హైదరాబాద్:
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడితో
రాజ్యసభ సభ్యుడు, ఆయన బావమరిది హరికృష్ణకు,
సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్కు వైరం ముదిరిందా
అనే చర్చ ఇప్పుడు రాజకీయ
వర్గాల్లో జోరుగా జరుగుతోంది. ఇటీవల తెలుగుదేశం పార్టీలో
పరిణామాలు చూస్తుంటే వారి మధ్య విభేదాలు
తారాస్థాయికి చేరుకున్నాయని అంటున్నారు. కొంతకాలం క్రితం హరికృష్ణ న్యూఢిల్లీలో టిడిపి వైఫల్యం నాయకుల తప్పే అంటూ సంచలన
వ్యాఖ్యలు చేశారు.
హరి చేసిన వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో
తీవ్రమైన చర్చకు తెరలేపినప్పటికీ టిడిపిలో మరింత సంచలనం రేపాయి.
ఆయన పలుమార్లు చంద్రబాబుపై తన అసంతృప్తిని బయటకు
వెళ్లగక్కుతూనే ఉన్నారు. టిడిపి కార్యాలయం ముందు బైఠాయించినా, నాయకుల
వైఫల్యమంటూ చెప్పినా ఆయనకే చెల్లు. ఆయన
ఇదంతా తన తనయుడు జూనియర్
ఎన్టీఆర్ కోసం చేస్తున్నారు.
అయితే
ఇటీవలి కాలంలో జూనియర్ ఎన్టీఆర్ కూడా రంగంలోకి దిగారా
అనే అనుమానాలను పలువురు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆయన నేరుగా
రంగంలోకి దిగకుండా తన వర్గానికి చెందిన
నేతల ద్వారా పని చేసుకు పోతున్నారని
అంటున్నారు. నాలుగు రోజుల క్రితం కృష్ణా
జిల్లా విజయవాడకు చెందిన వల్లభనేని వంశీ వైయస్సార్ కాంగ్రెసు
పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు
వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలవడం దుమారం రేపింది.
అయితే
దాని వెనుక జూనియర్ ఉన్నాడనే
ప్రచారం జరిగింది. అంతేకాదు ఆ ఘటన తర్వాత
రాజకీయ రాజధాని విజయవాడలో నందమూరి అభిమానులు పెద్ద ఎత్తున జూనియర్
ఎన్టీఆర్ దమ్ముకు వ్యతిరేకంగా మెసేజ్లు పంపినట్లుగా వార్తలు
వచ్చాయి. నందమూరి హీరో కేవలం బాలకృష్ణనే
అని, దమ్ము చిత్రం చూడవద్దంటూ
మెసేజ్లు వచ్చాయట. ఈ
పరిణామాలు చూస్తుంటే వారి మధ్య వైరం
క్రమంగా పెరుగుతోందనే వాదనలు వినిపిస్తున్నాయి.
చంద్రబాబు
ఈ పరిణామాలపై ఏమీ మాట్లాడటం లేదు.
హరికృష్ణ తన అసంతృప్తిని బహిరంగంగానే
ప్రదర్శిస్తున్నారు. ఇక జూనియర్ ఎన్టీఆర్
తన వ్యక్తుల ద్వారా చక్కబెట్టుకు పోతున్నారని అంటున్నారు. టిడిపిని కుటుంబ సభ్యులు అలజడికి గురి చేసినప్పుడల్లా బాలకృష్ణ
తన రాజకీయ రంగ ప్రవేశంపై మాట్లాడి
ఉత్సాహం నింపుతున్నారు. అయితే మొత్తానికి బాబు
సైలెన్స్, హరి అసంతృప్తి, జూ.ఎన్టీఆర్ పేరు తెరపైకి వచ్చినప్పుడు
బాలయ్య రావడం చూస్తుంటే విభేదాలు
ముదిరాయనే అనిపిస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
0 comments:
Post a Comment