హైదరాబాద్/న్యూఢిల్లీ: త్వరలో జరగనున్న ఉప ఎన్నికలలో వైయస్సార్
కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు
వైయస్ జగన్మోహన్ రెడ్డిని ధీటుగా ఎదుర్కొనేందుకు నేరుగా అధిష్టానమే రంగంలోకి దిగింది. జగన్ను పలు
నియోజకవర్గాలలో ఓడించేందుకు పార్టీ పెద్దలు ఐదంచెల వ్యూహాన్ని అమలుపరుస్తున్నారని అంటున్నారు. పద్దెనిమిది అసెంబ్లీ, ఒక పార్లమెంటు నియోజకవర్గంలో
ఉప ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.
అందులో
కనీసం ఐదు స్థానాలలోనైనా ఎట్టి
పరిస్థితుల్లో గెలుపొందాలని కాంగ్రెసు పెద్దలు గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. నర్సాపురం, రామచంద్రాపురం, పోలవరం, నరసన్నపేటతో పాటు ఇటీవల రాజ్యసభకు
వెళ్లిన చిరంజీవి రాజీనామాతో ఖాళీ అయిన తిరుపతి
స్థానాలను ఎలాగైనా కాంగ్రెసు ఖాతాలో పడేలా చేయాలని అధిష్టానం
ప్రయత్నాలు చేస్తోందని అంటున్నారు.
ఇందు
కోసం ఐదంచెల ప్లాన్ సిద్ధం చేసిందని అంటున్నారు. పైకి మంత్రులు, ముఖ్యమంత్రి
కిరణ్ కుమార్ రెడ్డి, ప్రదేశ్ కాంగ్రెసు అధ్యక్షుడు బొత్స సత్యనారాయణదే బాధ్యత
అని చెబుతున్నప్పటికీ అధిష్టానం ఏఐసిసి స్థాయి నేతలను రంగంలోకి దింపనుందని అంటున్నారు. మూడేసి నియోజకవర్గాలకు ఒకరిని ఇంచార్జిగా నియమించనున్నారని తెలుస్తోంది. వారు ఆయా నియోజకవర్గాలపై
ప్రత్యేక దృష్టి సారించనున్నారు.
దివంగత
ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి
మరణం తర్వాత జరిగిన పలు ఉప ఎన్నికలలో
కాంగ్రెసు పార్టీ ఒక్క సీటును కూడా
కైవసం చేసుకోలేక పోయింది. అదీ కాక దారుణంగా
ఓడిపోయింది. దీంతో 2014 ఎన్నికలలో కాంగ్రెసు మంచి ఫలితాలు సాధించాలంటే
రాష్ట్ర నేతలపై ఆధారపడకూడదని అధిష్టానం భావించి నేరుగా రంగంలోకి దిగిందని అంటున్నారు.
ఇప్పటికే
వాయలార్ రవి హైదరాబాద్ వచ్చి
నియోజకవర్గాల పర్యటనలకు వెళుతున్నారు. అక్కడ స్థానిక నాయకత్వాన్ని
ఆయన సమాయత్తం చేయనున్నారు. రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ గులాం నబీ ఆజాద్
ఢిల్లీలో ఉంటూనే రాష్ట్రంలోని పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారట. పరిస్థితిని బట్టి ఆయన వ్యూహాలు
రచిస్తున్నారట. ఢిల్లీ నుండే ఆయన జగన్ను చిత్తు చేసేందుకు
ఎత్తులు వేస్తున్నారట. సీమాంధ్రలో కాంగ్రెసు పార్టీని తీవ్రంగా నష్టపరిచిన జగన్ దూకుడును ఈ
ఎన్నికలలో ఎలాగైనా తగ్గించాలని చూస్తున్నారట.
కాగా
గోదావరి జిల్లాల్లో పర్యటిస్తున్న వాయలార్ రవి.. ఉప ఎన్నికలలో
కాంగ్రెసు గెలుపు ఖాయమని చెప్పారు. ఎన్ని సీట్లు వస్తాయో
చెప్పలేను కానీ కాంగ్రెసు అత్యధిక
స్థానాలను కైవసం చేసుకుంటుందని చెప్పారు.
0 comments:
Post a Comment