హైదరాబాద్:
తెలుగుదేశం పార్టీ ఈ ఏడాది జరగవలసిన
మహానాడును రద్దు చేస్తున్నట్లు మంగళవారం
ప్రకటించింది. ఈ ఏడాది రద్దు
చేసి వచ్చేసంవత్సరం మేలోనే దీనిని నిర్వహించాలని తమ పార్టీ నిర్ణయించిందని
ఆ పార్టీ నేతలు ప్రకటించారు. పార్టీ
అధినేత నారా చంద్రబాబు నాయుడు
పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో పార్టీ నిర్మాణంపై చర్చించారు. ఈ నెల 20వ
తేది నుండి 30వ తేది వరకు
గ్రామ, వార్డు కమిటీ ఎన్నికలు జరపాలని,
ఆగస్టు 5 నుండి 20 వరకు మండల పార్టీ,
అనుబంధ కమిటీల ఎన్నికలు జరపాలని నిర్ణయించింది. ఆగస్టు 20 నుండి 30 వరకు జిల్లా పార్టీ,
అనుబంధ కమిటీ ఎన్నికలు నిర్వహించనున్నారు.
కాగా
చంద్రబాబు కృష్ణా జిల్లా నేతలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. జిల్లా
రాజకీయ పరిణామాలపై చర్చించారు. జిల్లాకు చెందిన గుడివాడ శాసనసభ్యుడు కొడాలి నాని వైయస్సార్ కాంగ్రెసు
పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు
వైయస్ జగన్మోహన్ రెడ్డికి జైకొట్టడంతో బాబు ఆ జిల్లాపై
ప్రత్యేక దృష్టి సారించారు. నాని రాజీనామా చేసి
ఉప ఎన్నికలు వచ్చినా అందుకు సిద్ధంగా ఉండాలని బాబు వారికి సూచించినట్లుగా
తెలుస్తోంది.
ఇప్పుడు
మహానాడు తదితర కార్యక్రమాల కంటే
పార్టీ పటిష్టతపై దృష్టి సారించడమే మంచిదని బాబు భావించినట్లుగా కనిపిస్తోందని
అంటున్నారు. అందుకే మహానాడును వాయిదా వేశారని చెబుతున్నారు. మహానాడును గత మే నెలాఖర్లో
నిర్వహించాల్సి ఉంది. అయితే అప్పుడు
ఉప ఎన్నికలు వచ్చాయి. ఉప ఎన్నికల నేపథ్యంలో
మహానాడు నిర్వహించాలా వద్దా అని తీవ్ర
తర్జన భర్జన అనంతరం దానిని
ఉప ఎన్నికల తర్వాతకు వాయిదా వేశారు.
ఉప ఎన్నికల అనంతరం మహానాడు నిర్వహణపై పలుమార్లు చర్చకు వచ్చింది. అయితే కొడాలి నాని
వ్యవహారం, పార్టీ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా మహానాడును రద్దు చేశారని అంటున్నారు.
2014 సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. అంతకుముందు 2013లో వచ్చే మహానాడును
భారీ ఎత్తున నిర్వహిస్తే బాగుంటుందని తెలుగు తమ్ముళ్లు భావిస్తున్నారు.
0 comments:
Post a Comment