హైదరాబాద్:
ఉప ఎన్నికల ఫలితాలు తెలుగుదేశం పార్టీకి తీవ్ర నిరాశను కలిగించాయి.
శుక్రవారం ఫలితాలు వెలువడిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్టు భవన్ బోసిబోయి కనిపించింది.
పార్టీ నాయకులు ఎవరూ అటు వైపు
వచ్చిన దాఖలు లేవు. తెలుగుదేశం
పార్టీకి భవిష్యత్తు లేదనే మాట గట్టిగా
వినిపిస్తోంది. చంద్రబాబు కాలికి బలపం కట్టుకున్నట్లు తిరిగినా
ఉప ఎన్నికల్లో ఏ మాత్రం ఫలితం
కనిపించలేదు.
వైయస్
జగన్కు చెందిన వైయస్సార్
కాంగ్రెసు బలం పుంజుకుంటున్న కొద్దీ
తెలుగుదేశం పార్టీ తన బలాన్ని కోల్పోతుందని
విశ్లేషకులు అంటున్నారు. తెలంగాణలో ఇప్పటికే తెలుగుదేశం పార్టీ ఏమీ కాకుండా పోయిందనే
అభిప్రాయం పార్టీ నాయకుల నుంచి వినిపిస్తోంది. సీమాంధ్రలో
పూర్తిగా కాంగ్రెసు గల్లంతై తాము లాభపడుతామని భావించిన
చంద్రబాబుకు ఏ మాత్రం ఫలితాలు
ఆశాజనకంగా కనిపించలేదు. పైగా, కాంగ్రెసు పార్టీ
పూర్తిగా బలాన్ని కోల్పోలేదని ఫలితాలు నిరూపించాయి.
ప్రభుత్వ
వ్యతిరేకత, వైయస్ జగన్ చీలికతో
కాంగ్రెసు మట్టికొట్టుకుపోతుందని అనుకున్నారు. కానీ, రెండు స్థానాలను
గెలుచుకోవడమే కాకుండా తెలుగుదేశం కన్నా మెరుగైన ప్రదర్శననే
కనబరిచిందని అంటున్నారు. నాయకత్వం పార్టీని సరైన దిశలో పెట్టకపోతే
ఒక్కరొక్కరే తప్పుకునే ప్రమాదం కూడా ఉందని అంటున్నారు.
పార్టీ నాయకత్వమంటే చంద్రబాబే అనే రీతిలో తెలుగుదేశం
నడుస్తోంది. చంద్రబాబు పార్టీ లోపాలను సరైన పద్ధతిలో విశ్లేషించి,
తగిన చర్యలు తీసుకోవడం లేదని అంటున్నారు.
రాయలసీమ,
తెలంగాణ ప్రాంతాలను వదిలేసిన కమ్మ సామాజిక వర్గం
అధికంగా ఉన్న కోస్తాంధ్రలో కూడా
తెలుగుదేశం పార్టీ ఉప ఎన్నికల్లో సరైన
ప్రదర్శన ఇవ్వలేకపోయింది. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు, మాచర్ల నియోజకవర్గాల్లో తెలుగుదేశం ఓటమికి అందుకు నిదర్శనమని అంటున్నారు. ఉప ఎన్నికలు జరిగిన
18 స్థానాల్లో పది స్థానాల్లో తెలుగుదేశం
పార్టీ పది స్థానాల్లో రెండో
స్థానంలో నిలిచింది. అయినప్పటికీ ప్రభుత్వ వ్యతిరేకతను, వైయస్ జగన్ అవినీతిని
ఓట్ల రూపంలోకి మార్చుకోవడంలో తెలుగుదేశం పార్టీ విఫలమైందని అంటున్నారు.
మెజారిటీ
ప్రజల ఆదరణను పొందడంలో తెలుగుదేశం పార్టీ విఫలమైందని అంటున్నారు. దానికి తోడు, క్రమంగా ఒక్కో
సామాజిక వర్గం తెలుగుదేశం పార్టీకి
దూరమవుతుందనే అభిప్రాయం కూడా ఉంది. ఉప
ఎన్నికల్లో తమకు వచ్చిందీ లేదు,
పోయిందీ లేదని తెలుగుదేశం నాయకులు
అంటున్నారు. ఈ 18 స్థానాలు కూడా
తమవి కాకపోవడమే ఆ వాదనకు కారణం.
అయితే, ప్రభుత్వ వ్యతిరేక ఓటును తమకు అనుకూలంగా
మలుచుకుని క్రమంగా బలం పుంజుకోవాల్సిన ప్రతిపక్ష
పార్టీ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి
అక్కడే అన్నట్లుగా మాత్రం ఉందని చెప్పక తప్పదు.
0 comments:
Post a Comment