న్యూఢిల్లీ:
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండ్‌కు పిసిసి అధ్యక్షుడు
బొత్స సత్యనారాయణ పరోక్ష మద్దతు పలికారు. తెలుగువారికి రెండు రాష్ట్రాలు ఉంటే
తప్పేమిటని ఆయన అడిగారు. హిందీ
మాట్లాడేవారికి 13 రాష్టాలు ఉన్నప్పుడు తెలుగు మాట్లాడేవారికి రెండు రాష్ట్రాలు ఉంటే
తప్పేమిటని ఆయన శనివారం మీడియా
ప్రతినిధులతో అన్నారు. రాష్ట్రపతి ఎన్నికలపై పార్టీ అధిష్టానానికి నివేదిక ఇచ్చేందుకు ఢిల్లీ వచ్చినట్లు చెప్పిన ఆయన తెలంగాణపై పార్టీ
అధిష్టానం త్వరగా నిర్ణయం తీసుకోవాలని అన్నారు.
తెలంగాణపై
కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించిందని, త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నానని ఆయన అన్నారు. రాష్ట్ర
విభజనపై పార్టీ అధిష్టానం, కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా
దానికి కట్టుబడి ఉంటానని ఆయన చెప్పారు. రాష్ట్ర
మంత్రివర్గ విస్తరణపై తనకు ఏ విధమైన
సమాచారం లేదని, దానిపై ఎఐసిసి కార్యదర్శి కెబి కృష్ణమూర్తే చెబుతారని
ఆయన అన్నారు.
వైయస్సార్
కాంగ్రెసు పార్టీతో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదని ఆయన
అన్నారు. వైయస్ జగన్‌ను
రాజకీయంగా వేధిస్తున్నారంటూ మాట్లాడిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు రాష్ట్రపతి ఎన్నికల సమయంలో మాట మార్చారని, వైయస్సార్
కాంగ్రెసు పార్టీ ద్వంద్వ వైఖరిని ప్రజలు గమనిస్తున్నారని ఆయన చెప్పారు. వైయస్సార్
కాంగ్రెసు తమకు ప్రత్యర్థి అని
ఆయన చెప్పారు.
ఆగస్టు,
సెప్టెంబర్‌ల్లో తెలంగాణ రాష్ట్రం
వస్తుందని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు
ప్రకటన చేయడం తప్పేమీ కాదని
ఆయన అన్నారు. ఉద్యమ పార్టీ నేతగా
విశ్వాసంతో ఆ ప్రకటన చేసి
ఉంటారని, దాన్ని తప్పు పట్టాల్సిన అవసరం
లేదని ఆయన అన్నారు. కోర్టు
నుంచి క్లియరెన్స్ వచ్చిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయని ఆయన చెప్పారు. సోనియా
నాయకత్వాన్ని బలపరిచేవారిని అందరినీ కలుపుకుని ముందుకు సాగుతామని ఆయన చెప్పారు.
తెలుగుదేశం
పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు
నిలకడ లేని మనిషి అని
ఆయన అన్నారు. మంత్రి ధర్మాన ప్రసాద రావు కమిటీ పార్టీ
పరిస్థితిపై నివేదికను తయారు చేసిందని, త్వరలోనే
సమర్పిస్తుందని ఆయన చెప్పారు. ధర్మాన
నేతృత్వంలోని కమిటీ మంత్రుల కమిటీ
కాదని, పార్టీ కమిటీ అని ఆయన
చెప్పారు. రాజకీయ ప్రయోజనం కోసమే వైయస్సార్ కాంగ్రెసు
పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ సిరిసిల్ల
పర్యటన తలపెట్టారని ఆయన వ్యాఖ్యానించారు.
0 comments:
Post a Comment