తెలుగుదేశం
పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు
బిసి మంత్రాన్ని జపిస్తున్నారు. శనివారం జరిగిన పార్టీ సమావేశంలో ఆయన బిసిలకు వచ్చే
సాధారణ ఎన్నికలలో వంద సీట్లు ఇస్తామని
ప్రకటించారు. దీంతో బాబు బిసి
జపం తెలుగుదేశం పార్టీకి లాభిస్తుందా అనే చర్చ ప్రారంభమైంది.
బాబు హామీ 2014 ఎన్నికలలో టిడిపిని అధికారంలోకి తీసుకు వస్తుందా అనే ప్రశ్న రాజకీయవర్గాల్లో
చర్చనీయాంశమైంది.
అత్యధికులు
బాబు వ్యాఖ్యలు టిడిపికి లబ్ధి చేకూర్చేవే అని
అంటున్నారు. మరికొందరు ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు చిరంజీవిని ఉదహరిస్తున్నారు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించినప్పుడు అత్యధిక బిసిలకు తమ పార్టీ తరఫున
టిక్కెట్లు ఇచ్చారని, కానీ అది ఫలితం
ఇవ్వలేదని అంటున్నారు. తమ పార్టీకి మొదట
నుండి అండగా ఉన్న బిసిలను
దగ్గర చేర్చుకునేందుకు చంద్రబాబు ఈ విధంగా వ్యూహరచన
చేశారని అంటున్నారు.
తొలి
నుండి కాంగ్రెసు పార్టీకి అగ్రవర్ణాలు, ఎస్సీ, ఎస్టీల మద్దతు ఉందనే వాదన ఉంది.
స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగుదేశం
పార్టీని స్థాపించిన తర్వాత బిసి వర్గాలు ఆ
పార్టీ వెంట నడిచాయి. టిడిపి
ఎప్పుడు అధికారంలోకి వచ్చినా అది బిసిల అండతోనే
అనే వాదన ఉంది. ఇటీవలి
వరకు బిసిలు టిడిపి వెంటే ఉన్నారు. కడప
పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ స్థాపించాక చాలామంది అటువైపు మరలారని అంటున్నారు.
తెలుగుదేశం
పార్టీ నేతలు కూడా బిసిలు
టిడిపికి దూరంగా జరిగారని అంగీకరిస్తున్నారు. ఆ పార్టీ సీనియర్
నేత, రాజ్యసభ సభ్యుడు దేవేందర్ గౌడ్ ఇటీవల మాట్లాడుతూ..
బిసిలు పార్టీకి దూరమయ్యారని, వారిని పార్టీకి దగ్గరకు చేసే విధంగా కార్యక్రమాలు
చేపడతామని చెప్పారు. ఆ పార్టీ బిసి
నేతలు కూడా బాబు వద్ద
ఇదే విషయాన్ని చెబుతున్నారని తెలుస్తోంది. శనివారం జరిగిన సమావేశంలో బిసి నేతలు తమ
వర్గానికి అత్యధిక సీట్లు కేటాయించాలని, అలా అని ప్రకటన
చేయాలని, అప్పుడే పార్టీకి లబ్ధి చేకూరుతుందని పట్టుబట్టారట.
సోమ,
మంగళ వారాలు రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశంలో చర్చించి పార్టీ బిసి విధానాన్ని ఖరారు
చేయాలని అధినేత నిర్ణయానికి వచ్చారట. తొలి నుండి పార్టీ
వెంట నడిచిన బిసిలు ఇటీవలి కాలంలో దూరం అయిన కారణంగానే
వరుస ఉప ఎన్నికలలో పార్టీ
ఘోరంగా దెబ్బతింటుందనే అభిప్రాయానికి టిడిపి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు వంద సీట్లు
బిసిలకు ఇస్తామని ఎవరూ ప్రకటించలేదు. ఇప్పుడు
టిడిపి అధికారిక ప్రకటన చేయడం వల్ల పార్టీ
బాగా పుంజుకుంటుందని భావిస్తున్నారు.
అంతేకాదు
టిడిపి అధికారంలోకి వస్తే బిసిలకు రూ.10వేల కోట్ల రూపాయలతో
ప్రత్యేక బడ్జెట్ రూపొందించనున్నట్లు బాబు సమావేశంలో హామీ
ఇచ్చినట్లుగా తెలుస్తోంది. బిసిలకు పార్టీలో ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా వైయస్ జగన్‌ను,
కాంగ్రెసును ఖచ్చితంగా దెబ్బతీయవచ్చునని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారని తెలుస్తోంది. మరి
బాబు బిసి మంత్రం టిడిపికి
ఏ మేరకు లబ్ధి చేకూరుస్తుందో
చూడాలి. వంద మందికి టిక్కెట్లు
సాధ్యాసాధ్యాలపై కూడా పార్టీలో చర్చ
జరుగుతున్నట్లు తెలుస్తోంది.
0 comments:
Post a Comment