హైదరాబాద్:
సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీ నారాయణను బద్నాం చేయాలనే కుట్రతోనే ఆయన కాల్‌లిస్టును
సేకరించినట్లు సిఐడి స్పష్టం చేసింది.
కాల్‌లిస్ట్ కేసులో కీలక పాత్ర హైదరాబాద్‌కు చెందిన పారిశ్రామికవేత్త,
ఎమ్మార్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రఘురామ కృష్ణరాజుదే అని తేల్చింది. ఈ
కేసులో ఆయనను మొదటి నిందితుడిగా
చేర్చింది. మరో పారిశ్రామిక వేత్త
రమణారావును ఏ-2గా, బిఎస్ఎన్ఎల్
అధికారి హనుమంతరావును ఏ-3గా చేర్చింది.
ఇప్పటికే
అరెస్టు చేసిన కుంకాల వెంకారెడ్డి
ఏ-4గా పేర్కొంది. బుధవారం
కోర్టుకు సమర్పించిన కెవి రెడ్డి రిమాండ్
రిపోర్టులో సిఐడి అనేక కీలక
అంశాలను ప్రస్తావించింది. కెవి రెడ్డిని పట్టుకున్నామని,
మిగిలిన ముగ్గురు పరారీలో ఉన్నారని తెలిపింది. జెడి లక్ష్మీనారాయణను బద్నాం
చేసేందుకే ఆ నలుగురు కలిసి
కుట్ర పన్నినట్లు స్పష్టం చేసింది. మహారాష్ట్ర, నాందేడ్ జిల్లా కరబ్‌ఖాండ్ గ్రామంలో
ఇంద్ భారత్ ఎనర్జీస్ లిమిటెడ్
అనే సంస్థకు రఘురాజు చైర్మన్‌గా ఉన్నారు.
అదే సంస్థ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్న కెవి
రెడ్డి ద్వారా జెడి కాల్ లిస్ట్‌ను సేకరించారు. విశ్వసనీయ
వర్గాల సమాచారం ప్రకారం రిమాండ్ రిపోర్టులో ఏముందంటే... హైదరాబాద్‌లోని కుషాయిగూడకు చెందిన
మిక్ ఎలక్ట్రానిక్స్ డైరెక్టర్ ఎంవి రమణ రావు,
రఘురాజు మధ్య పరిచయం ఉంది.
రమణారావు ద్వారా నాగపూర్ టెలికం అధికారి అయిన హనుమంత రావును
సంప్రదించి... జెడి సెల్ నంబరు
సహా మొత్తం 3 సెల్‌ఫోన్ల నంబర్ల
కాల్‌డేటా కావాలని అడిగారు.
ఈ క్రమంలో.. విజయవాడ బిఎస్ఎన్ఎల్ ఐటీఎస్ డైరెక్టర్ రామకృష్ణ నుంచి జెడి కాల్
డేటా కోసం అబిడ్స్‌లోని
భారత్ సంచార్ భవన్ (టెలికం ఆఫీస్)లో అదనపు జనరల్
మేనేజరు (ఆపరేషన్స్) రవిచంద్రకు ఈ-మెయిల్ వెళ్లింది.
రామకృష్ణ
తమ శాఖ అధికారే కావడంతో...
రవిచంద్ర జెడి కాల్ డేటా
ఇచ్చారు. తర్వాత.. ఆ లిస్ట్ బిఎస్ఎన్ఎల్
నోడల్ అధికారి(హైదరాబాద్) బాల్‌సింగ్ వద్దకు
చేరింది. ఆ లిస్ట్ తీసుకుని
పంపాలని నాగ్‌పూర్ బిఎస్ఎన్ఎల్
ఉన్నతాధికారి కె.హనుమంత రావు
తనకు ఎస్ఎంఎస్ చేసినట్లు రామకృష్ణ సిఐడి అధికారులకు తెలిపారు.
ఆయన ఆ లిస్ట్‌ను
హనుమంత రావుకు అందించారు. అదే జాబితా హనుమంతరావు
ద్వారా కెవి రెడ్డికి, అక్కడి
నుంచి రఘురాజుకు అందింది. దీని ఆధారంగానే జెడిపై
రఘురాజు హైకోర్టులో పిటిషన్ వేశారు.
ఆ తర్వాత జగన్ మీడియా ద్వారా
కాల్‌లిస్ట్‌ను కూడా బయటపెట్టారు.
జెడి కాల్‌లిస్ట్ సేకరించడంలో
అక్రమ విధానాలకు, కుట్రకు పాల్పడ్డారని రఘురాజు, రమణారావు, హనుమంతరావు, కెవి రెడ్డిలపై కేసులు
నమోదు చేసినట్లు పోలీసులు కోర్టుకు నివేదించారు.
మొత్తం
మూడు సెల్ నంబర్ల డేటా
అడగటంతో.. టెలికం ఉన్నతాధికారి హనుమంత రావు ముందు జాగ్రత్త
పడ్డారు. ఎందుకైనా మంచిదని, ఆ నెంబర్ల నుంచి
బెదిరింపు కాల్స్ వస్తున్నాయని పోలీసులకు ఫిర్యాదు చేయమని, ఫిర్యాదు ప్రతిని తనకు ఇవ్వాలని కెవి
రెడ్డికి సూచించారు. ఆ మేరకు కెవి
రెడ్డి జనవరి 16న నాందేడ్ జిల్లా
ముఖేడ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఒరిజనల్‌ను పోలీసులకు ఇచ్చారు.
కార్బన్ కాపీపై వ్యూహాత్మకంగా తేదీ వేయకుండా దానిని
హనుమంత రావుకు ఇచ్చారు.
ఈ కాపీపై హనుమంత రావు డిసెంబరు 14 తేదీ
వేసి తన కార్యాలయంలో భద్రపరిచారు.
మరాఠీలో రాసిన ఆ ఫిర్యాదును
కూడా మన రాష్ట్ర సిఐడి
పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసునకు సంబంధించిన
కొన్ని పత్రాలను నాగపూర్ టెలికం డైరెక్టర్ బుద్ధి ప్రకాశ్ నుంచి స్వాధీనం చేసుకున్నట్లు
తెలిపారు. ఈ కేసులో సిబిఐ
జెడి సహా మొత్తం 19 మందిని
సాక్షులుగా చేర్చారు.
0 comments:
Post a Comment