హైదరాబాద్:
మాజీ మంత్రి జీవన్ రెడ్డికి కడప
పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి
పార్టీలో చేరేందుకు లైన్ క్లియర్ అయిందంటున్నారు!
దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డికి
మంచి మిత్రుడు అయిన జీవన్ రెడ్డి
జగన్ స్థాపించిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వైపు దృష్టి సారిస్తున్నారనే
ప్రచారం గత కొంతకాలంగా జోరుగా
సాగుతోంది. ఆయన చర్యలు కూడా
ఈ ప్రచారాన్ని బలపర్చే విధంగానే కనిపించాయి, కనిపిస్తున్నాయి.
కొంతకాలంగా
జీవన్ రెడ్డి సొంత పార్టీ పైన
విమర్శలు గుప్పిస్తున్నారు. ఆయన కాంగ్రెసును తెలంగాణ
విషయంలో టార్గెట్ చేసుకున్నారు. తెలంగాణ ఇవ్వకుంటే కాంగ్రెసు పార్టీ ఈ ప్రాంతంలో మనుగడ
సాధించలేదని తొలుత విమర్శించిన జీవన్
రెడ్డి ఆ తర్వాత క్రమంగా
తన మాటలకు పదను పెట్టారు. తాజాగా
సోమవారం కాంగ్రెసు తెలంగాణ వ్యతిరేకి అని, ఈ పార్టీని
ప్రజలు నమ్మడం లేదని ఘాటు వ్యాఖ్యలు
చేశారు.
ఉప ఎన్నికల ఫలితాలతోనైనా కళ్లు తెరవాలన్నారు. ఆయన
గతంలో పలుమార్లు తెలంగాణ ఉద్యమ కార్యక్రమాలలో పాల్గొన్నారు.
ఆయా సందర్భాలలో కాంగ్రెసును చీల్చి చెండాడారు. తెలంగాణ విషయంలో కాంగ్రెసును దోషిగా చిత్రీకరిస్తున్న జీవన్ రెడ్డి మిగతా
తెలంగాణ కాంగ్రెసు నేతల్లా దివంగత వైయస్ పైన విమర్శలు
గుప్పించిన సందర్భాలు లేవు. తెలంగాణ ప్రాంత
కాంగ్రెసు నేతలు వైయస్ను
తెలంగాణ వ్యతిరేకికా పేర్కొంటున్నారు.
అంతేకాదు
ఆయన తనయుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని
కూడా అదే దృష్టితో చూస్తున్నారు.
ఇందుకు వారు గతంలో పార్లమెంటులో
జగన్ సమైక్యాంధ్రకు అనుకూలంగా పట్టుకున్న ప్లకార్డు అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. పనిలో పనిగా జగన్
అవినీతిపరుడంటూ మండిపడుతున్నారు. అయితే జీవన్ రెడ్డి
మాత్రం ఇందుకు మినహాయింపు. తెలంగాణ విషయంలో ఆయన కేవలం కాంగ్రెసునే
విమర్శిస్తున్నారు. వైయస్ను కానీ,
జగన్ను కాని ఎక్కడా
విమర్శించిన సందర్బాలు లేవు.
ఆయన వ్యాఖ్యలు జగన్కు అనుకూలంగా
ఉంటున్నాయి. దీంతో కాంగ్రెసు నేతలు
ఆయన ఏ సమయంలోనైనా జగన్
పార్టీలోకి జంప్ చేయవచ్చుననే నిర్ణయానికి
వచ్చారట. అయితే ఇంత చేస్తున్నా
జీవన్ రెడ్డి మాత్రం ఇప్పటి వరకు జగన్ వైపు
వెళ్లలేదు. అందుకు తెలంగాణ సెంటిమెంటే కారణమని అంటున్నారు. సెంటిమెంట్ బలంగా ఉన్న ఇలాంటి
సమయంలో తెలంగాణపై ఏ నిర్ణయం తీసుకోని,
అంతేకాకుండా పార్లమెంటులో వ్యతిరేకంగా ప్లకార్డు ప్రదర్శించిన జగన్ పార్టీలోకి వెళితే
భవిష్యత్తు కష్టంగా ఉంటుందని భావించారట.
అందుకే
ఇన్నాళ్లూ ఆయన అటువైపు వెళ్లేందుకు
సాహసించలేదట. కానీ ఇటీవల ఉప
ఎన్నికలలో జగన్ పార్టీ అభ్యర్థి
కొండా సురేఖ టిఆర్ఎస్ అభ్యర్థిని
ముచ్చెమటలు పోయించారు. సెంటిమెంట్ బలంగా ఉన్నప్పటికీ అధికార
కాంగ్రెసు, ప్రధాన ప్రతిపక్షం టిడిపి, తెలంగాణవాదం వినిపిస్తున్న జాతీయ పార్టీ బిజెపిని
తలదన్ని రెండో స్థానంలో జగన్
పార్టీ నిలిచింది. కేవలం టిఆర్ఎస్కు
పదిహేను వందల ఓట్ల దూరంలో
ఓటమి చవి చూసింది. ఉప
ఎన్నికల ఫలితాలలో జగన్ బలాన్ని చూసిన
జీవన్ ఇక ఆ పార్టీ
వైపు వెళ్లేందుకు సంసిద్దమవుతున్నారని అంటున్నారు.
0 comments:
Post a Comment