హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి బతికుండి అవినీతి ఆరోపణలు రుజువైతే జైలుకు వెళ్లి ఉండే వారేమోనని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శాసనసభ్యుడు ఆనం వివేకానంద రెడ్డి మంగళవారం అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పైన కాంగ్రెసు నేతలు వేర్వేరుగా విరుచుకు పడ్డారు.
తాము వైయస్కు వారసులం కాదని కాంగ్రెసు పార్టీ వారసులమని ఆనం చెప్పారు. కాంగ్రెసు పేరుతో జగన్ లక్షల కోట్లు దోచుకున్నారని మండిపడ్డారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెసు గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. జగన్ తీరు తల్లి పాలు తాగి రొమ్ము తన్నే విధంగా ఉందన్నారు. కాంగ్రెసును తిడుతుంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. అవినీతికి పాల్పడితే కాంగ్రెసు ప్రభుత్వం ఎంతటి వారలనైనా వదలదన్నారు. అవినీతిపరులు ఎవరైనా జైలుకు పంపిస్తుందన్నారు. ఇందుకు సురేష్ కల్మాడీ, కనిమొళి మంచి నిదర్శనమన్నారు.
వైయస్ పథకాలపై బొత్స
వైయస్ రాజశేఖర రెడ్డిపై ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కూడా మాటల దాడి పెంచినట్లుగా కనిపిస్తోంది. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ సూచనల మేరకే వైయస్ పథకాలు ప్రారంభించారని కడప జిల్లాలో అన్నారు. అభివృద్ధి, సంక్షేమంతో తాము ఉప ఎన్నికల ప్రచారం నిర్వహిస్తామని చెప్పారు. మహిళలకు, రైతులకు వడ్డీ లేని రుణాలు అందించిన ఘనత కాంగ్రెసుదే అన్నారు.
ఉప ఎన్నికలు ఓ వ్యక్తి స్వార్థం కోసం వస్తున్నాయని జగన్ను ఉద్దేశించి అన్నారు. ఆయన తన కోసం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని విమర్శించారు. అక్రమంగా సంపాదించిన కోట్ల రూపాయలతో అధికారం కోసం ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెసులో మహిళలకు పెద్ద పీట వేశామన్నారు.
చంద్రబాబుపై శైలజానాథ్ ధ్వజం
విద్యుత్ ఛార్జీలు తగ్గించమని ఆందోళన చేసిన వారిపై నిర్ధక్షిణ్యంగా కాల్పులు జరిపించిన ఘనత చంద్రబాబుది అని మంత్రి శైలజానాథ్ విమర్సించారు. కిరణ్, బాబులకు ఎలాంటి పోలిక లేదన్నారు. బాబు కాల్పులు జరిపిస్తే కిరణ్ ఛార్జీలు తగ్గించారన్నారు. నీతిలేని రాజకీయాలకు బాబు పాల్పడుతున్నారన్నారు. బాబుది నెగెటివ్ మైండ్ సెట్ అన్నారు. వైయస్ కాంగ్రెసు ముఖ్యమంత్రిగా చనిపోయారన్నారు. ఆయన అవినీతిపరుడు అవునో కాదో సిబిఐ విచారణలో తేలుతుందన్నారు.
బాబు తనలా అందరూ అక్రమార్జనకు పాల్పడుతున్నారనుకుంటే ఎలా అన్నారు. కుర్చీ కోసం స్వర్గీయ నందమూరి తారక రామారావును ఆయన గెంటి వేశారన్నారు. అది నీచ రాజకీయం కాదా అని ప్రశ్నించారు. అలిపిరిలో బ్లాస్ట్ను కూడా రాజకీయే చేసి ఓట్లుగా మలుచుకునే ప్రయత్నం చంద్రబాబు చేస్తున్నారని విమర్శించారు. చిత్తూరు డైరీనీ మూసివేయించిన ఘనత ఆయనదే అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలో నీతివంద పాలన అందించేందుకు కృషి చేస్తోందని మరో మంత్రి రఘువీరా రెడ్డి అన్నారు.
0 comments:
Post a Comment