Wednesday, July 4, 2012

Ys Vijayamma Delhi tour intention

హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ బుధవారం ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్‌ను కలిసి వినతి పత్రం సమర్పించారు. జగన్ పైన పగబూని, దురుద్దేశ్యంతో విచారణ జరుపుతున్నారని ఆమె ప్రధానికి ఫిర్యాదు చేశారు. రాష్ట్ర రైతాంగ సమస్యల పైన కూడా దృష్టి సారించాలని ఆమె ప్రధానిని కోరారు. ఈ సందర్భంగా జగన్ పైన కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారంటూ విజయమ్మ ప్రధానికి ఇచ్చిన లేఖ పూర్తి పాఠం...

గౌరవవ నీయులైన ప్రధాన మంత్రి మన్మోహన్‌సింగ్ గారికి,
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కడప పార్లమెంటు సభ్యులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి వ్యతిరేకంగా కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) 2011 ఆగస్టు 17న ‘క్విడ్ ప్రో కో'గా ఆరోపిస్తున్న కేసు దర్యాప్తును చేపట్టడం కోసం ఎఫ్‌ఐఆర్‌ను దాఖలు చేసిం ది. అప్పటి నుంచి సీబీఐ, దాని జాయింట్ డెరైక్టరు లక్ష్మీనారాయణల పనితీరు, ఈ కేసు వెనుక దర్యాప్తు సంస్థకు ఉన్న అసలు ఉద్దేశంపట్ల సందేహానికి తావిచ్చేదిగా ఉంది.

వరుసగా రాసిన లేఖల ద్వారా గతంలోనే ఈ అంశాన్ని మీ దృష్టికి తెచ్చాం. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో 18 శాసనసభ స్థానాలకు, ఒక లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికలలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ పదిహే ను శాససనసభ స్థానాలను, పార్లమెంటు స్థానాన్ని భారీ మెజారిటీతో గెలుచుకుంది. ఘన విజయాన్ని సాధించిన వైఎస్సార్ పార్టీ నేతలను వేధించడానికి పెద్ద కుట్ర జరుగుతోందన్న మా భయాలు నిరాధారమైనవి కాదని రుజువు చేసే కొంత సమాచారాన్ని మేం సేకరించాం.

పకడ్బందీగా రూపొందించిన పథకం ప్రకారమే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని వేధిస్తున్నారన్న విషయాన్ని వివరించడం కోసం ఆంధ్రప్రదేశ్ పరిణామాలను మీ దృష్టికి తేవాలని భావిస్తున్నాం. ఏపీలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు ‘పోలీసు రాజ్యాన్ని' తలపింపజేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ పోలీసులు, సీబీఐ కలిసి రాష్ట్రంలో భయాన కంగా పాలన సాగిస్తున్నాయి. దర్యాప్తు ముసుగులో కేసులు బనాయిస్తూ, అక్రమ అరెస్టులు సాగిస్తూ ప్రజాస్వామ్యం గొంతు నులుముతున్నాయి. జగన్‌మోహన్‌రెడ్డిని లక్ష్యంగా చేసుకొని కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ, ఏపీ పోలీసుశాఖ, సీబీఐ కలిసికట్టుగా పనిచేస్తున్నాయి.

హైకోర్టు ఆదేశాలలో పేర్కొన్న విధంగా ప్రభుత్వం ఉదారంగా కలుగజేసిన మేళ్లపై దర్యాప్తును సాగించడానికి బదులుగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి పేరును సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో చేర్చడంతో ఈ కుట్ర వెలుగులోకి వచ్చింది. సీబీఐ తమకు అనువుగా ఉండేలా కోర్టు ఆదేశాలలోని ‘ప్రభుత్వం' అనే పదాన్ని తొలగించి, దాని స్థానంలో దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి పేరును చేర్చింది. జగన్‌మోహన్‌రెడ్డికి వ్యతిరేకంగా కేసు పెట్టడం కోసం సీబీఐ ఉద్దేశపూర్వకంగానే దివంగత రాజశేఖరరెడ్డి పేరును చేర్చి కుట్ర సిద్ధాంతాన్ని ముందుకు తెచ్చింది.

లేకపోతే జగన్‌మోహన్‌రెడ్డిపై కేసు పెట్టడానికి అవకాశమే లేదు. సంచలనాత్మకత పట్ల మోజును చూపుతూ సీబీఐ, జగన్‌మోహన్‌రెడ్డి దివంగతులైన తన తండ్రి రాజశేఖరరెడ్డిని ప్రభావితం చేశారన్న అర్థంపర్థంలేని ఆరోపణను కూడా చేసింది. అదో ఊహాత్మక కల్పనతప్ప వేరేమీ కాదు. జగన్‌మోహన్‌రెడ్డి హైదరాబాద్‌కు అరుదుగానూ, చాలా తక్కువగానూ వస్తుండేవారు. బహుశా నెలకి ఏ ఒక్కసారో వచ్చేవారు. వచ్చినా ప్రధానంగా కుటుంబ సమావేశాలకే పరిమితమయ్యే వారు. తమ తండ్రి దివంగతులయ్యేలోగా జగన్‌మోహన్‌రెడ్డి ఏ ఒక్కసారీ రాష్ట్ర సచివాలయం లో అడుగుపెట్టింది లేదు. తండ్రి ప్రభుత్వంలోని మంత్రులను కలుసుక్నుది లేదు, ఏ ఒక్క అధికారితోనూ మాట్లాడిందీ లేదు.

వైఎస్సార్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలలో జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నడూ భాగస్వామి కారు, ఆయన ఏ ఒక్క సమీక్షా సమావేశానికి హాజరైందీ లేదు. ఏ ప్రభుత్వంలోనైనా మంత్రివర్గమంతా కలిసే నిర్ణయాలను తీసుకుంటుం దని, ఏ ఒక్కవ్యక్తో తీసుకున్న నిర్ణయాలను రుద్దడం జరగదని మీకు బాగా తెలుసు. పైగా, దివంగత వైఎస్సార్ నేతృత్వంలో సాగిన పాలన అంతకు ముందటి ప్రభుత్వ విధానాల, ప్రక్రియల కొనసాగింపు, ముందటి పద్ధతుల పొడిగింపు మాత్రమే.

ఉదాహరణకు ఎమ్మార్ ఆస్తుల వ్యవహారానికి సంబంధించిన ఘట్టాన్నే చూడండి. హైదరాబాద్ నగరం నడిబొడ్డునున్న భూములను పెద్ద ఎత్తున కారుచౌకకు ఎమ్మార్ సంస్థకు కేటాయించడానికి కారకులు ఆనాటి ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు. తొలుత ఆయన 250 ఎకరాల మేరకు భూమిని ఆ కంపెనీకి కేటాయించారు. ఆ తదుపరి మరో 250 ఎకరాల అత్యంత విలువైన భూమిని ఒకే ఒక్క బిడ్డర్‌కి కట్టబెట్టారు. గోల్ఫ్ మైదానం ఏర్పాటు చేయడం కోసం, విలాసవంతమైన విల్లాల నిర్మాణం కోసం, అయిదు నక్షత్రాల హోటల్ ఏర్పాటు కోసం హైదరాబాద్‌లో 500 ఎకరాల మేర అత్యంత విలువైన భూములను ప్రభుత్వం కేటాయించడానికి కూడా చంద్రబాబునాయుడే కారకులు. ఈ భూకేటాయింపులు ఫ్యాక్టరీ నిర్మాణం కోసమో లేదా ఉపాధి కల్పన కోసమో జరిగినవి కావు.

అప్పట్లో మార్కెట్టు రేటు ఎకరానికి రూ. 4 కోట్లుండగా, ఎకరా రూ. 29 లక్షల రేటుకు కారుచౌకకు చంద్రబాబునాయుడు కేటాయించారు. ప్రభుత్వ ఆస్తులను పందారం చేయడంలో ఇంతకంటే ఎక్కువ అన్యాయం ఉండగలదా? సీబీఐ ఇప్పుడు ఎమ్మార్ కేసును దర్యాప్తు చేస్తోంది. అయినా చంద్రబాబును పిలవడంగానీ లేదా ప్రశ్నించడంగానీ దానికి అవసరమని అనిపించడం లేదు.మరోవంక, దివంగత రాజశేఖరరెడ్డి గత 30 ఏళ్లుగా ఉన్న ఒక ఫ్యాక్టరీకి నీటిని కేటాయించడం వంటి రొటీన్ నిర్ణయాలను తీసుకోవడానికి, లేదా క్రమానుగతంగా సాగే ప్రక్రియలలో భాగమైన లీజులు లేదా అనుమతులను మంజూరు చేయడానికి సీబీఐ మేళ్లు కలుగజేయడంగా భాష్యం చెబుతోంది.

సీబీఐ ఈ విషయంలో కోర్టులను ఆశ్రయించవచ్చు, అందులో చట్ట విరుద్ధమైనదేమైనా ఉంటే ‘మేళ్లుపొందిన' వారిపై కోర్టులలో న్యాయ పోరాటం సాగించవచ్చు. ఆ నిర్ణయాలు అసమంజసమైనవని తేలితే ఎప్పుడైనాగానీ వాటిని రద్దు చేయవచ్చు. అంతేగానీ, దేశంలో ఎనిమిదవ పెద్ద దినపత్రిక అయిన ‘సాక్షి'లో ‘మేళ్లు పొందిన' వారు క్విడ్ ప్రో కో పెట్టుబడులను పెట్టారని ఆరోపించడం ఎలా సమంజసమవుతుంది? మరొక తెలుగు దినపత్రిక ‘ఈనాడు' రూ.1,800 కోట్ల నష్టాలను మూటగ ట్టుకుంది. దాని విలువను రూ.6,800 కోట్లుగా లెక్కగట్టారు. సాక్షిలో పెట్టుబడులు పెట్టడం ప్రారంభం కావడానికి కేవలం ఏడు నెలల ముందు ఈనాడు తన షేర్లను ఒక్కోదాన్ని రూ.5,28,000ల భారీ రేటుకు అమ్ముకుంది. సాక్షిలో పెట్టుబడులు పెట్టిన ప్రతి ఒక్కరూ ఈ విషయాలన్నిటినీ పూర్తిగా తెలుసుకునే పెట్టుబడులు పెట్టారు.

సముచితమైన వివరణ, విలువ మదింపు నివేదికలతో సాక్షి, ఈనాడు విలువలో సగం విలువకే మదుపరులకు అందుబాటులోకి వచ్చింది. సాక్షి షేర్లను అమ్మింది డిజిన్వెస్ట్‌మెంట్లో (ఆస్తుల అమ్మకంలో) భాగంగా కాదు, ప్రమోటర్ షేర్ల వాటాను తగ్గించుకోవడం ద్వారా. అంటే, సాక్షి అమ్మిన షేర్లు వాటిని కొనుక్కున్నవారి ఆధీనంలోనే ఉంటాయి, వాటిని తమకు ఇష్టమొచ్చినవారికి అమ్ముకునే పూర్తి స్వేచ్ఛ మదుపరులకు ఉంటుంది. అలాంటి మదుపరులు జగన్‌మోహన్‌రెడ్డి బినామీలని ఎవరైనాగానీ ఎలా అనగలరు? సీబీఐ వాదనలో ఇక్కడ కూడా ఓ అంతర్గత వైరుధ్యం ఉంది. ఒక వంక సాక్షి షేర్లు విలువలేనివంటూనే, మరోవంక ఈ పెట్టుబడులతో సాక్షికి అపార లబ్ధి చేకూరిందని సీబీఐ వాదిస్తోంది.

నాలుగేళ్ల క్రితం 12 లక్షల సర్క్యులేషన్‌తో ప్రారంభమైన సాక్షి అన్ని అంచనాలను మించి, అన్ని అడ్డంకులను అధిగమించి 14.57 లక్షల సర్క్యులేషన్‌ను, ఐఆర్‌ఎస్ అంచనాల ప్రకారం 1.43 కోట్ల రీడర్‌షిప్‌ను (మూలం: ఐఆర్‌ఎస్ క్యూ4-2011) సాధించింది. దేశంలోని పది అగ్రశ్రేణి దినపత్రికలలో సాక్షి ఎనిమిదవ స్థానంలో నిలిచింది. సాక్షిలోకి పెట్టుబడులు దఫదఫాలుగా వచ్చాయి. మార్కెట్‌లో ఒక ఉత్పత్తిగా సాక్షి తనను తాను రుజువు చేసుకుంటున్న క్రమంలోనే మదుపులు కూడా అందులోకి ప్రవహించాయి.

అయితే న్యూస్‌ప్రింట్ ధర పెరగడం, డాలర్ విలువలో ఎగుడు దిగుళ్లు సంభవించడం, మన అదుపులోలేని ఆర్థిక తిరోగమనం వంటి అనూహ్య పరిణామాలు సాక్షి రాబడులపై ప్రభావాన్ని చూపాయి. అయితే ఆ భగవంతుని దయవల్ల అది ఈ ప్రతికూల పరిస్థితులను తట్టుకుని నిలిచింది. అందువల్లనే సాక్షి షేర్లను ఈనాడు షేర్ల విలువ లో సగానికే అమ్మినా మదుపరులలో ప్రతి ఒక్కరూ లాభాలను ఆర్జించగలిగే పరిస్థితి ఏర్పడింది.

ఇతర ఆరోపణల గురించి కూడా మేము కొన్ని వాస్తవాలు చెప్పదలచుకున్నాం. జగన్‌మోహన్‌రెడ్డి సొంత డబ్బే మారిషస్ వంటి దేశాల నుంచి ‘21 కేపిటల్', ‘ప్లూరీ' అనే సంస్థల ద్వారా రూ.124 కోట్లు పెట్టుబడుల రూపం లో వచ్చినట్లు సీబీఐ వాదిస్తున్నది. ఆ మొత్తం నిధులకు ఆర్‌బీఐ ఆమోదముద్రతోపాటు ‘సెబీ' రిజిస్ట్రేషన్ అంకెలు కూడా ఉన్నప్పుడు సీబీఐ ఈ విధంగా వాస్తవ దూరమైన ఆరోపణలు చేయడమేమిటి? అవే సంస్థలు ఐడియా సెల్యులర్, గాయత్రీ ప్రాజెక్ట్స్ వంటి పెద్ద కంపెనీల్లో కూడా పెట్టుబడులు పెట్టాయి. ఆ గ్రూపులు పెట్టిన డబ్బు జగన్‌దే అయితే, వేరెవరో తక్కువకు కొనుక్కున్న తమ షేర్లను తామే ఎక్కువకు కొనుక్కొని పెట్టుబడులుగా పెట్టడం ఏమిటి?

జగన్‌మోహన్‌రెడ్డి పట్ల సీబీఐ వేధింపు ధోరణికి హద్దులు లేవనిపిస్తున్నది. నిరాధారమైన ఆరోపణలు చేయడంతో ఆగక మదుపుదారులను హింసించడం, జగన్‌కు వ్యతిరేకంగా తప్పుడు సాక్ష్యం చెప్పవలసిందిగా కొందరిని భయభ్రాంతులకు గురి చేయడం నిరవధికంగా సాగిపోతున్నది. వేరువేరు చార్జిషీట్లను దాఖలు చేసి నెపంతో కేసును వీలైనంత ఎక్కువ కాలం సాగదీయాలని సీబీఐ చూస్తోంది. ఎఫ్‌ఐఆర్ ఒక్కటే అయినా, సీబీఐ ఇప్పటికే మూడు చార్జిషీట్లను దాఖలు పరిచింది. ఇంకా మరికొన్ని దాఖలు చేయాల్సినవి ఉన్నట్లు చెబుతోంది.

జగన్‌మోహన్‌రెడ్డిని వేధించడం సీబీఐ ఏకైక ఉద్దేశం అన్నది తెలుస్తూనే ఉన్నది. సుదీర్ఘ కోర్టు వ్యాజ్యాలతో బెయిల్ రాకుండా అడ్డంకులు సృష్టించి కేసు ఓ కొలిక్కి రాకుండా చేసి జగన్‌మోహన్‌రెడ్డిని ప్రజల మధ్య ఉండ కుండా చేయడం ద్వారా ఆయనను మరిన్ని కష్టాల పాలు చేయడమే సీబీఐ లక్ష్యం అన్నది సుస్పష్టం. బెయిల్ కోసం పదే పదే కోర్టు చుట్టూ చక్కర్లు కొట్టేట్టు చేయడానికి, విష వలయంలో బందీని చేయడానికి సీబీఐ అదే పనిగా చార్జిషీట్ల మీద చార్జిషీట్లు దాఖలు చేస్తున్నది. నిందితుడిని చాలా కాలం పాటు వేధింపులకు గురిచేయాలనే వ్యూహం ఉన్నందువల్లే ఒక ఎఫ్‌ఐఆర్, ఒకటికి మించిన చార్జిషీట్ల విధానాన్ని సీబీఐ అవలంబిస్తోంది.

జగన్‌మోహన్‌రెడ్డిని ఎంత కాలం వీలైతే అంత కాలం కటకటాల వెనుక బంధించి ప్రజలను కలుసుకోకుండా చేసే దురుద్దేశంతో పన్నిన కుట్ర ఇది అని చెప్పవచ్చు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, ఎంపీగా ఉన్న హోదాతో సాక్షులను ప్రభావితం చేస్తాడనే కారణం చూపి, కేసు నమోదైన 280 రోజులపాటు చేతులు ముడుచుకొని కూర్చున్న సీబీఐ మే 27న జగన్‌మోహన్‌రెడ్డిని అరెస్టు చేయడం గమనార్హం. సీబీఐ విచారణ ప్రారంభించిన 2011 ఆగస్టులో కూడా ఆయన ఎంపీయే కదా? ఆ నాడు సాక్షులను ప్రభావితం చేయని వాడు ఇప్పుడు హఠాత్తుగా చేస్తాడని సీబీఐ ఎందుకు అనుకున్నది? ఎవరినైనా ప్రభావితం చేసేందుకు ఆయనేమీ పాలకపక్షం ఎంపీ గానీ, అధ్యక్షుడుగానీ కాదు కదా!

కంటికి కనబడని అతిపెద్ద కుట్రలో భాగమే జగన్ మోహన్‌రెడ్డి అరెస్టు అని మేము గట్టిగా నమ్ముతున్నాము. ఆయన మే 28న సీబీఐ కోర్టు ముందు హాజరుకావలసి ఉంది. కానీ ఎన్నికల ప్రచారంలో క్షణం తీరికలేకుండా ఉన్న జగన్‌మోహన్‌రెడ్డిని సీబీఐ జాయింట్ డెరైక్టర్ ప్రతీ కారేచ్ఛతో మే 25న తన ముందు హాజరు కావలసిందిగా సమన్లు జారీ చేశారు. మూడు రోజుల విచారణ అనం తరం, సీబీఐ కోర్టు సాధికారతను లక్ష్యపెట్టకుండా సీబీఐ మే 27 రాత్రి ఆయన అరెస్టును ప్రకటించింది. ఎవరైనా ఒకరు ఎంపీ కావడంతోపాటు, ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడు అయినంత మాత్రాన సాక్షులను ప్రభావితం చేయగలరని భావించి అరెస్టు చేసే స్వతంత్రం సీబీఐకి ఉందా అసలు? అరెస్టు ఎంత కాలం కొనసాగుతుంది? ఆయనను అప్రజాస్వామికంగా నిర్బంధించిన తీరు ఎమ ర్జెన్సీ రోజులను తలపునకు తెస్తున్నాయి.

తొమ్మిది నెలల దర్యాప్తు కాలంలో జగన్‌మోహన్ రెడ్డిని విచారణ నిమిత్తం కనీసం ఒకసారైనా సీబీఐ పిలవ లేదు. కానీ ఒక లోక్‌సభ, 18 శాసనసభ స్థానాలకు ఉప ఎన్నికల పోలింగ్ 15 రోజుల్లో ఉందనగా మే 25న ఆయనకు సీబీఐ సమన్లు పంపింది. సీబీఐ కోర్టు జారీ చేసిన సమన్లలో మే 28న ఆయన వ్యక్తిగతంగా కానీ లేదా వకీలు ద్వారా గాని హాజరు కావచ్చని పేర్కొన్నది. సీబీఐ కోర్టు ముందు మరో మూడు రోజుల్లో జగన్ హాజరు కానుండగా, ముందుగా ఆయ నను రప్పించడంలో సీబీఐ కనబరచిన ఉత్సాహం వెనక ఆయనను అరెస్టు చేయాలనే ఆలోచన స్పష్టంగా కని పిస్తుంది.

సీబీఐ కోర్టు సమన్లు జారీ చేసిన సంగతి అతి స్పష్టంగా తెలిసి ఉండి కూడా సీబీఐ ఆయనను సెక్షన్ 41(ఎ) కింద పిలిపించింది. జగన్ మోహన్‌రెడ్డి చట్టాన్ని గౌరవించే పౌరునిగా మూడు రోజు ల ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని వదులుకొని సీబీఐకి సహకరించారు. చివరకు ఆదివారం కూడా ఆయనను సీబీఐ వదలలేదు. విచారణకు హాజరు కావలసిందిగా కోరింది. అదే రోజు రాత్రి అరెస్టు చేసింది. అరెస్టు సం దర్భంగా ‘‘ఎంపీగా, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడిగా ఆయన సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉంది'' అని ప్రకటించింది.

సీబీఐ సమన్లను సవాలు చేస్తూ జగన్‌మోహన్‌రెడ్డి సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సీబీఐ ఇప్పటికే కేసులో చార్జిషీటు దాఖలు చేసినందువలన, అరెస్టు ప్రశ్న తలెత్తే అవకాశం లేదని సీబీఐ కోర్టు అభిప్రాయపడుతూ పిటిషన్‌ను కొట్టివేసింది. చార్జిషీటు దాఖలైనందున దర్యాప్తు పూర్తయి ఉంటుంది కనుక, తనను అరెస్టు చేస్తారని నిందితుడు అభిప్రాయపడనవసరం లేదని కోర్టు ప్రకటించింది. అయినా సీబీఐ, కోర్టు అభిప్రాయాలను భేఖాతరు చేస్తూ, మూడు రోజుల విచారణ అనంతరం జగన్‌మోహన్‌రెడ్డిని అరెస్టు చేయాలని నిశ్చయించుకుంది. ఉప ఎన్నికలకు ముందు జగన్‌ను అరెస్టు చేసే ఏకైక లక్ష్యం సీబీఐకి ఉన్నదనే వాస్తవాన్ని ఈ పరిణామం స్పష్టంగా సూచిస్తోంది.

సీబీఐ జాయింట్ డెరైక్టర్ లక్ష్మీనారాయణ అభ్యంతర కరమైన పని తీరును మీ దృష్టికి తేవాలనుకుంటున్నాం. సీబీఐ మాన్యువల్ ప్రకారం కేసును దర్యాప్తు చేసే అధికారులు మీడియాకు సమాచారం లీక్ చేయకూడదు, చెప్పకూడదు. పత్రికల వారికి సీబీఐ ఒకవేళ ఏదైనా సమాచారం అందజేయదలచుకుంటే అది కేవలం సీబీఐ ప్రధాన కార్యాలయం మాత్రమే చేయాలి. సంబంధిత సమాచారాన్ని సంస్థ ప్రజా సంబంధ అధికారి ద్వారా మీడియాకు విడుదల చేయాలి. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) శాఖ నగరంలో ఒకవేళ ఉనికిలో ఉంటే (ఈ కేసులో ఉంది) దాని ద్వారా మాత్రమే సమాచారాన్ని పత్రికలకు పంపిణీ చేయాలి. కానీ జగన్‌కు వ్యతిరేకంగా దాఖలైన ‘క్విడ్ ప్రో కో' కేసులో సీబీఐ జాయింట్ డెరైక్టర్ తన పరిమితులు దాటి పనిగట్టుకుని ఎంపిక చేసిన సమాచారాన్ని ఎంపిక చేసిన పత్రికలకు అందజేశారు.

జగన్ ప్రతిష్టకు భంగం కలిగించాలనే ఉద్దేశంతోనే ఆయన ఈ పనికి పాల్పడ్డారన్నది స్పష్టం. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సేకరించిన మొబైల్ ఫోన్ల జాబితాను బట్టి చూస్తే లక్ష్మీనారాయణ తనకు కావలసిన పత్రికల వారితో క్రమంతప్పకుండా సంబంధాలు కొనసా గించారని తేటతెల్లమవుతుంది. కేసు పురోగతిని తెలుసుకు నేందుకు పాత్రికేయులు దర్యాప్తు అధికారులతో ఫోన్లో మాట్లాడటం, సమాచారం సంగ్రహించడంలో తప్పేమీ లేదు. కానీ ఈ కేసులో పాత్రికేయులు అధికారులతో మాట్లాడలేదు. అధికారి లక్ష్మీనారాయణే స్వయంగా అత్యు త్సాహం ప్రదర్శిస్తూ పాత్రికేయులతో, పత్రికా యజమా నులతో కొన్ని వందలసార్లు మాట్లాడి సమాచారాన్ని అందజేశారు.

బాధ్యతగల పోలీస్ అధికారిగా కాకుండా లక్ష్మీనారాయణ ఒక ముఠా నాయకుడిలా వ్యక్తిగత కక్ష్యతో జగన్‌పై పగబూనినట్టు వ్యవహరించారని చెప్పేందుకు మేము బాధపడుతున్నాం. కేసులో బాధ్యులుగా ఉన్న ఇద్దరు న్యాయమూర్తులకు కూడా లక్ష్మీనారాయణ ఫోన్లు చేసినట్లు, వాసిరెడ్డి చంద్రబాల అనే మహిళకు ఫోన్లు చేసి నట్లు, ఆమె అవతలి పక్షానికి చెందిన పత్రిక యజమానితో అనేకసార్లు మాట్లాడినట్లు, చంద్రబాబు నాయుడుకు సన్ని హితులుగా ఉన్న కొందరు సీనియర్ ఐపీఎస్ అధికారు లతో కూడా ఆయన సంభాషణలు జరిపినట్లు ఫోన్ల జాబి తా తేల్చిచెప్పింది. ఈ మొత్తం వ్యవహారంలో చంద్రబాల పాత్రపై మాకు మా సందేహాలున్నాయి.

సీబీఐ జాయింట్ డెరైక్టర్‌కు, మీడియాలో ఓ వర్గానికి మధ్య బంధం ఎంత బలీయంగా ఉందంటే... జైలు నుంచి కోర్టుకు జగన్ వాహనం ఏ దారిన ప్రయాణం చేసేది కూడా వారికి చెప్పారు. తద్వారా జగన్ ప్రాణాలకు ముప్పువాటిల్లే అవకాశం కల్పించారు. జగన్‌కు ప్రాణ హాని ఉన్నందున ఆయనకు ‘జడ్' కేటగిరీ భద్రత ఉంది. అటువంటప్పుడు జగన్ వాహనం వెళ్లే మార్గాన్ని మీడి యాకు చెప్పడం ఎలా సమర్థనీయం అవుతుంది? కనీసం సరైన కిటికీలు కూడా లేని అతి సామాన్యమైన పోలీసు వాహనంలో ఆయనను జైలుకి తీసుకెళ్లడం కూడా కుట్రలో భాగమేనని మేము నమ్ముతున్నాం. సీబీఐని, రాష్ట్ర ప్రభుత్వాన్ని కోర్టు తప్పుపట్టిన తర్వాతే ఆయనకు బుల్లెట్ ఫ్రూప్ వాహనాన్ని ఏర్పాటు చేశారు.

కుట్ర ఇక్కడితో ముగియలేదు. జగన్‌ను ఉంచిన చంచల్‌గూడ కేంద్ర కారాగారంలో వరసగా రెండు రాత్రులు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. జనరేటర్ ఉన్నప్పటికీ జైలు అధికారులు ఉపయోగించలేదు. ఎవరి ఆదేశాల మేరకు ఈ కుట్రలు జరిగినట్టు? దీని వెనక ఉద్దేశం ఏమై ఉంటుంది? ఈ పరిణామాలు జగన్ భద్రతకు తీవ్రస్థాయిలో భంగం కలిగిస్తాయని నమ్మడానికి మా కారణాలు మాకున్నాయి. నార్కో పరీక్షలు ఎవరిపైనైనా జరపడం చట్టవిరు ద్ధమని సుప్రీంకోర్టు గతంలో చాలాసార్లు తీర్పు వెలు వరించిన సంగతి మీ దృష్టికి తేదలచుకున్నాం. నార్కో అనాలసిస్ పరీక్షలు జరిగిన మనిషికి తీవ్రమైన అస్వస్థత కలిగే ప్రమాదమే కాక కొన్నిసార్లు ప్రాణం కూడా పోవ చ్చునని వైద్యనిపుణులు ఎన్నోమార్లు స్పష్టం చేశారు. ఎంతో అనుభవం గడించిన అధికారి అయి ఉండి కూడా లక్ష్మీనారాయణ జగన్‌పై నార్కో పరీక్షలు నిర్వహించాలని పట్టుబడుతున్నారు. ఎమ్మార్ కేసులో చంద్రబాబు పట్ల ఉదాసీనవైఖరి కనబరుస్తున్న సీబీఐ జగన్ కేసులో ప్రతీకారేచ్ఛ కనబరచడం... వేధింపు ధోరణికి అతి స్పష్టమైన దాఖలా. లక్ష్మీనారాయణకు కేసు విచారణకన్నా జగన్‌మోహన్ రెడ్డిని హింసించడమే లక్ష్యంగా ఉందని ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.

ఎంపీ కావడం వలన, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు కావ డం వలన జగన్ సాక్షులను ప్రభావితం చేస్తాడనే ఆరో పణపై ఆయనను అరెస్టు చేయడం చెల్లనేరదని మేము చిత్తశుద్ధితో భావిస్తున్నాం. సీబీఐ ఊహిస్తున్నట్లు అరెస్టుకు ముందు తొమ్మిది నెలల కాలంలో జగన్ ఏనాడూ ఎవరినీ ప్రభావితం చేయలేదనే వాస్తవాన్ని మీ దృష్టికి తేవాలనుకుంటున్నాం. జగన్ అరెస్టు, అనంతర వేధింపు పూర్తిగా అప్రజాస్వామికం. ఎమర్జెన్సీ నాటి చీకటి రోజు లను తలపించే ఘట్టం. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం భయోత్పాతాన్ని సృష్టించింది. అంతేకాదు. జైలులో జగన్ మోహన్‌రెడ్డిని కలుసుకోవాలని కోరుకునే సందర్శకులపై ప్రభుత్వం ఆంక్షలు విధిస్తున్నది. నిజాలు మీముందుంచాం.

జగన్‌మోహన్‌రెడ్డిపై పగ బూని, దురుద్దేశ పూర్వకంగా దర్యాప్తు జరుపుతున్న సీబీఐ జాయింట్ డెరైక్టర్ లక్ష్మీనారాయణ పనితీరుపై సుప్రీం కోర్టు సిట్టింగ్ జడ్జి, చీఫ్ విజిలెన్స్ కమిషనర్‌లతో విచార ణకు ఉత్తర్వులు జారీ చేయవలసిందిగా సవినయంగా కోరుతున్నాం. జగన్‌మోహన్‌రెడ్డికి ప్రాణహాని ఉందని మేం భావిస్తున్నాం కనుక మా నివేదనను పరిశీలించి వెంటనే అవసరమైన విచారణకు తగు ఆదేశాలు జారీ చేయాలని విన్నవించుకుంటున్నాం. అదేవిధంగా విచారణ నిష్ప క్షపాతంగా జరిగేలా చూడమని సీబీఐని ఆదేశించా ల్సిందిగా కోరుతున్నాం. లేకపోతే ప్రజాస్వామ్యంపై ప్రజలు విశ్వాసాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది.
కృతజ్ఞతలతో... భవదీయురాలు
వైఎస్ విజయమ్మ

0 comments:

Post a Comment

Disclaimer

Buy original DVDs, CDs and cassettes from the nearest store. These are provided to give users the idea of best movies & music. All the rights are reserved to the audio company. This blog owner holds no responsibility for any illegal usage of the content.
Related Posts Plugin for WordPress, Blogger...

TW

Surfguiden
DMCA.com

feeds

Submit Blog & RSS Feeds Best Indian websites ranking submit site Increase traffic Entertainment Blogs
Entertainment directory BritBlog
Online Marketing
Oferty i praca w Zarabiaj.pl Submit Your Site To The Web's Top 50 Search Engines for Free!

wibiya widget