హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని ఉద్దేశించి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు దద్దమ్మ అంటూ చేసిన వ్యాఖ్యలకు తాను కలత చెందానని, మరోసారి కిరణ్ను కించపర్చేలా మాట్లాడితే నడి రోడ్డుపై బాబు పీక పట్టుకుంటానని కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి పాలడుగు వెంకట్రావు మంగళవారం ధ్వజమెత్తారు. సిఎల్పీ కార్యాలయంలో విలేఖరులతో మాట్లాడారు.
ఇంతకాలం కాంగ్రెస్ పార్టీ పట్ల బాబు చేస్తున్న విమర్శలను తాను పట్టించుకోకుండా వదిలేశానని.. కానీ, ఇటీవల ఆయన హద్దులు మీరి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీ నేతను ఉద్దేశించి మరోసారి ఈ విధమైన మాటలు మాట్లాడితే సహించేది లేదని.. నడి వీధిలోనే పీకపట్టుకుంటానని హెచ్చరించారు. రాష్ట్రంలో చేనేత కార్మికులకు నష్టం చేసే విధంగా స్పిన్నింగ్ మిల్లులను అమ్మివేసిందెవరని, అతి తక్కువ ధరలకే చక్కెర ఫ్యాక్టరీలను ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేసిందెవరని బాబును ప్రశ్నించారు.
దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో తప్పులకు తాను క్షమాపణ కోరేందుకు సిద్ధంగా ఉన్నానని.. కానీ, బాబు వల్ల జరిగిన నష్టంపై ఆయనేం మాట్లాడతారని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ కేంద్రంలో కీలక బాధ్యతలు తీసుకునేలా ఒత్తిడి చేసేందుకు వీలుగా భావసారూప్యత కలిగిన వారితో సిఎల్పీలో గాని, తన నివాసంలోగాని ప్రత్యేక సమావేశాన్ని త్వరలోనే ఏర్పాటు చేస్తానని చెప్పారు.
కాంగ్రెస్ సీనియర్ నేత పాలడుగు వెంకట్రావు చేసిన వ్యాఖ్యలపై తెలుగు మహిళా అధ్యక్షురాలు శోభా హైమావతి మండిపడ్డారు. ఆయనకు పిచ్చి కుక్క కరిచి ఉంటుందని విమర్శించారు. ముఖ్యమంత్రిపై మాట్లాడితే చంద్రబాబు పీక పట్టుకుంటానన్న పాలడుగు వ్యాఖ్యపై ఈ మేరకు స్పందించారు. పిచ్చికుక్క కరిచినప్పుడు మతి భ్రమించి ఏదేదో మాట్లాడుతుంటారన్నారు.
అవే లక్షణాలు ఆయనలో కనిపిస్తున్నాయని, తక్షణం ఆయనను ఎర్రగడ్డ ఆస్పత్రిలో చేర్పించాలన్నారు. వైయస్ జగన్కు కోవర్టులా పని చేస్తున్నాడని కిరణ్ను సొంత పార్టీవారే తిడుతుంటే వారిని అనడం చేతగాక బాబుపై విమర్శలెందుకన్నారు. ఆయన తన నోరు అదుపులో పెట్టుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.
0 comments:
Post a Comment