హైదరాబాద్ : శేఖర్ కమ్ముల తాజా చిత్రం 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్'. ఎంతో క్రేజ్ తెచ్చుకున్న ఈ చిత్రం కథకు స్ఫూర్తినిచ్చిన విషయం గురించి చెప్తూ...'హ్యాపీడేస్'తో నాలుగు జంటల కళాశాల జీవితాల్ని చూపించాను. మరి ఇళ్ల దగ్గర అలాంటి అందమైన జీవితం ఉంటే ఎలా ఉంటుందని ఆలోచించినప్పుడు స్ఫురించిన కథే ఇది. కాలనీలోని ఇరుగుపొరుగుతో కష్టసుఖాల్ని పంచుకొనే పెద్దలు.. అంతా కలిసి చేసుకొనే పండగలు, మరోపక్క పిల్లల గోలీలాట, కాగితపు పడవలు, గల్లీ క్రికెట్టు... ఇలాంటివన్నీ రుచి చూస్తే ఎవరి జీవితమైనా అందంగా మారిపోతుందని చెబుతున్నాం. ఆశలు, ఆకాంక్షలు, రొమాన్స్, భావుకత, గందరగోళం, లక్ష్యాలు.. ఇవన్నీ కలగలిసిన చిత్రమిది.
అలాగే ఇప్పుడు గల్లీల్లో గోలీలాటలు, కాగితపు పడవ ల్లేవు. ఇరుగుపొరుగు మధ్య అనుబంధాలు తగ్గిపోయిన రోజులివి..అలాంటివి ఉంటే బాగుంటుందనే కోరిక, తాపత్రయంతో తీసిన సినిమా ఇది. నేను అమ్మమ్మ దగ్గర పెరిగాను. నా చదువులు మావయ్య ఇంట్లో సాగాయి... అని చెప్పుకొనేవాళ్లను మనం చాలామందినే చూసుంటాం. కానీ ఇప్పుడు అలా అమ్మమ్మ, తాతయ్యల పెంపకంలో పెరిగేవాళ్లు కూడా తక్కువే. ఆ నేపథ్యంతోపాటు- చెరువు, ఆ గట్టు మీద చెట్టు, వాన, గాలి, ఎండ... వీటన్నింటినీ కలగలిపి తెరపైకి తీసుకొస్తున్నాం. ఒక అందమైన ప్రపంచంలో సాగే కథ ఇది అన్నారు.
కొత్త వాళ్లతోనే చేయటానికి కారణం...నేను రాసుకొనే కథలు అలా ఉంటాయి. కథకు కావాలనుకొన్నప్పుడే కొత్తవాళ్లను ఎంపిక చేసుకొంటాను. పాత్రలకు తగ్గట్టుగా నటీనటులు తొందరగా దొరికితే అంతా బాగానే ఉంటుంది. లేకపోతే మాత్రం ఇబ్బందే. ఈ సినిమాలోని నటీనటుల ఎంపిక ప్రక్రియ చాలా సమయం తీసుకొంది. అందుకే సినిమా ఇంత ఆలస్యమైంది అన్నారు. ఇక పూర్తిస్థాయి మాస్ మసాలా సినిమాలు తియ్యడం నాకు రాదు. అందుకే అటు వైపు ఆలోచించను. అయితే... నాలా సున్నితమైన కథాంశాల్ని తెరకెక్కించే దర్శకులు కూడా కొద్దిమంది ఉండాలంటాను. ఒకప్పటి సమాజంలో ఇప్పటిలా అరాచకాలు ఉండేవి కాదు. కేవలం తెరపైన కనిపించే ప్రతినాయకుల పాత్రలతోనే అలాంటివి చూసేవాళ్లం. సినిమాల్లోనే అలాంటివాళ్లుంటారని చెప్పుకొనేవారు. కానీ ఇప్పుడు మాత్రం ఎక్కడ చూసినా నీచాతినీచాలు, దిగజారుడుతనాలు కనిపిస్తున్నాయి. ఇక సినిమాల్లో కూడా ఆ తరహా కథలు అనసవరం అనేది నా అభిప్రాయం అన్నారు.
0 comments:
Post a Comment