హైదరాబాద్:
గాలి జనార్దన్ రెడ్డికి పట్టాభి రామారావు బెయిల్ మంజూరు చేసిన కుంభకోణం కేసులో
నిందితుడు యాదగిరిని అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) అధికారులు
ఎలా పట్టుకున్నారనేది ఆసక్తికరంగా మారింది. అతన్ని పోలీసులు కర్నూలులో అదుపులోకి తీసుకున్నారు. ఓ మహిళ ఇచ్చిన
సమాచారంతో ఎసిబి అధికారులు పట్టుకున్నట్లు
తెలుస్తోంది. తన న్యాయవాది శరత్
కుమార్‌కు తాను పది
లక్షల రూపాయలు ఇచ్చినట్లు యాదగిరి ఎసిబి అధికారులకు చెప్పాడు.
ఎసిబి నేరాంగీకార పత్రంలో యాదగిరి పలు విషయాలు వెల్లడించాడు.
తన న్యాయవాది శరత్ కుమార్ సలహా
మేరకే తాను పారిపోయినట్లు అతను
చెప్పాడు. తను పరారీలో ఉన్న
సమయంలో ముంబై, మధురై, బెంగళూర్, మైసూరు, చెన్నై, కాంచీపురం, తిరుపతి, కన్యాకుమారి తదితర ప్రాంతాల్లో తిరిగినట్లు
అతను చెప్పాడు. నగరాలు, పుణ్యక్షేత్రాలు తిరిగానని చెప్పాడు. న్యాయవాది ఆదిత్య తనకు గాలి జనార్దన్
రెడ్డి సోదరుడు సోమశేఖర రెడ్డిని, బంధువు దశరథరామి రెడ్డిని పరిచయం చేశారని, బెయిల్ కోసం రిటైర్డ్ న్యాయమూర్తి
చలపతి రావు ద్వారా పట్టాభి
రామారావును మేనేజ్ చేశామని అతను వివరించాడు.
గాలి
జనార్దన్ రెడ్డి బెయిల్ డీల్‌ను కుదిరించింది
తానేనని అతను చెప్పాడు. న్యాయవాది
ఆదిత్యకు కోటి రూపాయలు ఇచ్చినట్లు
తెలిపాడు. మొత్తం డీల్ 20 కోట్ల రూపాయలని అతను
చెప్పాడు. ఇందులో చలపతి రావుకు ఐదు
కోట్ల రూపాయలు, పట్టాభి రామరావుకు, ఐదు కోట్ల రూపాయలు,
తనకు ఐదు కోట్ల రూపాయలని
అతను చెప్పాడు. గాలి జనార్దన్ రెడ్డి
బెయిల్ డీల్‌కు సంబంధించి
తనకు అందాల్సిన వాటాలో సగం 2.5 కోట్ల రూపాయలు ముట్టాయని
అతను చెప్పాడు. దాంట్లోంచి ఆరున్నర లక్షల రూపాయలతో నగలను
విడిపించుకున్నానని, రూ. 8 లక్షలతో కారు
కొన్నానని అతను చెప్పాడు.
అనారోగ్యంతో
బాధపడుతున్న తన బంధువు వెంకటేష్‌కు 20 లక్షల రూపాయలు
ఇచ్చినట్లు అతను తెలిపాడు. ఫ్లాట్
కొనుగోలు కోసం నక్క సాయిబాబా
అనే వ్యక్తికి 36 లక్షల రూపాయలు ఇచ్చానని
చెప్పాడు. అయితే వ్యవహారం బయటపడిన
తర్వాత ఆ డబ్బును అతను
యాదగిరికి తిరిగి ఇచ్చేసినట్లు తెలుస్తోంది. రిటైర్డ్ న్యాయమూర్తికి 3 కోట్ల రూపాయలు అందించినట్లు
యాదగిరి తెలిపాడు. పోలీసు ఉన్నతాధికారి సర్వేశ్వర రెడ్డి తనకు ఎస్ఐగా ఉన్నప్పటి
నుంచే పరిచయమని అతను చెప్పాడు. సర్వేశ్వ
రెడ్డి తనకు బెయిల్ ఇచ్చినందుకు
పట్టాభిరామారావుకు పది లక్షల రూపాయలు
ముట్టజెప్పినట్లు అతను తెలిపాడు. పోలీసు
అధికారుల సహకారంతో తాను రియల్ ఎస్టేట్
వ్యాపారాన్ని పెంచుకున్నట్లు తెలిపాడు.
విచారణ
నిమిత్తం కోర్టు యాదగిరిని ఐదు రోజుల పాటు
ఎసిబి కస్టడీకి అప్పగించింది. రెండు రోజుల పాటు
యాదగిరిని ఎసిబి అధికారులు ప్రశ్నించారు.
ఈ విచారణలో యాదగిరి పలు విషయాలు వెల్లడించినట్లు
తెలుస్తోంది. మరో మూడు రోజుల
పాటు యాదగిరిని ఎసిబి అధికారులు విచారించనున్నారు.
0 comments:
Post a Comment