హైదరాబాద్:
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం కేంద్రానికి లేఖ
రాసే వారు ప్రత్యేక రాయలసీమ
కోసం కూడా లేఖ రాయాలని
తెలుగుదేశం పార్టీ నేత బైరెడ్డి రాజశేఖర
రెడ్డి బుధవారం అన్నారు. ఆయన హైదరాబాదులో విలేకరుల
సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన..
రాయలసీమ హక్కుల పరిరక్షణ కోసం తాను ఈ
నెల 4వ తేది నుండి
కర్నూలులో దీక్ష చేస్తానని ప్రకటించారు.
రాష్ట్రం
ఒక్కటిగా ఉంటే ఎలాంటి పేచీ
లేదని విడిపోయే పరిస్థితి ఉంటే మాత్రం అన్ని
పార్టీలు రాయలసీమపై తమ వైఖరి తెలియజేయాలని
ఆయన డిమాండ్ చేశారు. ఉంటే సమైక్యంగా ఉండాలి
లేదంటే మూడుగా విడిపోవాల్సిందేనన్నారు. ఈ విధంగా తెలుగుదేశం,
వైయస్సార్ కాంగ్రెసు సహా అన్ని రాజకీయ
పార్టీలు కేంద్రానికి లేఖ రాయాలన్నారు. తెలంగాణ
అనే వారు సీమ పైన
తమ స్టాండ్ తప్పనిసరిగా చెప్పాల్సిందే అన్నారు.
రాయలసీమవాసులు
మరోసారి మోసపోవడానికి సిద్ధంగా లేరన్నారు. రాష్ట్రం విడిపోయిన పక్షంలో ప్రత్యేక రాష్ట్రంగా రాయలసీమ ఏర్పడాలనేది సీమవాసుల డిమాండ్ అని, అది ఎప్పటి
నుండో ఉందన్నారు. తాను ప్రత్యేక రాయలసీమ
నినాదం ఎత్తుకున్నది తెలంగాణను అడ్డుకోవడానికి కాదన్నారు. తెలంగాణ కోరుకునే తెరాస కూడా ప్రత్యేక
సీమ గురించి లేఖ రాయాలని సూచించారు.
తాను కేవలం సీమ పరిరక్షణ
కోసమే ఉద్యమిస్తున్నాను తప్ప దేనినో అడ్డుకోవడానికి,
రాజకీయ ప్రయోజనాలు ఆశించో కాదన్నారు.
రాయలసీమ
ఉనికికే ప్రమాదం తెచ్చే విధంగా నిర్ణయం చేయడానికి పావులు కదుపుతున్నారని అందుకే తన ఆందోళన అన్నారు.
తమ ప్రాంతం ఇప్పటికే అన్ని విధాలా నష్టపోయి
దారిధ్ర్యం, కరువు కాటకాలతో అల్లాడుతోందని
ఆయన అన్నారు. సీమకు చెందిన నాలుగు
జిల్లాలను కలుపుకొంటూ నాలుగు రోజుల పాటు ఈ
నిరాహార దీక్ష చేయనున్నట్లు చెప్పారు.
కాగా
ప్రత్యేక తెలంగాణ కోసం లేఖ రాసే
అన్ని పార్టీలు ప్రత్యేక సీమ కోసం కూడా
రాయాలని బైరెడ్డి చెప్పడం ద్వారా టి-టిడిపి నేతల
నోట్లో పచ్చి వెలక్కాయ పడినట్లే
అంటున్నారు. ఇటీవల వారు తమ
పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు
ప్రత్యేక తెలంగాణ కోసం కేంద్రానికి లేఖ
రాసేందుకు సుముఖత వ్యక్తం చేశారని చెప్పారు. ఇలాంటి సమయంలో బైరెడ్డి ప్రత్యేక తెలంగాణ కోసం లేఖ రాసేవారు
ప్రత్యేక సీమ కోసం కూడా
రాయాలని డిమాండ్ చేయడం గమనార్హం.
0 comments:
Post a Comment