హైదరాబాద్/బెంగళూరు: కర్నాటక మాజీ మంత్రి గాలి
జనార్ధన్ రెడ్డి బెయిల్ కుంభకోణం కేసులో కీలక పాత్ర పోషించిన
ఆయన సోదరుడు గాలి సోమశేఖర రెడ్డి,
కంప్లి శాసనసభ్యుడు సురేష్ బాబులు అజ్ఞాతంలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ కేసులో వరుస
అరెస్టులు కొనసాగుతున్న నేపథ్యంలో వారిద్దరూ కొద్ది రోజులుగా ఎవరికీ అందుబాటులోకి రావడం లేదు. ఈ
కేసులో ఇప్పటికే పలువురిని అరెస్టు చేశారు.
తాజాగా
దశరథ రామి రెడ్డినూ కూడా
అరెస్టు చేశారు. ఇతనిని ఎసిబి అధికారులు ఆదివారం
కోర్టులో హాజరుపర్చారు. దీంతో అతనికి వచ్చే
నెల 3వ తేది వరకు
రిమాండ్ విధించారు. అతనిని చర్లపల్లి జైలుకు తరలించారు. గాలికి బెయిల్ ఇప్పించేందుకు ఇరవై కోట్లు మాత్రమే
కాదని రూ.100 కోట్లు ఇచ్చేందుకు కూడా సిద్ధపడినట్లుగా ఇటీవల
అరెస్టయిన జిల్లా జడ్జి తన వాంగ్మూలంలో
చెప్పారు.
చంచల్‌గూడ జైలులో ఉన్నప్పుడు
ములాఖత్‌లో భాగంగా తనను
కలిసేందుకు వచ్చిన అనుచరులకు ఎట్టి పరిస్థితుల్లో బెయిల్
ఇప్పించాలని, ఇంత ఖర్చయినా ఫర్వాలేదని
గాలి చెప్పేవాడని తెలుస్తోంది. దాంతో ఈ బాధ్యత
ఆయన సోదరుడు సోమశేఖర రెడ్డి, కర్నాటకలోని కంప్లి శాసనసభ్యుడు సురేష్‌లు తమ భుజానికి
ఎత్తుకున్నారు. ఇప్పటి వరకూ వెల్లడయిన అంశాల
ప్రకారం బెయిల్ కోసం వీరు వేర్వేరు
వ్యక్తుల ద్వారా మూడుసార్లు ప్రయత్నాలు చేశారు.
తొలుత
బెంగళూరుకు చెందిన ఓ రియల్ ఎస్టేట్
సంస్థ ద్వారా న్యాయమూర్తి లక్ష్మీ నరసింహ రావును సంప్రదించారు. బెయిల్ ఇప్పిస్తే వంద కోట్ల రూపాయలు
చెల్లించేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. వీరి భరోసా మేరకు
లక్ష్మీ నరసింహ రావు అప్పటి సిబిఐ
న్యాయమూర్తి నాగమారుతి శర్మను సంప్రదించగా ఆయన నిరాకరించారు. ఆ
తర్వాత కొత్తగా మరో రెండు సిబిఐ
న్యాయస్థానాలు ఏర్పాటు కావడం వాటిలో ఒక
దానికి పట్టాభి న్యాయమూర్తిగా రావడంతో లక్ష్మీ నరసింహ రావు తనకు పరిచయం
ఉన్న సూర్య ప్రకాశ్ బాబు
ద్వారా ప్రయత్నించారు, అది కూడా విఫలమైంది.
ఇదే సమయంలో గాలి మనుషులకు రౌడీషీటర్
యాదగిరి రావు పరిచయం అయ్యాడు.
మొత్తం రూ.20 కోట్లకు ఒప్పందం
కుదిరింది. దీనిలో భాగంగా గాలికి సిబిఐ న్యాయమూర్తి పట్టాభి
రామారావు బెయిల్ మంజూరు చేశారు. దీంతో పట్టాభికి మొదటి
దఫా కొంత డబ్బు చెల్లించారు.
ఇది బయటకు రావడంతో ఎసిబి
వరుసగా అరెస్టులు ప్రారంభించింది. ఇప్పటికే నలుగురు న్యాయమూర్తులతో పాటు రౌడీషీటర్ యాదగిరి,
పట్టాభి తనయుడు రవిచంద్ర, సూర్య ప్రకాశ్ బాబు,
దశరథ రామిరెడ్డిలను ఎసిబి అధికారులు అరెస్టు
చేశారు.
ఈ కేసులో ఇక మిగిలింది సోమశేఖర
రెడ్డి, సురేష్‌లే. వీరి అరెస్టు
కూడా తప్పకపోవచ్చుననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో వారిద్దరు అజ్ఞాతంలోకి
వెళ్లినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే వీరికి లుకౌట్ నోటీసులు జారీ చేశారు. దేశం
విడిచి పారిపోకుండా వారి కోసం ఎసిబి
లుకవుట్ నోటీసులు జారీ చేసింది.
0 comments:
Post a Comment