కృష్ణా
జిల్లా గుడివాడ శాసనసభ్యుడు కొడాలి నాని తెలుగుదేశం పార్టీని
వీడుతుండటంతో ఇప్పుడు అంతా ఆ నియోజకవర్గం
పైనే చర్చ జరుగుతోంది. తనకు
తెలుగుదేశం పార్టీతో సంబంధం తెగిపోయిందని ఇప్పటికే నాని చెప్పారు. ఆయన
త్వరలో పార్టీకి, శాసనసభ్యత్వానికి రాజీనామా చేయనున్నారని తెలుస్తోంది. గుడివాడలో ఎన్నికలు జరిగితే ఎవరు గెలుస్తారనే అంశంపై
జోరుగా రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతోంది. ఇటీవల
జరిగిన ఉప ఎన్నికల నియోజకవర్గాలపై
జరిగిన చర్చ కంటే ఎక్కువగా
గుడివాడపై ప్రస్తుతం జరుగుతోంది. అందుకు పలు కారణాలు ఉన్నాయి.
గుడివాడ
నియోజకవర్గంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు జన్మించిన
నిమ్మకూరు ఉంది. ఆ నియోజకవర్గంలో
టిడిపికి మంచి ఆదరణ ఉంది.
1983లో ఎన్టీఆర్ పార్టీని స్థాపించిన తర్వాత ఇప్పటి వరకు ఆ నియోజకవర్గంలో
టిడిపి 1989లో ఒక్కసారి మాత్రమే
ఓటమి చవిచూసింది. అంతకుముందు, ఆ తర్వాత టిడిపికే
నియోజకవర్గ ప్రజలు పట్టం కట్టారు. రాష్ట్రవ్యాప్తంగా
ఇటీవలి వరకు బిసిలు టిడిపి
వెంటే ఉండేవారు.
అయితే
జగన్ పార్టీ స్థాపించాక వారంతా అటు వైపు వెళ్లారనే
వాదన ఉంది. టిడిపి నేతల
వ్యాఖ్యలను బట్టి కూడా అది
అర్థమవుతోంది. దీంతో వారు బిసిలను
దగ్గర చేర్చుకునేందుకు కార్యక్రమాలు చేపట్టనున్నారు. గుడివాడలో కూడా బిసిలతో పాటు
పలు వర్గాలు నందమూరి కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నాయి. అయితే
ఇన్నాళ్లూ నందమూరి కుటుంబానికి మద్దతుగా నిలిచిన కొన్ని వర్గాలు తాజాగా జగన్ వైపు చూస్తున్నాయనే
అభిప్రాయం కూడా నాని వైయస్సార్
కాంగ్రెసు వైపు వెళ్లేందుకు కారణమని
అంటున్నారు.
బాలయ్య
చూపు గుడివాడ పైన ఉండటం కూడా
ఓ కారణమని అంటున్నారు. 2014 ఎన్నికల వరకు బాలయ్య సినిమాలలో
బిజీగా ఉండనున్నారు. దీంతో ఆయన ఇప్పటికిప్పుడు
ఉప ఎన్నికలలో పోటీ చేయకపోయినప్పటికీ సాధారణ
ఎన్నికలలో మాత్రం ఖచ్చితంగా పోటీ చేసే అవకాశముందని
అంటున్నారు. బాలయ్య బాబు ఒప్పుకోకుంటే నాని
వ్యవహారం దృష్ట్యా టిడిపి నేతలు ఆయనను బుజ్జగించి
ఒప్పించే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. అయితే తన సొంత
గడ్డ ఉన్న గుడివాడపై బాలయ్యకు
సహజంగానే ప్రేమ ఉంటుందని, ఆయనను
ఎవరూ ఒప్పించాల్సిన అవసరం లేదని, ఆయన
పోటీకి సై అంటారని అంటున్నారు.
అదే జరిగితే నాని ఓటమి ఖాయమని
అంటున్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ముఖ్యంగా నియోజకవర్గంలో టిడిపి కార్యకర్తలు నానిపై భగ్గుమంటున్నారు. బాలయ్య రంగంలోకి దిగితే నానికి ధరావతు కూడా రావడం కష్టమని
అంటున్నారు. అయితే ఉప ఎన్నిక
వచ్చిన పక్షంలో బాలయ్య పోటీ చేసే అవకాశాలు
దాదాపు లేవు కాబట్టి... నాని
టిడిపి అభ్యర్థిని ఓడించి పాగా వేస్తే సాధారణ
ఎన్నికలలో ఆ ప్రభావం పడుతుందని
అంటున్నారు.
అయితే
తెలుగు తమ్ముళ్లు మాత్రం గుడివాడ అంటే టిడిపి అని
టిడిపి అంటే గుడివాడ అని..
తాము నానిని చూసి ఓటు వేయలేదని
నందమూరి కుటుంబాన్ని చూసి ఓటేశామని చెబుతున్నారు.
ఉప ఎన్నికలలో అభ్యర్థి ఎవరైనా నాని ఓటమి ఖాయమని
చెబుతున్నారు. అభ్యర్థి ఎవరైనా గుడివాడ ప్రజలు టిడిపికే పట్టం కడతారని విశ్వాసం
వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు నాని జగన్ పార్టీలో
చేరినప్పటికీ ఆయనకు నియోజకవర్గంలో ఇబ్బందులు
తప్పవనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
ఇప్పటికే
జగన్ పార్టీ తరఫున గుడివాడలో పోటీ
చేసేందుకు సీనియర్ నేత ఈశ్వర కుమార్
ఉన్నారు. 1989లో కాంగ్రెసు పార్టీ
తరఫున ఈయనే గెలుపొందారు. ఆయనే
ఇప్పుడు సిద్ధంగా ఉన్నారు. నాని ఆయన నుండి
ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశముందని అంటున్నారు. అయితే జగన్ నుండి
గట్టి హామీ వచ్చాకే నాని
టిడిపిని వీడారని, ఈశ్వర కుమార్‌కు
మరేదైనా ముఖ్యపదవి ఇచ్చి ఆయనను బుజ్జగించే
అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. అయితే నాని రాకతో
జగన్ పార్టీకి జిల్లాలో బలమైన కమ్మ నేత
దొరికాడు.
0 comments:
Post a Comment