంది.
ఉప ఎన్నికల్లో విజయం సాధించే అవకాశాలు
లేవని కిరణ్ కుమార్ రెడ్డి
ఇప్పటికే అధిష్టానానికి వివరించారని చెబుతున్నారు.
వైయస్సార్
కాంగ్రెసు పార్టీ 2014 ఎన్నికల వరకు మనుగడ సాగించడం
కష్టమని, ఈలోగా వైయస్ జగన్
అవినీతిని ప్రజల్లోకి తీసుకుని వెళ్లవచ్చునని, దాని వల్ల వైయస్సార్
కాంగ్రెసు పార్టీ పట్ల ప్రజల్లో వ్యతిరేకత
పెరుగుతుందని కాంగ్రెసు నాయకులు అంచనా వేస్తున్నారు. సానుభూతితో
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రయోజనం పొందడమనేది తాత్కాలిక దశ మాత్రమేనని, రాను
రాను ప్రజలు జగన్ను అర్థం
చేసుకుంటారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు
అంటున్నారు. జగన్ అరెస్టు వల్ల
వైయస్సార్ కాంగ్రెసులోకి వలసలను నిరోధించడానికి వీలవుతుందని కాంగ్రెసు నాయకత్వం భావిస్తోంది.
0 comments:
Post a Comment