అనంతపురం/ఏలూరు: ఉప ఎన్నికల అనంతరం
కాంగ్రెసు పార్టీని మరింత పటిష్టం చేస్తామని
ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా
శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మంగళవారం
అనంతపురం జిల్లాలో విలేకరులతో అన్నారు. ప్రచారంలో భాగంగా ఆయన అనంతపురం జిల్లాకు
వచ్చారు. ఈ సందర్భంగా ఆయన
మాట్లాడారు. ప్రస్తుతం జరుగుతున్న ఉప ఎన్నికలు కాంగ్రెసు
పార్టీకి, ప్రభుత్వానికి రిఫరెండం కాదని చెప్పారు.
కాంగ్రెసు
పార్టీ అన్ని నియోజకవర్గాలలో మంచి
ఫలితాలను సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మెరుగైన ఫలితాలు సాధించేందుకు కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు కృషి చేస్తున్నారని చెప్పారు.
ఉప ఎన్నికల అనంతరం పార్టీని మరింత బలోపేతం చేస్తామన్నారు.
దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి
ప్రవేశ పెట్టిన ఏ ఒక్క పథకం
కూడా ఆగిపోలేదని బొత్స స్పష్టం చేశారు.
కిందిస్థాయి కార్యకర్తలను ఉత్తేజపరుస్తామని చెప్పారు.
వైయస్సార్
కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు
వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి
ప్రభుత్వంపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని
ఆయన మండిపడ్డారు. ఏ పథకం ఆగిపోయిందో
జగన్ చెప్పాలని, అలా చెబితే తాను
తలదించుకుంటానని సవాల్ విసిరారు. ప్రస్తుతం
ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున
పలు కార్యక్రమాలు చేపట్టలేక పోతున్నట్లు చెప్పారు. ఉప ఎన్నికల కారణంగా
ప్రజలకు సరైన సాయం అందించలేక
పోతున్నందుకు ఆవేదనగా ఉందన్నారు.
కరువు
సమయంలో ఉప ఎన్నికలు రావడం
బాధాకరంగా ఉందన్నారు. మంత్రులు, పార్టీలోని నేతల మధ్య ఎలాంటి
విభేదాలు లేవన్నారు. అందరూ సఖ్యతతో పార్టీ
అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తున్నారని
చెప్పారు. కాగా పశ్చిమ గోదావరి
జిల్లాలోని నరసాపురంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి
నియోజకవర్గ పార్టీ కార్యకర్తలతో భేటీ అయ్యారు. ఉప
ఎన్నికల వ్యూహంపై చర్చిస్తున్నారు.
డబ్బు,
మద్యం మాటలకు ప్రస్తుతం ఓటర్లు లొంగడం లేదని కిరణ్ సమావేశంలో
అన్నారు. కొత్తపల్లి సుబ్బారాయుడికి అన్ని పార్టీలతో సంబంధాలు
ఉన్నాయని ఆయన చెప్పారు. పార్టీ
అభ్యర్థి గెలుపు కోసం అందరూ కృషి
చేయాలని ఆయన కార్యకర్తలకు సూచించారు.
0 comments:
Post a Comment