హైదరాబాద్:
సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సిబిఐ)
విచారణ నేపథ్యంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు
వైయస్ జగన్మోహన్ రెడ్డి ఉప ఎన్నికలలో దెబ్బ
తింటారా అనే ప్రచారం రాజకీయ
వర్గాల్లో జోరుగా జరుగుతోంది. ఇటీవల జగన్ ఆస్తుల
విచారణలో సిబిఐ దూకుడు పెంచిన
విషయం తెలిసిందే. సిబిఐ ప్రత్యేక కోర్టు
ద్వారా జగన్కు సమన్లు
జారీ చేయించడం, సాక్షి మీడియా బ్యాంకు ఖాతాల స్తంభన, ఆస్తుల
అటాచ్మెంట్ ఇలా వరుసగా
సిబిఐ జగన్పై కొరడా
ఝులిపిస్తోంది.
కాంగ్రెసు
పార్టీని వీడిన తర్వాత జగన్కు సానుభూతి ఎక్కువగా
వచ్చింది, అందుకే ఆయన కడప, పులివెందుల
ఉప ఎన్నికలలో భారీ విజయం సాధించారని
అంటున్నారు. అయితే సిబిఐ విచారణ
నేపథ్యంలో ఆయనపై సానుభూతి క్రమంగా
తగ్గుతోందనే వాదన వినిపిస్తోంది. ఇందుకు
ఇటీవల శ్రీ పొట్టి శ్రీరాములు
నెల్లూరు జిల్లాలోని కొవూరు నియోజకవర్గంలో జరిగిన ఉప ఎన్నిక ఓ
నిదర్శనమని చెబుతున్నారు.
ఆ ఉప ఎన్నికలలో జగన్
పార్టీ అభ్యర్థి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఘన విజయం సాధించినప్పటికీ
అనుకున్నంత మెజార్టీ దక్కలేదు. దీంతో జగన్ పట్ల
ప్రజలలో సానుభూతి క్రమంగా తగ్గుతోందనే అభిప్రాయాలు అప్పుడే వెలువడ్డాయి. ఇటీవల జగన్ ఆస్తుల
కేసులో సిబిఐ దూకుడు కారణంగా
మరింత తగ్గిందనే అభిప్రాయాలు వెలువడుతున్నాయి.
జగన్
పార్టీ వీడినప్పుడు ఆయన చేసిన అక్రమాలు
తెలియవని, ఇప్పుడిప్పుడే ప్రజల్లోకి తన తండ్రి అధికారంలో
ఉన్నప్పుడు ఆయన చేసిన అవినీతి
గురించి వెళుతోందని తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీలు భావిస్తున్నాయి. ఇది ఆయన పట్ల
సానుభూతి తగ్గేందుకు కారణమవుతోందని భావిస్తున్నారు. ఈ ప్రభావం రానున్న
ఉప ఎన్నికలలోనూ పడుతుందని ఆ పార్టీలు భావిస్తున్నాయి.
2014 నాటికి ఆ సానుభూతి పూర్తిగా
తగ్గే అవకాశముందని అంటున్నారు.
వచ్చే
ఉప ఎన్నికలలో పద్దెనిమిది స్థానాలు జగన్ గెలుచుకుంటారని అందరూ
భావించారు. కానీ ఇటీవల సిబిఐ
దూకుడు ప్రభావం ఉప ఎన్నికల పైన
పడుతోందని పలువురు భావిస్తున్నారు. కాంగ్రెసు, టిడిపిలు రెండు మూడు స్థానాలలోనైనా
గెలవాలనే ఉద్దేశ్యంతో ఉప ఎన్నికల బరిలో
దిగారు. కానీ అనూహ్యంగా జగన్
ఆస్తుల కేసు విచారణ జోరందుకోవడం
ఇప్పుడు కలిసి వస్తుందని కాంగ్రెసు,
టిడిపిలు భావిస్తున్నాయని అంటున్నారు. అనుకున్న వాటికంటే ఎక్కువ సీట్లనే గెలుపొందగలమని ఆయా పార్టీలు ధీమాగా
ఉన్నాయట.
సిబిఐ
దూకుడు వల్ల జగన్కు
సానుభూతి పెరుగుతుందనే వాదనను కాంగ్రెసు నేతలు తోసిపుచ్చుతున్నారు. విచారణ ప్రారంభమయ్యాక
దాదాపు పది శాతం ఓటర్లు
జగన్కు దూరమయ్యారని లెక్కలు
వేసుకుంటున్నారట. చంద్రబాబు కూడా.. జగన్ పైన ప్రజలకు
సానుభూతి కలిగించి ఆయనకు లబ్ధి చేకూరేలా
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి
ఉప ఎన్నికలకు ముందు వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నప్పటికీ, ఈ దూకుడు
కారణంగా జగన్ ఇమేజ్ డ్యామేజ్
అవుతుందని, కొంతమంది ఓటర్లు ఆయనకు దూరంగా జరిగే
అవకాశముందని భావిస్తున్నారని అంటున్నారు.
జగన్ను అరెస్టు చేస్తేనే
సానుభూతి బాగా పెరుగుతుందని, కానీ
ఆయన కేసుల విచారణలో దూకుడుగా
వ్యవహరించడం వల్ల ఎలాంటి నష్టం
ఉండదని, పైగా వైయస్సార్ కాంగ్రెసుకు
నష్టం జరుగుతుందని పలువురు అభిప్రాయపడుతున్నట్లుగా తెలుస్తోంది. కాబట్టి కేవలం ఆయన అక్రమాలను
వెలుగులోకి తీసుకు వచ్చే ఉద్దేశ్యంలో భాగంగా
కేసు విచారణను ఇలాగే వేగవంతం చేస్తారని,
జగన్ కోర్టుకు హాజరయ్యే 28న ఆయనను అరెస్టు
మాత్రం చేయరని చెబుతున్నారు.
జగన్
పైన ప్రజలు పునరాలోచిస్తున్న ఇలాంటి సమయంలో అరెస్టు చేసి, ఆయనపై సానుభూతి
పెంపొందించి వైయస్సార్ కాంగ్రెసుకు లబ్ధి చేసే బదులు
అరెస్టు చేయకుండా ఉండటమే ఉత్తమమని భావిస్తున్నారట. ఒకవేళ అలాంటి స్టెప్
తీసుకోవాలనుకుంటే ఉప ఎన్నికల అనంతరమే
తీసుకుంటారని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ వ్యూహంలో భాగంగానే
జగన్ అరెస్టు కథనాలకు చెక్ చెప్పేందుకు మంత్రుల
అరెస్టు ప్రచారం తెరపైకి తీసుకు వచ్చారని కొందరు అంటున్నారు. ఇలాగే జగన్ అరెస్టు
అంటూ ఊహాగానాలు చెలరేగితే ఆయన లబ్ధి చేకూరే
అవకాశముందని అధికార పార్టీ భావిస్తోందట. అందుకే మంత్రుల ఉదంతం తెరపైకి వచ్చిందంటున్నారు.
0 comments:
Post a Comment