కాంగ్రెసు
పార్టీకి నిత్యం అండగా ఉండే ఎంఐఎం
అధినేత, హైదరాబాద్ పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ మంగళవారం అక్రమాస్తుల
కేసులో అరెస్టై చంచల్గూడ జైలులో
ఉన్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు
వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలవడం చర్చనీయాంశమైంది. ఇన్నాళ్లు
కాంగ్రెసుకు అండగా నిలిచిన ఎంఐఎం
ఇప్పుడు జగన్ వైపు దృష్టి
సారిస్తుందా లేక జగన్ను
కాంగ్రెసుకు సరెండర్ చేసే ప్రయత్నాలు చేస్తోందా
అనే ప్రశ్నలు అందరినీ తొలిచి వేస్తున్నాయి.
ఓవైసీ
జగన్ను కలిసి బయటకు
వచ్చిన తర్వాత చేసిన వ్యాఖ్యలు కూడా
చర్చనీయాంశమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం 2014 వరకు కొనసాగాలని ప్రజలు
తీర్పు ఇచ్చారని, ప్రభుత్వం అప్పటి వరకు ఉంటుందని చెబుతూనే..
ఈ మధ్యలో ఏదైనా అసాధారణ పరిణామాలు
చోటు చేసుకుంటే మాత్రం తమను బాధ్యులను చేయవద్దని
చెప్పారు. ప్రభుత్వం ఉంటుందని ఓ వైపు చెబుతూనే
ఏదైనా అయితే మమ్మల్ని నిందించవద్దని
చెప్పడం వెనుక గూడార్థం ఉందని
అంటున్నారు.
యుపిఏ
అభ్యర్థి ప్రణబ్ ముఖర్జీకి రాష్ట్రపతి ఎన్నికలలో మద్దతివ్వమని జగన్ను కోరానని
ఆయన చెప్పినప్పటికీ అంతకుముంచే వారు మాట్లాడి ఉంటారని
అంటున్నారు. వారిద్దరూ దాదాపు గంటపాటు మాట్లాడుకున్నట్లుగా తెలుస్తోంది. ఎంఐఎం పార్టీ ఇటీవల
తమ పార్టీని రాష్ట్రవ్యాప్తంగా తమకు పట్టున్న ప్రాంతాలలో
విస్తరింప చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటి వరకు ఎంఐఎం కేవలం
హైదరాబాదుకే పరిమితం అయింది.
అయితే
రాయలసీమతో పాటు మిగిలిన జిల్లాల్లో
ముస్లింలు అధికంగా ఉన్నచోట తమ పార్టీని తీసుకు
వెళ్లే యోచనలో ఉన్నారు. ఇటీవల ఉప ఎన్నికలకు
ముందు ఎంఐఎం నేతలు రాయలసీమలోని
పలు నియోజకవర్గాలను చుట్టివచ్చారు. ఉప ఎన్నికలలో ఎంఐఎం
పార్టీ పోటీ చేసే అవకాశాలు
ఉన్నాయని అందరూ భావించారు. కానీ
వారు పోటీ చేయలేదు. అయితే
తమ పార్టీని ఇతర ప్రాంతాలకు విస్తరించేందుకు
ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు.
ప్రస్తుతం
రాష్ట్రంలో జగన్ హవా కొనసాగుతున్న
నేపథ్యంలో ఆయన వెంట వెళ్లేందుకు
ఎంఐఎం నిశ్చయించుకుందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
రాయలసీమలో ముస్లింలు ఎక్కువగా ఉన్నారు. అక్కడే ఎంఐఎం ప్రధానంగా దృష్టి
సారిస్తోంది. జగన్కు కూడా
అక్కడే బలం చాలా ఎక్కువంగా
ఉంది. ఈ నేపథ్యంలో జగన్తో కలిసి వెళ్లి
రాయలసీమలో పట్టు పెంచుకునే ప్రయత్నాలు
ఎంఐఎం చేస్తుండవచ్చుననే వాదనలు వినిపిస్తున్నాయి.
ఎంఐఎం
పార్టీ సలాలుద్దీన్ తరం నుండే కాంగ్రెసుకు
అండగా ఉంటూ వస్తోంది. గత
నలభై ఏళ్లలో కాంగ్రెసు పార్టీకి నిత్య మిత్ర పక్షంగా
ఉన్న పార్టీ ఏమైనా ఉంటే అది
ఎంఐఎం మాత్రమే అని చెప్పవచ్చు. దివంగత
వైయస్ కాంగ్రెసులో కీలక నేతగా ఉన్నప్పుటి
నుండి సలాలుద్దీన్కు అతనితో మంచి
సంబంధాలు ఉన్నాయి. కాంగ్రెసుకు మద్దతిచ్చే ఎంఐఎంకు అదే పార్టీ నేత
వైయస్తో మంచి సంబంధాలు
ఉండటం సాధారణమే.
వైయస్
ముఖ్యమంత్రి అయ్యాక సలాలుద్దీన్ ఆ తర్వాత అసదుద్దీన్,
అక్బరుద్దీన్లకు అతనితో మైత్రి
బంధం మరింత పెరిగిందని అంటున్నారు.
వైయస్ కుమారుడు జగన్ ఇప్పుడు కాంగ్రెసును
వీడి బయటకు వెళ్లడం, ఆయన
ప్రభంజనం రాష్ట్రంలో ఉండటంతో ఆయన వైపు వెళ్లేందుకు
ప్రయత్నాలు చేస్తుండవచ్చునని అంటున్నారు. 2014 వరకు ప్రభుత్వం ఉంటుందని
చెబుతూనే.. మధ్యలో ఏమైనా జరిగితే తమను
బాధ్యులను చేయవద్దని చెప్పడం అందుకే సంకేతం అని అంటున్నారు. అయితే
జగన్ను కాంగ్రెసుకు సరెండర్
చేసేందుకు కూడా రావచ్చుననే అభిప్రాయాలు
వ్యక్తమవుతున్నాయి.
0 comments:
Post a Comment