హైదరాబాద్:
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి
ఒకప్పుడు చిన్నపాటి పారిశ్రామికవేత్త, మామూలు రాజకీయ నాయకుడు. జగన్మోహన్ రెడ్డిని జగన్గా పిలువడం
పరిపాటి. దాదాపు దశాబ్ద కాలం పాటు అంతా
సజావుగానే సాగిపోయింది. మాజీ మంత్రి పి.
శంకరరావు కోర్టుకు రాసిన లేఖతో సిబిఐ
దర్యాప్తు ప్రారంభమై ఆయన కష్టాల్లో పడ్డారు.
దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి
ఏకైక పుత్రుడు.
కర్ణాటకలో
సండూరు పేర చిన్నపవాటి పవర్
కంపెనీని స్థాపించడం ద్వారా 1999-2000లో పారిశ్రామికవేత్తగా అవతారం ఎత్తారు.
ఆ తర్వాత దాన్ని ఈశాన్య రాష్ట్రాలకు విస్తరింపజేశారు. తన తండ్రి వైయస్
రాజశేఖర రెడ్డి 2004లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి
అయిన తర్వాత ఇతర వ్యాపారాలకు విస్తరించారు.
సిమెంట్ ప్లాంట్లు, మౌలిక సదుపాయాలు, మీడియా
వంటి పలు రంగాల్లోకి ఆయన
విస్తరించారు.
వ్యాపారవేత్తగా
ఎదుగుతున్న కొద్దీ ఆయనలో అధికారంపై ఆశ
పెరుగుతూ వచ్చింది. 39 ఏళ్ల వైయస్ జగన్
2004లో కడప నుంచి లోకసభకు
పోటీ చేయాలని అనుకోవడం ద్వారా ఆయనలోని రాజకీయాధికార కాంక్ష బయటపడింది. అయితే, అప్పుడు సోనియా గాంధీ జగన్కు
టికెట్ నిరాకరించి, వైయస్ రాజశేఖర రెడ్డి
సోదరుడు వైయస్ వివేకానంద రెడ్డికి
ఇచ్చింది. వైయస్ వివేకానంద రెడ్డి
విజయం సాధించారు. అయితే, ఆ తర్వాత బాబాయ్
వివేకానంద రెడ్డితో రాజీనామా చేయించి తాను పోటీ చేయాలని
భావించారు. కానీ అందుకు సోనియా
గాంధీ అంగీకరించలేదు.
చివరకు
2009లో వైయస్ రాజశేఖర రెడ్డి
తన కుమారుడు వైయస్ జగన్కు
కడప లోకసభ సీటు టికెట్
తెచ్చుకున్నారు. వైయస్ వివేకానంద రెడ్డిని
పక్కన పెట్టి కడప నుంచి వైయస్
జగన్ పోటీ చేసి విజయం
సాధించారు. తద్వారా జగన్ రాజకీయ జీవితం
ప్రారంభమైందని చెప్పాలి. అధిష్టానం వైయస్ రాజశేఖర రెడ్డికి
2009 ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికలో పూర్తి స్వేచ్ఛనిచ్చింది. దీంతో సగానికి సగం
మందిని తనకు వ్యక్తిగతంగా విధేయులుగా
ఉండేవారికే కాంగ్రసు టికెట్లు కట్టబెట్టారు.
వైయస్
రాజశేఖర రెడ్డి ఆకస్మిక మరణంతో పరిణామాలు పూర్తిగా మారిపోయాయి. వైయస్ జగన్ను
ముఖ్యమంత్రిని చేయాలంటూ దాదాపు 150 కాంగ్రెసు శాసనసభ్యులు లేఖపై సంతకాలు చేశారు.
అయితే, అందుకు సోనియా గాంధీ అంగీకరించలేదు. అయితే,
జగన్ పట్టు విడవలేదు. సోనియా
గాంధీ ఆదేశాలను ధిక్కరించి ఆయన ఓదార్పు యాత్ర
చేపట్టారు. తద్వారా జగన్ పాపులారిటీ పెరుగుతూ
కాంగ్రెసు దెబ్బ తింటూ వచ్చింది.
రోశయ్య
స్థానంలో కిరణ్ కుమార్ రెడ్డి
ముఖ్యమంత్రిగా రావడంతో జగన్ పరిస్థితి మరింతగా
మారిపోయింది. ఇదే సమయంలో చిరంజీవి
కాంగ్రెసుకు దగ్గరవుతూ వచ్చారు. దీంతో వైయస్ జగన్
2010 నవంబర్ 29వ తేదీన కాంగ్రెసు
పార్టీకి, లోకసభ సభ్యత్వానికి రాజీనామా
చేశారు. తాను వైయస్సార్ కాంగ్రెసు
పార్టీని స్థాపిస్తున్నట్లు 2011 మార్చిలో ప్రకటించారు. ఆ తర్వాత 2011 మేలో
కడపకు జరిగిన ఉప ఎన్నికలో రికార్డు
మెజారిటీతో విజయం సాధించారు. తల్లి
వైయస్ విజయమ్మ పులివెందుల నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు.
అప్పటి
నుంచి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కాంగ్రెసు పార్టీకి కంటిలో నలుసుగా మారడమే కాకుండా కాంగ్రెసు భవిష్యత్తు అంధకారంలో పడింది. ముఖ్యంగా సీమాంధ్రలో వైయస్ జగన్కు
విశేషమైన మద్దతు లభిస్తూ వచ్చింది. జగన్ వెంట నడుస్తున్న
16 మంది కాంగ్రెసు శాసనసభ్యులు ఆయన ఆదేశాల మేరకు
పార్టీకి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంపై ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా ఓటేశారు. చిరంజీవి నేతృత్వంలోని గత ప్రజారాజ్యం పార్టీ,
మజ్లీస్ ప్రభుత్వాన్ని కాపాడాయి.
ఆ తర్వాత ఏడు స్థానాలకు జరిగిన
ఉప ఎన్నికల్లోనూ కాంగ్రెసు ఓడిపోయింది. వాటిలో ఒక్క స్థానం కోస్తా
ప్రాంతంలో ఉండగా, ఆరు తెలంగాణ ప్రాంతంలో
ఉన్నాయి. కోస్తాలోని స్థానం వైయస్సార్ కాంగ్రెసు ఖాతాలో చేరింది. తద్వారా వైయస్సార్ కాంగ్రెసు తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీలకు హెచ్చరిక చేసినట్లయింది. వచ్చే నెల 12వ
తేదీన రాష్ట్రంలోని 18 శాసనసభా స్థానాలకు, ఓ లోకసభ స్థానానికి
ఎన్నికలు జరుగనున్నాయి. మెజారిటీ స్థానాలను వైయస్ జగన్ నాయకత్వంలోని
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గెలుచుకుంటుందనే అంచనాలున్నాయి.
ముఖ్యమంత్రి
పీఠంపై కన్నేసిన వైయస్ జగన్ 2014 సాధారణ
ఎన్నికల్లో విజయం సాధించి దాన్ని
సాధించుకుంటాననే ధీమా జగన్లో
వ్యక్తమవుతూ వచ్చింది. ఈ స్థితిలో వైయస్
జగన్ను సిబిఐ అరెస్టు
చేసింది.
0 comments:
Post a Comment