హైదరాబాద్:
సీబీఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ కాల్‌లిస్ట్‌ను
బయటపెట్టడాన్ని వైయస్ జగన్ నాయకత్వంలోని
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సమర్థించుకుంది. జేడీకి దమ్ముంటే ఆ కాల్‌లిస్టులోని
విషయాలు అవాస్తవమంటూ ఖండించాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు అంబటి రాంబాబు సవాల్
చేశారు. తనపై కేసు దర్యాప్తునకు
సంబంధించి జగన్ కూడా ఎవరితోనైనా
ఫోన్‌లో మాట్లాడితే, ఆ
కాల్‌లిస్టు వివరాలను బయటపెట్టుకోవచ్చని, తమకేమీ అభ్యంతరం లేదని ఆయన గురువారం
మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.
"మేం
కాల్‌లిస్టు బయటపెట్టడం తప్పని ఆయన మాపై కేసు
పెట్టారు కదా, దానిని ఎదుర్కొంటాం.
ఈ అంశంపై త్వరలో రాష్ట్రపతి, ప్రధానికి కూడా ఫిర్యాదు చేస్తాం.
న్యాయపరంగానూ ముందుకెళ్తాం'' అని చెప్పారు. 'జేడీ
కాల్‌లిస్టు ఎలా సంపాదించాం? అది
తప్పా? ఒప్పా? అనేది వేరే అంశం.
ఆ కాల్‌లిస్టు బయటికి
రావటం తప్పయితే, జేడీ చేసినవి చట్టబద్ధమవుతాయా?
సీబీఐ అంటే... ప్రజలు, మీడియా, ప్రభుత్వానికి బాధ్యత వహించేది. రహస్యాలు పాటించేదేమీ కాదు. అధికారిక ఫోన్‌తో కుట్రకు పాల్పడ్డారని
కాల్‌లిస్టు బయటపెడితే... ప్రైవసీకి భంగం కలిగిందని జేడీ
ఫిర్యాదు చేశారు. ఏంటి ఆయన ప్రైవసీ?
అది ఆయన ఒక్కరికే ఉందా?
జగన్‌కు, ఆయన సంస్థల్లో
పెట్టుబడులు పెట్టిన వారికి లేదా?'' అని ప్రశ్నించారు.
తాము
సీబీఐ జేడీపై ఆరోపణలు చేస్తే, ఆయనతో కలిసి ఒక
వర్గం మీడియా తమపై పోరాటం చేస్తోందని
అంబటి రాంబాబు అన్నారు. 'ఏమైనా ఆరోపణలు వస్తే ఒక ప్రభుత్వ
ఉద్యోగిగా సీబీఐ జేడీ వారి
ఉన్నతాధికారులకు వివరణ ఇచ్చుకుంటారేకానీ, బయటికి
వచ్చి స్పందించడానికి ఆయనేమీ రాజకీయ నాయకుడు కాదు కదా ?' అని
విలేకరులు ప్రశ్నించినప్పుడు... 'లక్ష్మీనారాయణ సమాధానం చెప్పకపోతే సిబిఐ బాధ్యత వహించాలి'
అని అన్నారు.
'జగన్
కూడా తనపై వచ్చిన ఆరోపణలపై
ఇంతవరకు మీడియా ముందుకొచ్చి ఖండించలేదు' అని అడగ్గా... 'సమయం,
సందర్భం వచ్చినప్పుడు జాతీయ మీడియాతో మాట్లాడారని
అంబటి బదులిచ్చారు. 'మరి తెలుగు మీడియాతో
మాట్లాడలేదు కదా?' అని ప్రశ్నించగా...
అధికార ప్రతినిధులుగా తాము మాట్లాడుతున్న ప్రతీ
మాట పార్టీ గొంతేనని చెప్పారు.
0 comments:
Post a Comment