నెల్లూరు:
నెల్లూరు లోకసభ స్థానంలో వైయస్సార్
కాంగ్రెసు పార్టీ అభ్యర్థి మేకపాటి రాజమోహన్ రెడ్డి మెజారిటీ కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలకు వణుకు పుట్టిస్తుంది. కాంగ్రెసు
అభ్యర్థి టి. సుబ్బిరామిరెడ్డికి మించిన అభ్యర్థి
మేకపాటిపై పోటీ చేయడానికి కాంగ్రెసుకు
గానీ తెలుగుదేశం పార్టీకి గానీ దొరకరు. సంపన్నుడు,
స్థానికుడు అయిన టి. సుబ్బిరామిరెడ్డిని
ఎదుర్కుని మేకపాటి రాజమోహన్ రెడ్డి భారీ మెజారిటీ సాధించారు.
మేకపాటికి
2.91 లక్షల మెజారిటీ వచ్చింది. ఇది నెల్లూరు లోకసభకు
జరిగిన ఎన్నికల్లో రికార్డు. కడపలో ఐదు లక్షలకు
పైగా మెజారిటీతో వైయస్ జగన్ రికార్డు
సృష్టించారు. అయితే, మేకపాటి మెజారిటీని దానితో పోల్చలేమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. రాష్ట్రంలో 18 శాసనసభా స్థానాలకు, నెల్లూరు లోకసభ స్థానానికి ఉప
ఎన్నికలు జరిగాయి. ఈ ఉప ఎన్నికలను
2014లో వచ్చే సాధారణ ఎన్నికలకు
సెమీ ఫైనల్గా భావిస్తున్నారు.
ఈ స్థితిలో మేకపాటి మెజారిటీ తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీల నాయకులను నిద్రపోనీయడం లేదు.
మేకపాటి
మెజారిటీని చూస్తే 2014 ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మెజారిటీ లోకసభ స్థానాలను కొల్లగొడుతుందనే
అంచనాలు సాగుతున్నాయి. 2009 ఎన్నికల్లో కొద్ది మంది కాంగ్రెసు పార్టీ
అభ్యర్థులు లక్ష నుంచి లక్షన్నర
ఓట్ల మెజారిటీతో ప్రత్యర్థులపై గెలిచారు. దాదాపు 11 మంది కాంగ్రెసు పార్లమెంటు
సభ్యులు బొటాబోటీ మెజారిటీలతో బయటపడ్డారు.
శాసనసభా
స్థానాల్లో ఓట్ల స్వింగ్ అటూ
ఇటుగా ఉంటుంది గానీ లోకసభ స్థానాల్లో
ఆ మార్పు తక్కువగా ఉంటుందని అంటున్నారు. దానివల్లనే కాంగ్రెసు 2009 ఎన్నికల్లో శాసనసభా స్థానాలను కోల్పోయినప్పటికీ 33 లోకసభ స్థానాలను గెలుచుకోగలిగిందని
అంటున్నారు. స్థానిక పరిస్థితుల ప్రభావం శాసనసభ అభ్యర్థులపై పడుతుంది గానీ పార్లమెంటు అభ్యర్థులపై
పడదని అంటున్నారు.
వైయస్సార్
కాంగ్రెసు పార్టీ కాంగ్రెసు ఓట్లను మాత్రమే కాకుండా తెలుగుదేశం పార్టీ ఓట్లను కూడా కొల్లగొడుతోంది. వైయస్సార్
కాంగ్రెసు ఓట్ల శాతం 46 ఉండగా,
కాంగ్రెసు ఓట్ల శాతం 22, తెలుగుదేశం
ఓట్ల శాతం 23 ఉంది. సీమాంధ్రలోనే కాకుండా
తెలంగాణలో కూడా వైయస్సార్ కాంగ్రెసు
పార్టీ తన సత్తా చాటే
అవకాశాలున్నట్లు భావిస్తున్నారు.
0 comments:
Post a Comment