హైదరాబాద్:
కర్ణాటక మాజీ మంత్రి గాలి
జనార్దన్ రెడ్డికి పట్టాభిరామారావు ముడుపులు తీసుకుని బెయిల్ ఇచ్చిన కేసు అవినీతి నిరోధక
శాఖ (ఎసిబి) చేతిలో పడింది. దీనిపై శనివారం ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు ఎసిబి
సిద్ధమవుతోంది. పట్టాభి రామారావు ముడుపులు తీసుకుని బెయిల్ మంజూరు చేసిన వ్యవహారానికి సంబంధించి
సిబిఐ ఆడియో, వీడియో ఆధారాలను కూడా సేకరించింది. ఈ
కేసును తామే దర్యాప్తు చేయాలా?
లేక ఏసీబీకి అప్పగించాలా? అనే అంశంపై తర్జన
భర్జనలు పడి, సాంకేతిక అంశాలన్నీ
పరిశీలించి, నిబంధనల ప్రకారం - ఇది ఏసీబీ పరిధిలోకే
వస్తుందనే అభిప్రాయానికి వచ్చింది.
పట్టాభి
సిబిఐ కేసుల ప్రత్యేక కోర్టు
జడ్జిగా ఉన్నప్పటికీ ఆయనకు రాష్ట్ర ప్రభుత్వమే
జీతం చెల్లిస్తుంది. ఆయనను రాష్ట్ర ప్రభుత్వ
పరిధిలోని ఉద్యోగిగానే భావించాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వ
ఉద్యోగులు లంచాలు తీసుకున్న కేసుల్లో మాత్రమే సిబిఐ కేసులు నమోదు
చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల అవినీతి సంగతి ఎసిబియే చూస్తుంది.
న్యాయ నిపుణులతో చర్చించిన అనంతరం సిబిఐ హైకోర్టుకు మొత్తం
పరిస్థితిని వివరించింది. చివరికి, ఈ కేసు దర్యాప్తు
బాధ్యతను ఎసిబికి అప్పగిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
శుక్రవారం
సాయంత్రం హైకోర్టు నుంచి కేసు ఫైలు
ఎసిబికి అందింది. వెంటనే ఎసిబి లీగల్ సెల్
నిపుణులు దీనిని అధ్యయనం చేయడం మొదలుపెట్టారు. హైకోర్టు
నుంచి ఈ కేసు ఫైలు
అందిందని, తమ న్యాయ నిపుణులు
దీనిని పరిశీలిస్తున్నారని, శనివారం కేసు నమోదు చేసే
అవకాశం ఉందని ఎసిబి డిజి
ప్రసాదరావు అన్నారు. ఎసిబి నమోదు చేయనున్న
ఎఫ్ఐఆర్లో సస్పెండయిన జడ్జి
పట్టాభి రామారావు, ఆయన కుమారుడు రవిచంద్ర,
కర్ణాటక ఎమ్మెల్యేలు గాలి సోమశేఖర్ రెడ్డి,
సురేశ్ బాబు, మాజీ జడ్జి
చలపతిరావు, ఆయన సోదరుడు బాలాజీ,
రౌడీషీటర్ యాదగిరి రావు, ఇద్దరు న్యాయవాదులతోపాటు
బినామీ పేర్లతో లాకర్లను తెరవడానికి అవకాశం కల్పించిన బ్యాంకు అధికారుల పేర్లు ఉండే అవకాశముందని తెలుస్తోంది.
తమకు
అందిన సమాచారాన్ని మొదటి నుంచి అప్పటి
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లోకూర్కు సిబిఐ నివేదిస్తూనే
ఉంది. బెయిల్ బేరసారాలపై సిబిఐ పక్కా ఆధారాలు
సేకరించినందున ఎసిబి పని సులువైనట్లే.
మరోవైపు, ఈ వ్యవహారంపై ఏసీబీ
కేసు నమోదు చేసినప్పటికీ, సిబిఐ
దర్యాప్తు కూడా కొనసాగవచ్చని న్యాయవాద
వర్గాలు పేర్కొంటున్నాయి.
0 comments:
Post a Comment