హైదరాబాద్:
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు
వైయస్ జగన్మోహన్ రెడ్డి తన పార్టీ పట్టు
సాధించేందుకు తెలుగుదేశం పార్టీని దెబ్బతీసే విధంగా వ్యూహరచన చేశారని అంటున్నారు. ప్రధానంగా కోస్తా జిల్లాలలో టిడిపికి మంచి పట్టు ఉంది.
ఇప్పటికే తెలంగాణలో, రాయలసీమలో బాగా వీక్ అయిన
టిడిపిని కోస్తాలో కూడా ఓ సామాజిక
వర్గాన్ని తమ వైపుకు తిప్పుకోవడం
ద్వారా అక్కడ కూడా దెబ్బతీసే
విధంగా ముందుకు వెళుతున్నారని అంటున్నారు.
ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలలో టిడిపికి క్యాడర్ ఉంది. ఆ జిల్లాలలో
కాపులు అధికంగా ఉంటారు. వారంతా దాదాపు కాంగ్రెసు వైపుకు మొగ్గు చూపుతారు. ఆ తర్వాత స్థానం
కమ్మ సామాజిక వర్గానిది. వీరంతా స్వర్గీయ నందమూరి తారక రామారావు పార్టీ
స్థాపించినప్పటి నుండి టిడిపికి అండగా
నిలుస్తూ వస్తున్నారు. జగన్ సామాజిక వర్గానికి
చెందిన రెడ్లు ఉన్నప్పటికీ కాపు, కమ్మలతో పోటీ
పడే స్థాయిలో లేరని అంటున్నారు.
దీంతో
కమ్మ సామాజిక వర్గానికి చెందిన ముఖ్య నేతలను తన
వైపుకు తిప్పుకోవడం ద్వారా ఆ జిల్లాలలోని ఆ
క్యాడర్‌ను వైయస్సార్ కాంగ్రెసు
వైపు మరల్చవచ్చుననే వ్యూహంతో జగన్ వెళుతున్నారని అంటున్నారు.
అందుకే ఆయన వరుసగా ఆయా
జిల్లాలలోని కమ్మ సామాజిక వర్గం
నేతలను ప్రలోభ పెడుతున్నారని అంటున్నారు. మొదట గుంటూరు జిల్లాకు
చెందిన మాకినేని పెద రత్తయ్య జగన్‌కు జై కొట్టారు.
అయితే ఆయన పార్టీలో ఇమడలేక
పోయారు.
విజయనగరం
జిల్లాలో గద్దె బాబూరావు వంటి
నేతలు ఇప్పటికే జగన్ పంచన చేరారు.
కృష్ణా జిల్లాకు రాజకీయ రాజధానిగా పేరుంది. ఈ జిల్లాలోని కమ్మ
నేతలను తన వైపుకు రప్పించుకోవడం
ద్వారా పార్టీకి చాలా లబ్ధి జరుగుతుందనే
అభిప్రాయం జగన్‌లో ఉందని
అంటున్నారు. అందుకే ఆయన గతంలో వల్లభనేని
వంశీ తాజాగా కొడాలి నాని టార్గెట్ చేశారని
చెబుతున్నారు. నాని ఇప్పటికైతే జగన్
పార్టీలో చేరినట్లే భావించవచ్చు.
వంశీ
నడి రోడ్డు పైన జగన్‌ను
ఆలింగనం చేసుకోవడం అప్పట్లో సంచలనం రేపింది. అయితే ఆ తర్వాత
బాబును కలిసి వివరణ ఇచ్చుకున్నారు.
అయితే వంశీ ఏనాటికైనా నాని
బాటలోనే నడుస్తారనే గట్టి వాదన ఉంది.
రెండు రోజుల క్రితం నాని
జగన్‌ను కలిసినప్పుడు కృష్ణా
జిల్లా నేతలు అందరూ వేదికపైకి
వచ్చి ఆయనపై నిప్పులు గక్కారు.
కానీ వంశీ మాత్రం ఎక్కడా
కనిపించలేదు.
జగన్
తన వ్యూహంలో భాగంగానే మాకినేని పెద రత్తయ్య, గద్దె
బాబూరావు, వల్లభనేని వంశీ, కొడాలి నాని
వంటి నేతలను ఆకర్షించే ప్రయత్నాలు చేశారని, అందులో కొన్నింటిలో సఫలమయ్యారని అంటున్నారు. అదే సమాజిక వర్గానికి
చెందిన మిగతా నేతలకు కూడా
గాలం వేసేందుకు జగన్ వ్యూహం సిద్ధం
చేసుకున్నారని అంటున్నారు. అయితే జగన్ వ్యూహం
ఇలా ఉండగా.. టిడిపి మాత్రం వెళ్లాలనుకునే నేతలను ఆపాల్సిన అవసరం లేదని భావిస్తోందట.
నేతలు ముఖ్యం కాదని, ప్రజలు, కార్యకర్తలు తమకు ముఖ్యమని టిడిపి
భావిస్తోందని అంటున్నారు.
0 comments:
Post a Comment