హైదరాబాద్:
అక్రమాస్తుల కేసులో అరెస్టై చంచల్‌గూడ జైలులో
ఉన్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు
వైయస్ జగన్మోహన్ రెడ్డిని కాపాడేందుకే కిరణ్ కుమార్ రెడ్డి
ప్రభుత్వం ఆయన కేసులో సుప్రీం
కోర్టు నుండి నోటీసులు అందుకున్న
ఆరుగురు అవినీతి మంత్రులకు న్యాయ సహాయం అందిస్తోందని
తెలుగుదేశం పార్టీ నేత ఎర్రన్నాయుడు ఆదివారం
ఆరోపించారు. మంత్రులకు న్యాయ సహాయం నిర్ణయంపై
ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజాధనాన్ని
ఖర్చుపెట్టి అవినీతి ఆరోపణలున్న మంత్రులకు న్యాయ సహాయం అందించడంపై
ప్రజలకు ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మాజీ మంత్రి మోపిదేవి
వెంకటరమణతో పాటు అవినీతి ఆరోపణలు
ఎదుర్కొంటున్న ఇతర మంత్రులను మంత్రివర్గం
నుంచి ఎందుకు తొలగించలేదని ముఖ్యమంత్రిని ఈ సందర్భంగా ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి వ్యవహారం చూస్తుంటే అవినీతికి మద్దతు ఇస్తున్నట్లుగానే ఉందని అనుమానం వ్యక్తం
చేశారు.
మంత్రులకు
ప్రభుత్వ ఖర్చుతో న్యాయవాదులను నియమించినట్లే... ఒక జీవో జారీ
చేయడం ద్వారా జగన్ న్యాయవాదులకు కూడా
ప్రజాధనాన్ని ఖర్చు పెడితే సరిపోతుందని
ఎద్దేవా చేశారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్
విజయమ్మ ఢిల్లీ పెద్దలను కలిసిన వెంటనే ఇక్కడ మంత్రులకు న్యాయ
సహాయాన్ని అందిస్తూ జీవోలు జారీ అయ్యాయని, ఇది
కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీల మధ్య ఫిక్సింగ్ వ్యవహారాన్ని
స్పష్టం చేస్తోందని ఎర్రన్నాయుడు ఆరోపించారు.
దొంగలు,
గజదొంగలు, అవినీతిపరులకు ప్రజల డబ్బును ఖర్చు
చేయడం రాజ్యాంగ విరుద్ధమని ఆయన ఆక్షేపించారు. పరిటాల
రవి హత్య కేసులో 45 రోజుల
పాటు పలువురితో మాట్లాడి, పుస్తకాలు చదవి జగన్ తరఫున
వాదించి ఆయనను కాపాడానన్న కిరణ్
ఇప్పుడు మంత్రులకు న్యాయ సహాయం చేయడం
ద్వారా జగన్ పైన కేసులను
నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. ప్రభుత్వం తీరుపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి
నారాయణ కూడా విమర్శలు చేశారు.
రాష్ట్రాన్ని
దోచుకుతిని కేసుల్లో ఇరుక్కున్న మంత్రులకు, ప్రభుత్వం న్యాయ సహాయం అందించడం
ఏమేరకు సబబని ఆయన ప్రభుత్వాన్ని
ప్రశ్నించారు. ప్రజాధనాన్ని ప్రభుత్వం దుర్వినియోగం చేయడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని
వ్యాఖ్యానించారు. వైయస్ కేబినెట్‌లో
పనిచేసిన ఆరుగురు మంత్రులు గీతారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, కన్నా
లక్ష్మీనారాయణ, పొన్నాల లక్ష్మయ్య, ధర్మాన ప్రసాదరావు, మోపిదేవి వెంకటరమణ జగన్ అక్రమ ఆస్తులు
కూడబెట్టడానికి దోహదపడ్డ 26 జీవోల జారీలో అక్రమాలకు
పాల్పడ్డారంటూ సుప్రీంకోర్టు నుంచి నోటీసులు అందుకున్నారని,
న్యాయ సహాయం అందించడానికి వీరంతా
నిజంగా పేదలా? అని ఆయన ప్రశ్నించారు.
0 comments:
Post a Comment