దివంగత
నేత వైయస్ రాజశేఖర రెడ్డి
వ్యక్తిగత సహాయకుడిగా పనిచేసిన సూరీడి వాంగ్మూలంతో కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచందర్ రావు కష్టాల్లో పడినట్లే
కనిపిస్తున్నారు. కెవిపి రామచందర్ రావును సిబిఐ మరోసారి విచారించే
అవకాశాలున్నాయని అంటున్నారు. ఇది వరకు ఆయనను
సిబిఐ అధికారులు ఎమ్మార్ ప్రాపర్టీస్ కుంభకోణం కేసులో విచారించారు.
ఇప్పుడు
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఆస్తుల
కేసులో విచారించడానికి సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. వైయస్ రాజశేఖర రెడ్డి
ప్రభుత్వ హయాంలో కెవిపి రామచందర్ రావు ప్రభుత్వానికి చెందిన
అన్ని వ్యవహారాల్లోనూ కీలక పాత్ర పోషించారని
అంటారు. ఒక రకంగా ఆలోచన
కెవిపిది కాగా, ఆచరణ వైయస్
రాజశేఖర రెడ్డిదని చెబుతారు.
సూరీడు
అలియాస్ ఎ సూర్యనారాయణ రెడ్డి
వాంగ్మూలాన్ని సిబిఐ అధికారులు ఎమ్మార్
ప్రాపర్టీస్ కుంభకోణం కేసులోనే కాకుండా వైయస్ జగన్ ఆస్తుల
కేసులో నమోదు చేసింది. ఈ
వాంగ్మూలం ఆధారంగా సిబిఐ కెవిపి రామచందర్
రావును ప్రశ్నించాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.
వైయస్
జగన్ సంస్థల్లోకి పెట్టుబడులు ప్రవహించిన తీరుపై సిబిఐ అధికారులు ఆయనను
ప్రశ్నిస్తారని అంటున్నారు. జగన్కు చెందిన
జననీ ఇన్ఫ్రా, జగతి
పబ్లికేషన్స్, ఇందిరా టెలివిజన్, కార్మెల్ ఆసియా, సండూరు పవర్ వంటి సంస్థల్లోకి
పెట్టుబడులు వచ్చిన తీరుపై సిబిఐ అధికారులు రామచందర్
రావు నుంచి సమాచారం రాబట్టదలుచుకున్నట్లు
తెలుస్తోంది. అయితే, ఈ కేసుల్లో ఆయనను
సాక్షిగానే విచారిస్తారని అంటున్నారు.
0 comments:
Post a Comment