హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మపై ఆర్థిక శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మంగళవారం తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో మంత్రుల భేటీ అనంతరం ఆనం మీడియాతో మాట్లాడారు. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో తన తనయుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి దోపిడీని విజయమ్మ ప్రోత్సహించారని, విజయమ్మ ప్రోత్సాహంతో జగన్ దోపిడీ చేయడం వల్లనే ఇప్పుడు బలహీనవర్గాల నేతలు బలవుతున్నారని ఆనం మండిపడ్డారు.
ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీతో కలిసి వైయస్సార్ కాంగ్రెసు తమ పార్టీని లక్ష్యంగా చేసుకుందని, ఆ రెండు పార్టీలు కలిసి కాంగ్రెసును అధికారం నుండి దింపడమే లక్ష్యంగా పెట్టుకున్నాయన్నారు. అవిశ్వాస తీర్మానం సమయంలోనే అది బయటపడిందన్నారు. పార్టీ మనుగడ కోసమే విజయమ్మ బిసి జపం చేస్తున్నారని విమర్శించారు. జగన్ దోపిడీకి విజయమ్మ ఎందుకు అడ్డుకట్ట వేయలేక పోయారని ప్రశ్నించారు. జగన్ చేసిన దోపిడీకి మంత్రులు జైళ్లకు వెళుతుంటే ఆమె ఏం చేస్తున్నారన్నారు.
బిసిలకు జగన్ పార్టీ వంద సీట్లను ప్రకటించడం వెనుక ఆ వర్గాల కోపం నుండి తప్పించుకోవడానికే అన్నారు. జగన్ దోపిడీ వల్ల బలహీనవర్గాలు తీవ్రంగా నష్టపోయారని, ఇప్పుడు అదే వర్గం మంత్రులు బలవుతున్నారన్నారు. విజయమ్మ అప్పుడు జగన్‌ను ప్రోత్సహించినందు వల్లే ఇప్పుడు మంత్రులు నిందితులుగా ముద్రపడుతున్నారన్నారు. జైలుకెళ్తున్న మంత్రులు, అధికారుల కోసం విజయమ్మ కనీసం ఒక్క కన్నీటి చుక్క కూడా కార్చలేదని, వంద సీట్ల పేరుతో బలహీనవర్గాల వారిని మరోసారి మోసం చేసేందుకు ఆమె ప్రయత్నిస్తున్నారన్నారు. విజయమ్మది రాజకీయ దిగజారుడుతనమని, బిసిలపై మొసలి కన్నీరు కారుస్తున్నారన్నారు.
మంత్రులతో పాటు అధికారుల పైనా సిబిఐ విచారణ జరుపుతోందన్నారు. ఈ కేసులో ఇరుక్కున్న మంత్రులకు అండగా ఉంటామని, సున్నిత అంశం కాబట్టి న్యాయసలహాలు తీసుకొని ముందుకు వెళతామని చెప్పారు. ముఖ్యమంత్రితో 22 మంది మంత్రులం భేటీ అయ్యామని, మంత్రులపై ఆరోపణలు, సిబిఐ అభియోగాలు తదితర అంశాలపై చర్చించామని చెప్పారు. కేబినెట్ నిర్ణయాలపై న్యాయసలహాలు తీసుకోవాలని నిర్ణయించామన్నారు.
మంత్రులపై ఆరోపణల గురించి కాంగ్రెసు ఒక విధానం పాటిస్తుందని, మోపిదేవి, ధర్మానల విషయమై సమష్టిగా అందరం కలిసి వెళ్తామని, ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకు వెళ్తానని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని, ఈ విషయంలో కిరణ్, పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ చొరవ చూపాల్సిన అవసరముందన్నారు. పార్టీ మనుగడను కాపాడటం కోసం అధిష్టానంతో చర్చించాలని కోరామని, మంత్రుల రాజీనామాపై ఇప్పుడే స్పందించనని చెప్పారు.
0 comments:
Post a Comment