వైయస్సార్
కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ అరెస్టుతో
రాష్ట్రంలో 18 శాసనసభా నియోజకవర్గాలకు, ఓ లోకసభ స్థానానికి
జరుగుతున్న ఉప ఎన్నికల్లో ఏ
విధమైన ప్రభావం పడుతుందనేది ఆసక్తికరంగా మారింది. వైయస్ జగన్ అరెస్టుతో
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ విజయావకాశాలు దెబ్బ తినకుండా ఇప్పటికే
జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది. జగన్ అరెస్టు వల్ల
సానుభూతి పెరుగుతుందనే అంచనా కూడా ఉంది.
వైయస్సార్
కాంగ్రెసు పార్టీ 14 శానససభా స్థానాల్లో, లోకసభ స్థానంలో లీడ్లో ఉన్నట్లు సర్వే
ఫలితాలు తెలియజేస్తున్నాయి. జగన్ అరెస్టుతో వైయస్సార్
కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ ప్రచారంలోకి
దిగడానికి సిద్దపడుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జగన్ అరెస్టుపై తాము
న్యాయపోరాటం సాగిస్తామని, వైయస్ విజయమ్మ ఎన్నికల
ప్రచారాన్ని చేపడతారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు చెప్పారు.
పార్టీ నాయకుడు జూపూడి ప్రభాకర రావు కూడా అదే
మాట చెప్పారు.
వైయస్
విజయమ్మ ప్రచారంలోకి దిగితే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పట్ల ప్రజల్లో సానుభూతి
పెరుగుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పులివెందుల వెలుపల మొదటిసారి వైయస్ విజయమ్మ ప్రచారం
సాగించనున్నారు. ఇప్పటికే వైయస్ విజయమ్మ తగిన
సానుభూతిని కూడగట్టినట్లు అర్థమవుతోంది. వైయస్ జగన్ అరెస్టు
తర్వాత ఆమె, తన కోడలు
భారతి, కూతురు షర్మలలతో కలిసి దిల్కుషా
అతిథి గృహం వద్ద బైఠాయించడం,
తమను ఇంటికి తరలించిన తర్వాత అక్కడ దీక్ష చేయడం,
ఆమె వ్యాఖ్యలు ఉప ఎన్నికల్లో పరిస్థితిని
వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి అనుకూలంగా మార్చినట్లు అంచనాలు వేస్తున్నారు.
వైయస్
విజయమ్మ నెమ్మదిగానే అయినా ఘాటైన వ్యాఖ్యలు
చేస్తున్నారు. తన వ్యాఖ్యలకు సెంటిమెంటును
అద్దుతున్నారు. కాంగ్రెసు పార్టీ కోసం తన భర్త
వైయస్ రాజశేఖర రెడ్డి జీవితాన్ని అంకితం చేశారని, రెండు సార్లు కాంగ్రెసు
పార్టీని అధికారంలోకి తెచ్చారని, అటువంటి వైయస్ రాజశేఖర రెడ్డిని
పొట్టన పెట్టుకున్నారని ఆమె అంటున్నారు. వైయస్
రాజశేఖర రెడ్డి మరణంపై అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు.
చట్టపరమైన
చర్యలను పక్కన పెడితే ఆమె
తల్లిగా చేస్తున్న వ్యాఖ్యలు ప్రజలను ఆకట్టుకుంటాయని అంటున్నారు. తన కొడుకుని ఏం
చేస్తారో కూడా తెలియడం లేదని,
18కి 18 స్థానాలు గెలుస్తామనే భయంతోనే తన కుమారుడిని అరెస్టు
చేయించారని ఆమె అంటున్నారు. దీంతో
సామాన్య ప్రజానీకంలో సానుభూతి పెరుగుతుందని అంటున్నారు.
0 comments:
Post a Comment