హైదరాబాద్:
ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసులో నిందితుడైన ఐఎఎస్ అధికారి ఎల్వీ
సుబ్రహ్మణ్యం సోమవారం హైదరాబాదులోని నాంపల్లిలో గల సిబిఐ కోర్టులో
హాజరయ్యారు. ఎమ్మార్ ప్రాపర్టీస్ కుంభకోణంలో ఆయన 11వ నిందితుడు.
ఆయనకు సిబిఐ కోర్టు 25 వేల
రూపాయల వ్యక్తిగత పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఎల్వీ సుబ్రహ్మణ్యంకు
కొంత ఊరట లభించినట్లే.
ఆంధ్రప్రదేశ్
మౌలిక సదుపాయాల కల్పనా సంస్థ (ఎపిఐఐసి) మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నప్పుడు ఎమ్మార్కు భూముల కేటాయింపుల్లో
ఎల్వీ సుబ్రహ్మణ్యం అక్రమాలకు పాల్పడినట్లు సిబిఐ అభియోగం మోపింది.
ప్రస్తుతం ఆయన తిరుమల తిరుపతి
దేవస్థానం (టిటిడి) ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (ఇవో)గా ఉన్నారు.
ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసులో మరో ఐఎఎస్ అధికారి
బిపి ఆచార్య ప్రాసిక్యూషన్కు అనుమతి ఇచ్చిన
రాష్ట్ర ప్రభుత్వం ఎల్వీ సుబ్రహ్మణ్యం విచారణకు
మాత్రం అనుమతించలేదు.
దాంతో
ఎల్వీ సుబ్రహ్మణ్యంను ఐపియస్ నిబంధనల మేరకు విచారించడానికి సిబిఐ
కోర్టును కోరింది. కోర్టు అందుకు అనుమతి ఇచ్చింది. తాను ప్రభుత్వ ఆదేశాల
మేరకు మాత్రమే వ్యవహరించానని, వ్యవహారాన్ని సిబిఐ తప్పుగా అర్థం
చేసుకుందని అంటూ తనను కేసు
నుంచి మినహాయించాలని కోరుతూ ఇంతకు ముందు సుబ్రహ్మణ్యం
దాఖలు చేసుకున్న పిటిషన్ను కోర్టు కొట్టేసింది.
ఎమ్మార్
ప్రాపర్టీస్ కేసులో ఐఎఎస్ అధికారి బిపి
ఆచార్యను అరెస్టు చేసిన సిబిఐ ఎల్వీ
సుబ్రహ్మణ్యంను మాత్రం అరెస్టు చేయలేదు. కోర్టులో దాఖలు చేసిన చార్జిషీట్లో మాత్రం సిబిఐ
ఎల్వీ సుబ్రహ్మణ్యంపై అభియోగాలు మోపింది. ఎల్వీ సుబ్రహ్మణ్యంతో పాటు
ఎమ్మార్ కేసులోని ఇతర నిందితులు కొంత
మంది కూడా సోమవారం కోర్టుకు
హాజరయ్యారు.
0 comments:
Post a Comment