తెలుగుదేశం
పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి
తనయుడు నారా లోకేష్ రాజకీయ
ప్రవేశానికి కార్యక్రమం సిద్ధమైనట్లు తెలుస్తోంది. నేరుగా తెలుగుదేశం పార్టీ వ్యవహారాల్లోకి తేకుండా మరో మార్గంలో లోకేష్ను ముందుకు తేవాలని
చంద్రబాబు నాయుడు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ, హీరో జూనియర్ ఎన్టీఆర్
నారా లోకేష్కు పార్టీ వ్యవహారాలు
అప్పగించడాన్ని వ్యతిరేకిస్తుండడంతో మరో మార్గం ద్వారా
ముందుకు తేవాలని ఆయన అనుకుంటున్నట్లు తెలుస్తోంది.
రాష్ట్రాన్ని
కాపాడుదాం అనే పేరుతో నారా
లోకేష్ ఓ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు
తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ప్రణాళిక సిద్ధమైనట్లు కూడా సమాచారం. రాష్ట్రాన్ని
కాపాడుదాం అంటూ నారా లోకేష్
రాష్ట్రవ్యాప్తంగా పర్యటించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అలా రాష్ట్ర పర్యటన
చేస్తే లోకేష్కు ప్రజల నుంచి
లభించే ఆదరణ తెలిసి వస్తుందని,
ప్రజలు ఆయనను ఎలా ఆదరిస్తారనే
విషయం బయటపడుతుందని, నందమూరి హీరోలు వ్యతిరేకించడానికి వీలు కాదని చంద్రబాబు
భావిస్తున్నట్లు చెబుతున్నారు.
నిజానికి,
నారా లోకేష్ ఇప్పటికే పార్టీ వ్యవహారాల్లో తెర వెనక పనులన్నీ
చేస్తున్నట్లు సమాచారం. 2009 ఎన్నికల సందర్భంలో నగదు బదిలీ పథకానికి
రూపకల్పన చేసింది ఆయనే అని చెబుతారు.
అయితే, ఆ పథకాన్ని ప్రజల్లోకి
తీసుకుని వెళ్లడంలో జాప్యం జరిగిందని, కాస్తా ముందుగా ఆ పథకాన్ని ప్రజల్లోకి
తీసుకుని వెళ్లి వాళ్లకు అర్థమయ్యేలా చేస్తే ఫలితాలు తమ పార్టీకి మెరుగ్గా
ఉండేవని నారా లోకేష్ ఎంట్రీని
కోరుతున్న తెలుగుదేశం నాయకులు అంటున్నారు.
కాగా,
ఇటీవలి ఉప ఎన్నికల సమయంలో
కూడా నారా లోకేష్ కీలకమైన
బాధ్యతలే నిర్వహించారని అంటారు. చంద్రబాబు నాయుడు నియోజకవర్గాల్లో పర్యటిస్తుంటే క్షేత్ర స్థాయి నుంచి నివేదికలు తెప్పించుకుని,
వాటిని విశ్లేషించి, స్థానిక నాయకులకు తగిన సూచనలు చేయడంలో
నారా లోకేష్ కీలక పాత్ర పోషించారని,
స్థానిక నాయకులతో నేరుగా ఆయన మాట్లాడుతూ మార్గదర్శకత్వం
చేశారని అంటున్నారు.
తెలుగుదేశం
పార్టీలో ఓ వర్గం నారా
లోకేష్ తెలుగుదేశం పార్టీలో కీలక భూమిక పోషించాలని
కోరుకుంటోంది. ఇదే విషయాన్ని చంద్రబాబుతో
వారు చెబుతున్నారు. ఇదే సమయంలో జూనియర్
ఎన్టీఆర్ని కూడా తీసుకుని
వస్తే మంచిదని మరో వర్గం ఉంటుంది.
నారా లోకేష్తో పాటు జూనియర్
ఎన్టీఆర్ పార్టీలో కీలక పాత్ర పోషించే
విధంగా ఏర్పాటు చేయాలని తెలుగుదేశం పార్టీలో మెజారిటీ నాయకులు కోరుకుంటున్నారు.
0 comments:
Post a Comment