హైదరాబాద్:
రాష్ట్రంలోని ఉప ఎన్నికల ఫలితాలు
రేపు శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల లోగా పూర్తిగా
వెలువడుతాయని భావిస్తున్నారు. రాష్ట్రంలోని 18 శాసనసభా స్థానాలకు, నెల్లూరు లోకసభ స్థానానికి ఈ
నెల 12వ తేదీన పోలింగ్
జరిగింది. ఓట్ల లెక్కింపు రేపు
ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుంది. ఉప ఎన్నికల్లో పోటీ
చేసిన అభ్యర్థుల జాతకాలు మధ్యాహ్నం 12 గంటల లోగా తేలిపోతాయని
భావిస్తున్నారు. ఎన్నికల సంఘం ఓట్ల లెక్కింపునకు
అన్ని ఏర్పాట్లూ చేసింది.
కాగా,
ఉప ఎన్నికల ఫలితాలు అభ్యర్థుల కన్నా రాష్ట్రంలోని అగ్ర
నాయకులపైనే ఎక్కువగా ప్రభావం చూపే అవకాశాలున్నాయి. వైయస్
జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎక్కువ స్థానాలు గెలుచుకుంటుందనే విషయాన్ని అందరూ అంగీకరిస్తున్నారు. అయితే, ఎన్ని
స్థానాలను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గెలుచుకుంటుందనే ఉత్కంఠ మాత్రం కొనసాగుతూనే ఉన్నది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ 12కు పైగా స్థానాలు
గెలుచుకుంటేనే ఆ పార్టీ రాజకీయ
సమీకరణాలను మార్చే సత్తాను సంతరించుకుంటుందని అంటున్నారు.
ఎన్ని
స్థానాల్లో కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు గెలుస్తాయనేది కూడా ఉత్కంఠగానే ఉంది.
అంత కన్నా మించి వైయస్సార్
కాంగ్రెసు గెలిచే స్థానాల్లో ఏ పార్టీ రెండో
స్థానంలో ఉంటుందనే ఉత్కంఠ ఎక్కువగా ఉంది. భవిష్యత్తుకు అదే
కొలమానం అవుతుంది కాబట్టి దానిపైనే తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీ దృష్టి ఉంది. తెలుగుదేశం పార్టీ
కన్నా ఎక్కువ స్థానాల్లో కాంగ్రెసు పార్టీ రెండో స్థానంలోనే ఉంటేనే
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి,
పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కాస్తా
ఊపిరి పీల్చుకుంటారు. లేదంటే, తమ పీఠాలకు ఎసరు
వస్తుందనే ఆందోళన వారిలో ఉంది.
కాగా,
కాంగ్రెసు కన్నా ఎక్కువ స్థానాల్లో
తెలుగుదేశం పార్టీ రెండో స్థానంలో ఉంటేనే
నారా చంద్రబాబు నాయుడికి సవాళ్లు తక్కువగా ఎదురవుతాయి. లేదంటే, ఆయన తీవ్రమైన సవాళ్లనే
ఎదుర్కోవాల్సి రావచ్చు. అంతర్గతంగా ఆయనకు మరిన్ని తలనొప్పులు
ప్రారంభం కావచ్చు. పైగా, వైయస్సార్ కాంగ్రెసు
పార్టీ అభ్యర్థుల మెజారిటీ తక్కువగా ఉంటేనే రెండు పార్టీలకు కూడా
భవిష్యత్తుపై ఆశలు ఉంటాయి. లోపాలను
సరిదిద్దుకుని పార్టీలను గాడిలో పెట్టుకోవడానికి అవకాశాలుంటాయి. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థులు భారీ మెజారిటీలను సాధిస్తే
రెండు పార్టీల్లోనూ కలవరం చోటు చేసుకుంటుంది.
0 comments:
Post a Comment