కరీంనగర్:
ఉప ఎన్నికలలో విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెట్టి
రాష్ట్ర రాజకీయాలను కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు జూదంగా మార్చి వేశాయని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు
బుధవారం మండిపడ్డారు. బుధవారం కరీంనగర్ జిల్లా చొప్పదండి ఎమ్మెల్యే సుద్దాల దేవయ్య కూతురు వివాహానికి హాజరైన సందర్భంగా ఆయన ఆర్అండ్బి
అతిథి గృహంలో విలేకరులతో మాట్లాడారు. ఉప ఎన్నికలపై స్పందిస్తూ..
వైయస్సార్ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీలు ఎన్నికల్లో డబ్బులు విపరీతంగా ఖర్చుపెట్టి.. రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాయని విమర్శించారు.
ఇది చాలా దుర్మార్గం, నీచమని
మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రతి ఆరు మాసాలకోసారి
ఉప ఎన్నికలు రావడం, బెట్టింగులు పెట్టడం దారుణమన్నారు. రాజకీయాలు దుర్భరంగా మారాయని, ఒక ఓటుకు 2 వేలు,
3 వేల రూపాయలు వెచ్చించారని, ఇది ఎక్కడి వరకూ
పోతుందో అర్థం కాని పరిస్థితి
ఏర్పడిందన్నారు. ఉప ఎన్నికలపై వెయ్యి
కోట్ల రూపాయల మేరకు బెట్టింగులు కట్టారంటే
పరిస్థితిని అర్థం చేసుకోవచ్చని అన్నారు.
రాష్ట్రంలో అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయిందని ఆరోపించారు.
ప్రజా
సమస్యలను గాలికి వదిలి పెట్టి, ఇష్టానుసారంగా
ఎన్నికల్లో ఖర్చు పెట్టడం, ఓట్లు
కొనడం, మళ్లీ బెట్టింగులు పెట్టడం
ఒక జూదంలా మారిందన్నారు. దీనిపై ప్రజల్లో చైతన్యానికి కృషి చేస్తామని చెప్పారు.
కాగా, రాష్ట్రంలో వ్యవసాయాన్ని నిర్వీర్యం చేశారని, పెరిగిన ధరలతో రైతులు కోలుకోలేని
పరిస్థితిలో ఉన్నారని చంద్రబాబు చెప్పారు. పంటల సాగుకు సరిపడా
విత్తనాలను సరఫరా చేయలేని, చేతగాని
ప్రభుత్వమని మండిపడ్డారు.
ఈ ఖరీఫ్ సీజన్లో
రాష్ట్రంలో వివిధ పంటల సాగుకు
14 లక్షల 80వేల క్వింటాళ్ల విత్తనాలు
అవసరం కాగా ఇప్పటి వరకు
7 లక్షల 10 వేల క్వింటాళ్లు మాత్రమే
ఇచ్చారని తెలిపారు. రైతులు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు వెళ్లి విత్తనాలు కొనుగోలు చేస్తున్నారంటే ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుందో
అర్థమవుతుందన్నారు. విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక ధరలు పెరిగాయని, వాటికి
తగ్గట్లుగా గిట్టుబాటు ధరలను పెంచలేదని చెప్పారు.
ఏడాదిలో ఎరువుల ధరలు రెండింతలు పెరిగాయన్నారు.
వ్యవసాయానికి 9 గంటల విద్యుత్తు ఇస్తామని
చెప్పి 7 గంటలు కూడా సరిగా
ఇవ్వడం లేదన్నారు.
2004కు
ముందు పవర్ ప్లస్గా
ఉన్న రాష్ట్రాన్ని ఈ ప్రభుత్వం పవర్
కట్గా మార్చిందని దెప్పిపొడిచారు.
870 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించినా
ఇన్పుట్ సబ్సిడీని పూర్తిగా
ఇవ్వలేదని చెప్పారు. ఎరువులు, విత్తనాలు, పెట్రోల్, డీజిల్ ధరలనైనా తగ్గించాలని లేదా పంటలకు మద్దతు
ధరలనైనా పెంచాలని ఆయన డిమాండ్ చేశారు.
0 comments:
Post a Comment