వైయస్సార్
కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు
వైయస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన మీడియా ఖాతాల స్తంభనపై రాష్ట్ర
వ్యాప్తంగా జోరుగా చర్చ జరుగుతోంది. ఈ
అంశంపై జాతీయ స్థాయి మీడియా
ప్రతినిధులు కూడా స్పందిస్తున్నారు. ఈ
ఘటనను కొందరు సమర్థిస్తుండగా, పత్రికా స్వేచ్ఛకు విఘాతం అని మరికొందరు తప్పు
పడుతున్నారు. జగన్, వైయస్సార్ కాంగ్రెసు
పార్టీ నేతలు అయితే ఏకంగా
దీనిని బ్లాక్ డేగా వర్ణిస్తున్నారు.
సాక్షి
గ్రూపు ప్రచురణ సంస్థల బ్యాంక్ ఖాతాలను సిబిఐ స్తంభింప చేయడం
సరికాదని భారత వార్తా పత్రికల
సంఘం ఖండించింది. సిబిఐ చర్యల వల్ల
సాక్షి దిన పత్రిక ప్రచురణ
ఆకస్మికంగా ఆగిపోయే పరిస్థితికి దారి తీయవచ్చునని, దీని
వల్ల పదివేల మంది ఉద్యోగులు ఉపాధి
కోల్పోయే అవకాశం ఉందని ఐఎన్ఎస్ అధ్యక్షుడు
ఆశిష్ బగ్గా పేర్కొన్నారు. సిపిఐ
రాష్ట్ర కార్యదర్శి నారాయణ, మాజీ మంత్రి, కాంగ్రెసు
పార్టీ నేత గాదె వెంకట
రెడ్డి కూడా తప్పు పట్టారు.
తెలుగుదేశం,
కాంగ్రెసు పార్టీలతో పాటు మరికొందరు సాక్షి
మీడియా బ్యాంక్ ఖాతాల స్తంభన మీడియా
స్వేచ్ఛ హరించడం అనడాన్ని తప్పు పడుతున్నారు. స్తంభింప
జేసినంత మాత్రాన స్వేచ్ఛను హరించారని చెప్పడం సరికాదంటున్నారు. జగన్ మీడియాలో అక్రమ
సంపాదన ఉందని ప్రాథమిక విచారణలో
తేలడం వల్లనే ఆ సంస్థల ఖాతాలను
సిబిఐ ఫ్రీజ్ చేసిందని చెబుతున్నారు. దీనిని పత్రికా స్వేచ్ఛతో ముడిపెట్టడం తగదంటున్నారు.
అక్రమ
సంపాదనతో పెట్టిన సాక్షిని వెనుకేసుకు రావడమేమిటని టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు
ప్రశ్నిస్తున్నారు. రేపు భాను కిరణ్,
దావూద్ ఇబ్రహీం పత్రిక పెట్టినా సమర్థిస్తారా అని అడుగుతున్నారు. బ్లాక్
మెయిల్, అక్రమాలు చేసి సంపాదించి, ఆ
తర్వాత వ్యాపారం చేస్తుంటే దానిని ప్రశ్నించవద్దా అని టిడిపి, కాంగ్రెసు
నేతలు ప్రశ్నిస్తున్నారు. కేవలం ఖాతాలు స్తంభించినందు
వల్లే రాద్దాంతం చేయడాన్ని వారు ఖండిస్తున్నారు.
పత్రిక
స్వేచ్ఛ గురించి మాట్లాడుతున్న వారికి, సూర్య పత్రిక అధినేత
నూకారపు సూర్య ప్రకాశ్ రావును
జైలుకు పంపినపుడు ఆ స్వేచ్ఛ గుర్తుకు
రాలేదా అని ప్రశ్నిస్తున్నారు. అలాగే ఉద్యోగుల
గురించి మాట్లాడుతున్న వారికి, రామోజీ రావుకు చెందిన మార్గదర్శిని దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి
టార్గెట్ చేసినప్పుడు గానీ సత్యం కుంభకోణం
బయటపడినప్పుడు గాని, సూర్య పత్రిక
విషయంలో గానీ ఉద్యోగులు గుర్తుకు
రాలేదా అని ప్రశ్నిస్తున్నారు.
అయినా
ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగులకు, వారి కుటుంబాలకు ప్రభుత్వం
హామీ ఇస్తుందని, దీనిని రాద్ధాంతం చేయడం సరికాదని పలువురు
అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి
సాక్షి ఉద్యోగులకు హామీ ఇచ్చిన విషయాన్ని
గుర్తు చేస్తున్నారు. కలైంజ్ఞర్ టివిలోకి అక్రమంగా పెట్టుబడులు వస్తే ఎంపి కనిమొళిని
అరెస్టు చేసిన విషయాన్ని గుర్తు
చేస్తున్నారు.
0 comments:
Post a Comment