హైదరాబాద్:
తెలుగుదేశం పార్టీకే కాదు, కాంగ్రెసు పార్టీకి
కూడా ఉప ఎన్నికల ఫలితాలు
గుబులు రేపుతున్నాయి. వైయస్ జగన్ పార్టీని
వీడి సొంత పార్టీని పెట్టిన
తర్వాత సీమాంధ్రలో తమ పార్టీ దెబ్బ
తింటుందని కాంగ్రెసు నాయకులు భావించినప్పటికీ, ఏదో మేరకు తెలంగాణలో
తాము ఉంటామని అనుకున్నారు. తెలంగాణలో మెజారిటీ స్థానాల్లో కె. చంద్రశేఖర రావు
నాయకత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)కి తామే
పోటీ ఇస్తామని కాంగ్రెసు నాయకులు ఇప్పటి వరకు భావించారు. అయితే,
వారి అంచనాలు తారుమారువుతున్నాయి.
తెలంగాణలో
తెలుగుదేశం పార్టీ పూర్తిగా దెబ్బ తిన్నదని, దాంతో
తెరాస, తాము మాత్రమే తెలంగాణలో
ఉంటామని కాంగ్రెసు నాయకులు భావిస్తూ వచ్చారు. కానీ పరకాల ఉప
ఎన్నికల ఫలితం కాంగ్రెసు నాయకుల
గుండెల్లో గుబులు రేపుతోంది. పరకాలలో కాంగ్రెసు పార్టీ డిపాజిట్ గల్లంతు కావడమే కావడమే కాకుండా నాలుగో స్థానంలో నిలిచింది. కాంగ్రెసు పార్టీ అభ్యర్థికి కేవలం 5099 ఓట్లు పోలయ్యాయి. డిపాజిట్
కూడా కోల్పోయింది.
పరకాల
ఫలితం తెలంగాణలోని చాలా నియోజకవర్గాల్లో సాధారణ
ఎన్నికల్లో పునరావృతం కావచ్చునని భావిస్తున్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి కొండా సురేఖ తెరాస
అభ్యర్థి బిక్షపతికి గట్టి పోటీ ఇచ్చారు.
తెరాస అభ్యర్థి కేవలం 1562 ఓట్లతో గట్టెక్కారు. అయితే, కొండా సురేఖ బలమైన
అభ్యర్థి కావడం వల్ల తెరాసకు
గట్టి పోటీ ఇవ్వగలిగారని అంటున్నారు.
మిగతా నియోజకవర్గాల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పరకాలలో ఇచ్చినంత పోటీ తెరాసకు ఇవ్వకపోవచ్చునని
అంటున్నారు.
అయితే,
తెరాసకు దీటుగా తెలంగాణలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీయే నిలబడుతుందనే విషయాన్ని మాత్రం పరకాల ఫలితం తేల్చిందనే
విశ్లేషణ సాగుతుంది. దీంతో కాంగ్రెసు పార్టీ
తెలంగాణ నాయకులు తీవ్రమైన ఆందోళనకు గురవుతున్నారు. సీమాంధ్రలో వైయస్ జగన్ సీట్లను
కొట్టుకోపోతే, తెలంగాణలో కెసిఆర్ కొట్టుకుపోతారని అంటున్నారు. ఇక్కడ మరో విషయాన్ని
కూడా గమనించాల్సి ఉంటుంది. తెరాస బలంగా లేని
అంటే తెలంగాణ సెంటిమెంటు అంతగా లేని హైదరాబాదు,
రంగా రెడ్డి జిల్లాల్లో, దక్షిణ తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలను గల్లంతు చేస్తుందనే విశ్లేషణ సాగుతోంది.
తెలంగాణలో
తెరాస బలంగా లేని స్థానాల్లో
2009 ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ విజయం సాధించింది. తెలంగాణ
సెంటిమెంట్ బలంగా లేని శానససభా
నియోజకవర్గాలను తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు
పొత్తులో భాగంగా తెరాసకు కేటాయించారు. నల్లగొండ జిల్లాలోని హుజూరు నగర్, హైదరాబాదులోని నాంపల్లి,
రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం వంటి స్థానాలు ఇందుకు
నిదర్శనం. ఈ విషయాన్ని చంద్రబాబు
గుర్తించుకుండా ప్రత్యేక ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం పట్ల ప్రజలు సుముఖంగా
లేకపోవడం వల్ల తెరాసతో పొత్తు
పెట్టుకోవడంతో తాము అధికారంలోకి రాలేకపోయామని
చంద్రబాబు అంటూ వస్తున్నారు.
2009 ఎన్నికల్లో
తెలుగుదేశం, కాంగ్రెసు గెలిచిన చాలా స్థానాల్లో వైయస్
జగన్ పార్టీ పాగా వేస్తే ఆ
రెండు పార్టీలకు మరింత గడ్డు కాలమే
ఎదురవుతోంది. ఈ భయమే ప్రస్తుతం
తెలంగాణ కాంగ్రెసు నాయకులకు పట్టుకుంది.
0 comments:
Post a Comment