న్యూఢిల్లీ:
తెలంగాణపై తమ పార్టీ అధిష్టానం,
కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా
తనకు అంగీకారమేనని పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు.
పిసిసి అధ్యక్షుడిగా తనకు వ్యక్తిగత అభిప్రాయం
ఉండదని, పార్టీ అభిప్రాయమే తన అభిప్రాయమని ఆయన
గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. పార్టీ అధిష్టానం, కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను అమలు చేయడమే తన
బాధ్యత అని ఆయన అన్నారు.
తెలంగాణ, సమైక్యవాద అంశాలు చాలా సున్నితమైనవని, ఈ
విషయాలపై తమ పార్టీ నాయకులు
ఎవరూ మాట్లాడకూడదని కోరుతున్నానని ఆయన అన్నారు.
తెలంగాణ
అంశాన్ని త్వరలో పరిష్కరించాలనే కృతనిశ్చయంతో తాము ఉన్నట్లు ఆయన
తెలిపారు. తెలంగాణకు కేంద్రం, అధిష్టానం అవునన్నా తనకు సరే, లేదన్నా
తనకు సరేనని ఆయన అన్నారు. తెలంగాణ
రాజకీయపరమైన, సున్నితమైన అంశమని, సున్నితంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని ఆయన అన్నారు. రాజకీయ
ప్రయోజనాల కోసం తెలంగాణ అంశాన్ని
వాడుకోకూడదని ఆయన సూచించారు. తెలంగాణ
సమస్య జాతీయ స్థాయిలోనే పరిష్కారమవుతుందని
ఆయన చెప్పారు.
తెలంగాణపై
అధిష్టానం అడిగినప్పుడు తన అభిప్రాయాన్ని చెబుతానని
ఆయన అన్నారు. స్థిరమైన అభిప్రాయంతో, సుహృద్భావ వాతావరణంలో సమస్య పరిష్కారం కావాల్సి
ఉంటుందని ఆనయ అన్నారు. నాయకత్వ
మార్పునకు తెలంగాణకు ముడిపెట్టవద్దని ఆయన సూచించారు. పార్టీలో
సమన్వయలోపం లేదని ఆయన అన్నారు.
పార్టీకి, ప్రభుత్వానికి మధ్య సమన్వయ కోసం
కృషి చేస్తామని ఆయన చెప్పారు. నామినేటెడ్
పదవులను త్వరలో భర్తీ చేయాలని కోరుకుంటున్నట్లు
ఆయన తెలిపారు. యుపిఎ రాష్ట్రపతి అభ్యర్థి
జులై 1వ తేదీన హైదరాబాద్
వస్తారని ఆయన చెప్పారు.
ఒక సమయంలో ఆయన మీడియా ప్రతినిధులపై
మండిపడ్డారు. అవునంటే కాదని, కాదంటే అవునని మార్చవద్దని ఆయన చిరాకు పడ్డారు.
"మీ అభిప్రాయాన్ని మా మీద రుద్దవద్దని,
అవుంటే కాదన్నారనీ కాదంటే అవున్నానరనీ.. ఇదేమిటి" అని ఆయన మండిపడ్డారు.
నాయకత్వ మార్పుతో తెలంగాణ సమస్య పరిష్కారమవుతుందా అని
అడిగితే వ్యక్తులు మారినంత మాత్రాన ఓ ప్రాంత మనోభావాలు
మారవని ఆయన అన్నారు. రాష్ట్రంలో
సంపూర్ణ మద్యనిషేధం మంచిదని తన అభిప్రాయమని, ఇందుకు
రాజకీయ పార్టీల నాయకులతో మాట్లాడుతానని ఆయన అన్నారు.
0 comments:
Post a Comment