హైదరాబాద్:
మద్యం సిండికేట్ల కేసులో పలువురు ప్రజాప్రతినిధులు సోమవారం నుండి ఎసిబి(అవినీతి
నిరోధక శాఖ) ఎదుట విచారణకు
హాజరు కానున్నారు. ఈ కేసులో పలువురు
శాసనసభ్యులు కూడా ఎసిబి డిఎస్పీ
ఎదుట హాజరు కానున్నారు. మద్యం
సిండికేట్ల కేసులో ఇప్పటి వరకు ఎసిబి సిండికేట్లను,
ఎక్సైజ్ అధికారులను మాత్రమే విచారించింది. నేటి నుండి ప్రజాప్రతినిధులను
కూడా విచారించనుంది.
కొందరు
రాజకీయ నాయకులకు మద్యం వ్యాపారులు ముడుపులు
చెల్లించినట్లు ఎసిబి విచారణలో వెల్లడైంది.
ఈ నేపథ్యంలో ఎసిబి అధికారులు మహబూబాబాద్
శాసనసభ్యురాలు కవిత, సత్తుపల్లి శాసనసభ్యులు
సండ్ర వెంకటవీరయ్య, మాజీ శాసనమండలి సభ్యుడు
పువ్వాడ నాగేశ్వర రావుకు నోటీసులు జారీ చేసింది. ఖమ్మం
జిల్లా మద్యం వ్యాపారి నున్నా
వెంకటరమణ అప్పటి ఎక్సైజ్ శాఖ మంత్రి మోపిదేవి
వెంకటరమణకు రూ.10 లక్షలు ఇచ్చినట్లు
చెప్పాడు.
అయితే
మోపిదేవి ఇప్పటికే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు
వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో అరెస్టై చంచల్గూడ జైలులో
ఉన్నారు. ఆయనతో పాటు పలువురికి
ముడుపులు ఇచ్చినట్లు నున్నా చెప్పాడు. కవిత, సండ్ర, పువ్వాడలతో
పాటు విశాఖ తూర్పు శాసనసభ్యుడు
వెలగపూడి రామకృష్ణ, ఇటీవల జరిగిన ఉప
ఎన్నికలలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తరఫున గెలిచిన చెన్నకేశవ
రెడ్డి, కృష్ణదాసులను కూడా విచారించనున్నారు.
వీరితో
పాటు మరికొందరు ప్రజాప్రతినిధులను విచారించే అవకాశముంది. ఈ నెల 18 నుండి
20వ తేది మధ్య ఎసిబి
డిఎస్పీ ఎదుట హాజరు కావాలని
వీరికి నోటీసులు జారీ చేశారు. ఎసిబి
అధికారులు ప్రజాప్రతినిధుల వాంగ్మూలాన్ని నమోదు చేయనున్నారు. కాగా
తాము ఎలాంటి ముడుపులు తీసుకోలేదని, విచారణకు సిద్ధమని ప్రజాప్రతినిధులు చెబుతున్నారు. ఇటీవల ఎమ్మెల్యే కవిత..
తాను ముడుపులు తీసుకోలేదని, నోటీసులు జారీ చేస్తే విచారణకు
హాజరవుతానని, తనను ఉద్దేశ్య పూర్వకంగా
ఈ కేసులో ఇరికించే ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు.
కాగా
మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం మద్యం సిండికేట్లపై
కొత్త పాలసీకి ఆమోదం తెలిపింది. మంత్రులతో
సంప్రదింపులు జరిపిన అనంతరం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి
కొత్త పాలసీ తెచ్చేందుకు నిర్ణయించారు.
ఇందుకు సంబంధించిన జివో ఈ రోజు
ఎప్పుడైన విడుదలయ్యే అవకాశముంది. ఇక నుండి 700 మద్యం
షాపులను ప్రభుత్వం నడపాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఇలా అయితే అందరూ
ఎమ్మార్పీ ధరకే మద్యం అమ్ముతారని
ప్రభుత్వం భావిస్తోంది. అంతేకాకుండా లాటరీ పద్ధతులలో మద్యం
షాపులను కేటాయించే అవకాశముంది.
0 comments:
Post a Comment