హైదరాబాద్:
రాష్ట్రవ్యాప్తంగా వెలుస్తున్న దివంగత నేత వైయస్ రాజశేఖర
రెడ్డి విగ్రహాలకు తెలుగుదేశం పార్టీ బెంబేలేత్తుతోందా అనే అనుమానాలు కలుగుతున్నాయి.
ఇటీవల తెలుగుదేశం రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ చేసిన వ్యాఖ్యలు, గతంలో
ఆ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు
చేసిన వ్యాఖ్యలు ఆ అనుమానాలు కలగడానికి
కారణంగా చెప్పవచ్చు. వైయస్ విగ్రహాలను నెలకొల్పడాన్ని
తెలుగుదేశం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.
దుష్టులకు,
దుర్మార్గులకు విగ్రహాలను స్థాపిస్తున్నారని హరికృష్ణ ఇటీవల అన్నారు. వైయస్
విగ్రాహాల స్థాపనపైనే ఆయన మాట్లాడారనేది స్పష్టంగా
తెలిసిపోతూనే ఉన్నది. డాక్టర్ అంబేడ్కర్ విగ్రహాలను, ఎన్టీ రామరావు విగ్రహాలను
ధ్వంసం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం
చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పెద్ద యెత్తున ఎన్టీ
రామారావు విగ్రహాలు కూడా ఉన్నాయి. ఇందిరా
గాంధీ, రాజీవ్ గాంధీ విగ్రహాలను కూడా
చాలా వరకు నెలకొల్పారు.
తాజాగా,
వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలు వివిధ గ్రామాల్లో వెలుస్తున్నాయి.
వాటిని ఆవిష్కరిస్తూ, ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ బలం పెంచుకోవడానికి వైయస్సార్
కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ప్రయత్నిస్తున్నారు.
వైయస్ రాజశేఖర రెడ్డిని పేదల పాలిటి ఆప్తబంధువుగా,
రాజకీయాల్లో మహా నాయకుడిగా నిలబెట్టి
రాజకీయ ప్రయోజనం పొందాలనే ఉద్దేశం మాత్రమే కాకుండా వైయస్ రాజకీయ వారసత్వాన్ని
సొంతం చేసుకోవడానికి జగన్ ప్రయత్నిస్తున్నారు.
వైయస్
జగన్ రాజకీయాలను ఎదుర్కునే క్రమంలో తెలుగుదేశం పార్టీ వైయస్ పాలనపై కూడా
దుమ్మెత్తి పోస్తోంది. వైయస్ రాజశేఖర రెడ్డి
జీవించి ఉన్నప్పుడు కూడా తెలుగుదేశం తీవ్రంగానే
దండెత్తింది. రాజా ఆఫ్ కరప్షన్
పుస్తకం వేసి వైయస్ పాలనలోని
అవినీతిపై ప్రచారం సాగించింది. అయితే, వైయస్ వారసత్వానికి, వైయస్
అవినీతికి మధ్య తెలుగుదేశం, వైయస్సార్
కాంగ్రెసు పార్టీల మధ్య రాజకీయ వైరం
నడుస్తోంది. ఈ క్రమంలోనే వైయస్
విగ్రహాల స్థాపనను తెలుగుదేశం పార్టీ వ్యతిరేకిస్తోంది.
వైయస్పై వ్యతిరేక ప్రచారంతో
తెలుగుదేశం పార్టీ ప్రజలను తన వైపు ఆకట్టుకోవడానికి
ప్రయత్నిస్తుండగా, ఎన్టీఆర్ సరసన వైయస్ రాజశేఖర
రెడ్డిని నిలబెట్టడానికి జగన్ ప్రయత్నిస్తున్నారు. ఎన్టీఆర్ అమలు
చేసిన కార్యక్రమాలను తెలుగుదేశం పార్టీని సొంతం చేసుకుని అధికారం
చేపట్టిన చంద్రబాబు రద్దు చేయడమో, నీరు
గార్చడమో చేశారని జగన్ చెప్పదలుచుకున్నారు. వైయస్ వారసత్వం
ప్రజలకు మేలు చేసేది కాదని
తెలుగుదేశం పార్టీ ప్రయత్నిస్తుంటే, ఎన్టీఆర్ వారసత్వాన్ని టిడిపికి దక్కకుండా చేసే ప్రయత్నాలు వైయస్
జగన్ చేస్తున్నారు.
మరోవైపు,
కాంగ్రెసు పార్టీ అటూ ఇటూ కాకుండా
వ్యవహరిస్తోంది. వైయస్ రాజశేఖర రెడ్డిని
సొంతం చేసుకోవాలో, దూరం చేసుకోవాలో తెలియని
అయోమయ స్థితిలో పడిపోయింది. కొందరు నాయకులు వైయస్ పాలనను తీవ్రంగా
విమర్శిస్తుంటే, కొంత మంది నాయకులు
ప్రశంసలు కురిపిస్తున్నారు. ఏమైనా, రాజకీయ సమరం వైయస్ జగన్,
చంద్రబాబుకు మధ్యనే కాకుండా ఎన్టీఆర్కు, వైయస్కు
మధ్య జరుగుతోందని కూడా అనుకోవచ్చు.
0 comments:
Post a Comment